టేకాఫ్ కాదు సార్.. తలరాతతో ఆడుకున్న గాల్లో ఆటా: జర్మనీ రన్‌వేపై వియత్నాం విమానం సర్కస్
కానీ ఆగస్టు 15న మ్యూనిచ్ నుంచి హనోయ్ బయలుదేరిన 'వియత్నాం ఎయిర్‌లైన్స్' బోయింగ్ 787-9 (వీఎన్34) విమానం ఎక్కిన ప్రయాణికులకు మాత్రం ఉచితంగా బిపి చెకప్, పైసా ఖర్చు లేని 'లైవ్ థ్రిల్లర్ సినిమా' అనుభవం దక్కింది.
By: A.N.Kumar | 20 Aug 2026 4:17 PM ISTసాధారణంగా విమానం ఎక్కితే "హాయిగా గాల్లో తేలిపోదాం" అని కలలు కంటారు. కానీ ఆగస్టు 15న మ్యూనిచ్ నుంచి హనోయ్ బయలుదేరిన 'వియత్నాం ఎయిర్‌లైన్స్' బోయింగ్ 787-9 (వీఎన్34) విమానం ఎక్కిన ప్రయాణికులకు మాత్రం ఉచితంగా బిపి చెకప్, పైసా ఖర్చు లేని 'లైవ్ థ్రిల్లర్ సినిమా' అనుభవం దక్కింది.
విమానం రన్‌వేపై పరుగులు తీయడం మొదలుపెట్టిందో లేదో రెండు సెకన్ల పాటు వేగం ఆగిపోయింది. "అబ్బే.. ఇంజిన్‌కు కాస్త ఆయాసం వచ్చిందేమోలే" అనుకునేలోపే మళ్ళీ వేగం పుంజుకుని బీ1 స్పీడ్ అందుకుంది. "హమ్మయ్య.. బయటపడ్డాం" అని ప్రయాణికులు ఊపిరి పీల్చుకునే లోపే విమానం మళ్ళీ బ్రేక్ వేసినంత పని చేసింది. టేకాఫ్ అవ్వాల్సిన సమయంలో విమానం "వెళ్లాలో వద్దో" అని సందేహించడం చూసి రన్‌వే కూడా కాసేపు కంగారుపడి ఉంటుంది.
ఇక టేకాఫ్ ఆపడానికి వీల్లేని పరిస్థితి. రన్‌వే చివర కేవలం 91 మీటర్లు మాత్రమే మిగిలి ఉంది. అంటే దాదాపు 'క్రికెట్ పిచ్' పొడవుకంటే కాస్త ఎక్కువ అన్నమాట.. సరిగ్గా ఆ గ్యాప్‌లో పైలట్ విమానం ముక్కును పైకి లేపారు. ఎంత గట్టిగా లేపారంటే.. విమానం తోక వెనుక భాగం రన్‌వేను నలిపేస్తూ ‘టెయిల్ స్ట్రైక్’ కొట్టింది. దెబ్బకు నాలుగు టైర్లు "టచ్‌లో ఉండటం మా వల్ల కాదు బాబోయ్" అంటూ టప్ టప్ మని పేలిపోయాయి.
అక్కడితో కథ ముగియలేదు. గాల్లోకి లేవగానే అలారమ్‌ల మోత.. "టైర్లలో గాలి లేదు.. తోక విరిగింది" అని విమానం మొత్తుకోవడంతో పైలట్లు రివర్స్ గేర్ వేశారు. బరువు తగ్గించుకోడానికి దాదాపు 9,000 అడుగుల ఎత్తులో టన్నుల కొద్దీ ఇంధనాన్ని గాల్లోకి వదిలేశారు. ఆ తర్వాత మ్యూనిచ్ విమానాశ్రయం చుట్టూ గంటకు పైగా విమానం చక్కర్లు కొడుతుంటే ప్రయాణికులు లోపల "దేవుడా.. ల్యాండ్ అయితే చాలు" అని జపాలు చేసుకున్నారు.
విమానం లోపల ఎయిర్ హోస్టెస్‌లు "అందరూ తలలు వంచి 'బ్రేస్ పొజిషన్'లో కూర్చోండి" అని చెప్పడంతో ప్రయాణికులకు అసలు రోలర్‌కోస్టర్ రైడ్ ఏంటో అర్థమైంది. చివరికి 271 మంది ప్రయాణికులు.. 16 మంది సిబ్బంది ప్రాణాలతో సురక్షితంగా కిందకు దిగారు. విమానానికి మాత్రం గట్టిగా నష్టం వాటిల్లింది.
టేకాఫ్‌లో రెండుసార్లు బ్రేకులు, నాలుగు టైర్లు ఖాళీ, తోకకు దెబ్బ.. అయినా కూడా సురక్షితంగా ల్యాండ్ అయ్యారంటే అది పైలట్ల నైపుణ్యం అనాలా? లేక ఆ ప్రయాణికుల అదృష్టం అనాలా? ఏది ఏమైనా "మళ్ళీ ఎప్పుడు విమానం ఎక్కుతారు?" అని ఆ 271 మందిని అడిగితే.. బహుశా నడుచుకుంటూ వెళ్ళడమే నయమని సమాధానమిస్తారేమో..
