Begin typing your search above and press return to search.

నటుడిగా వందల కోట్లు.. సీఎం‌గా వేలల్లోనే! విజయ్ వేతనంపై సర్వత్రా చర్చ..

విజయ్ తన చివరి చిత్రాలకు తీసుకున్న పారితోషికంతో పోలిస్తే ఈ వేతనం చాలా స్వల్పం అనే చెప్పాలి.

By:  Tupaki Political Desk   |   11 May 2026 7:00 PM IST
నటుడిగా వందల కోట్లు.. సీఎం‌గా వేలల్లోనే! విజయ్ వేతనంపై సర్వత్రా చర్చ..
X

ఆయనో టాప్ స్టార్ ఒక్క సినిమా చేస్తే వందల కోట్లు.. రీజియన్ కే పరిమితం కాకుండా నేషనల్ వైజ్ గా ఆయనకు విపరీతమైన క్రేజ్.. ప్రతి సినిమా కోట్లలో వసూళ్లు తెచ్చిపెడుతుంది. కానీ ప్రస్తుతం ఆయన వేతనం తీసుకునే ప్రభుత్వ ఉద్యోగిగా మారిపోయారు. సినిమాలకు కోట్లలో తీసుకున్న హీరో కేవలం రూ. 2.5 లక్షలతో కాలం వెళ్లదీయాల్సిందే.. అయితే ఇది ఆయన ఇష్టంగా చేయాలనుకుంటున్న ఉద్యోగం.

ఏడాదికి వందల కోట్ల రూపాయల పారితోషికం అందుకునే ఒక స్టార్, కేవలం రెండు లక్షల రూపాయల జీతం వచ్చే పదవిని చేపట్టడం అనేది ఆయనకు ప్రజాసేవపై ఉన్న మక్కువను చాటిచెబుతోంది. కోలీవుడ్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోగా రికార్డులు సృష్టించిన విజయ్, ఇప్పుడు సామాన్యుల కష్టాలు తీర్చే ముఖ్యమంత్రిగా తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. సినిమాల్లో ఆయన ఒక్క డైలాగ్ చెబితే వచ్చే ఆదాయం కంటే, ఇప్పుడు ఒక నెలంతా కష్టపడితే వచ్చే వేతనం తక్కువే అయినా.. ఆ పీఠం ఇచ్చే గౌరవం, ప్రజల కోసం పనిచేసే అవకాశం అమూల్యమైనవి.

తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీ జోసెఫ్ విజయ్ వేతనంపై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. సినిమా రంగంలో కోట్లాది రూపాయల సామ్రాజ్యాన్ని వదిలి, రాజ్యాంగబద్ధమైన పదవిని చేపట్టిన ఆయనకు ప్రభుత్వం అందించే గౌరవ వేతనం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.

ముఖ్యమంత్రి వేతనం

తమిళనాడు ముఖ్యమంత్రికి వచ్చే వేతనం పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే తక్కువగా ఉండటం గమనార్హం. తమిళనాడు సీఎంగా విజయ్ నెలవారీ వేతనం సుమారు రూ. 2,05,000. తెలంగాణ సీఎం వేతనం అత్యధికంగా నెలకు సుమారు రూ. 4.1 లక్షలు. ఏపీ ముఖ్యమంత్రికి నెలకు సుమారు రూ. 3.35 లక్షల వేతనం అందుతుంది. అయితే విజయ్ కి వివిధ అలవెన్సులన్నీ కలుపుకుంటే నెలకు సుమారు రూ. 2,85,000 వరకు వస్తుంది. అంటే ఏడాదికి సుమారు రూ. 34.2 లక్షలు.

రెమ్యునరేషన్ vs జీతం

విజయ్ తన చివరి చిత్రాలకు తీసుకున్న పారితోషికంతో పోలిస్తే ఈ వేతనం చాలా స్వల్పం అనే చెప్పాలి. తన నటనా జీవితంలో చిట్టచివరి చిత్రం ‘జన నాయగన్’ కోసం విజయ్ దాదాపు రూ. 220 నుంచి రూ. 227 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. సినిమాల్లో ఒక్క రోజు సంపాదన కూడా లేని ఈ వేతనంతో ఆయన సంతృప్తి చెందడం, ప్రజాసేవ పట్ల ఆయనకున్న అంకితభావాన్ని సూచిస్తోంది.

అదనపు వసతులు, భద్రత

వేతనంతో పాటు ముఖ్యమంత్రి హోదాలో ఆయనకు ప్రభుత్వం నుంచి కొన్ని వసతులు అందుతాయి. ముఖ్యమంత్రి కోసం అధికారిక క్యాంప్ ఆఫీస్, నివాసం కేటాయిస్తారు. అత్యున్నత స్థాయి జడ్ ప్లస్ (Z+) సెక్యూరిటీ ఆయనకు రక్షణగా ఉంటుంది. అధికారిక కాన్వాయ్, ఇతర ప్రయాణ సౌకర్యాలు ప్రభుత్వం సమకూరుస్తుంది.

ముఖ్యమంత్రి పదవి అనేది కేవలం ఒక ఉద్యోగం కాదు, అది కోట్లాది మంది ప్రజల భవిష్యత్తును మార్చే బాధ్యత. విజయ్ వంటి స్టార్ హీరోలు తమ విలాసవంతమైన జీవితాన్ని, కోట్లాది రూపాయల ఆదాయాన్ని పక్కన పెట్టి ఇలాంటి బాధ్యతలు చేపట్టడం యువతలో స్ఫూర్తిని నింపుతోంది. ఆదాయం కంటే ప్రజల ప్రేమే మిన్న అని ఆయన నిరూపించారు.