Begin typing your search above and press return to search.

చంపేస్తారా నన్ను..? ఎస్ఐతో విడదల రజిని వాగ్వాదం.. కిందపడిపోయిన మాజీ మంత్రి

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమ పార్టీ నేత పట్ల పోలీసులు ఖర్కశంగా వ్యవహరించారని ఆరోపిస్తూ వైసీపీ నేతలు, కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు.

By:  Tupaki Political Desk   |   23 Oct 2026 6:23 PM IST
చంపేస్తారా నన్ను..? ఎస్ఐతో విడదల రజిని వాగ్వాదం.. కిందపడిపోయిన మాజీ మంత్రి
X

జడ్పీ ఎన్నికల నామినేషన్ల కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతల మధ్య ముగిసింది. నామినేషన్‌లకు చివరి రోజు కావడంతో పలుచోట్ల వైసీపీ నేతలు గృహ నిర్బంధాలను ఛేదించుకుని బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజనిని పోలీసులు అడ్డుకున్నారు. మూడు రోజులుగా గృహ నిర్బంధంలో ఉన్న రజినిని కలిసేందుకు ఎడ్లపాడు జడ్పీటీసీ అభ్యర్థి పందుల బుల్లబ్బాయి ఆమె ఇంటికి వెళ్లారు. దాంతో రజిని ఇంటి నుంచి బయటకు వస్తుండగా, అక్కడ విధుల్లో ఉన్న ఎస్ఐ ప్రియాంక అడ్డుకున్నారు. ఈ సమయంలో ఇద్దరి మధ్య తోపులాట చోటుచేసుకోగా, మాజీ మంత్రి విడదల రజిని కింద పడిపోయారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను వైసీపీ ఎక్స్ లో షేర్ చేసింది. ఖాకీల కర్కశత్వం ప్రదర్శించారని మండిపడింది.

నామినేషన్లు సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తతలు నెలకున్నాయని చెబుతున్నారు. దీంతో ఘర్షణలకు కారణమవుతున్నారనే ఆరోపణలతో వైసీపీ నాయకులను పోలీసులు హౌసు అరెస్టులు చేశారు. చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజిని కూడా మూడు రోజులుగా ఇంట్లోనే ఉండిపోయారు. ఇక చివరి రోజు అయిన శుక్రవారం ఆమె చేతుల మీదుగా బి.ఫారం తీసుకోవాలనే ఆలోచనతో ఎడ్లపాడు జడ్పీటీసీ అభ్యర్థి రజిని ఇంటికి వచ్చారు. ఆ సమయంలో ఎస్ఐ ప్రియాంక అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. దీంతో మాజీ మంత్రి రజిని కింద పడిపోగా, చేతికి స్వల్ప గాయమైంది. అయితే రజిని కింద పడిన చోట షార్ప్ ఎడ్జ్ ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పినట్లైంది. కాగా, కింద పడిపోయిన రజిని వెంటనే తేరుకుని నన్ను చంపేస్తారా? ఎవరు పంపించారు నిన్ను అంటూ ఎస్ఐపై మండిపడ్డారు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమ పార్టీ నేత పట్ల పోలీసులు ఖర్కశంగా వ్యవహరించారని ఆరోపిస్తూ వైసీపీ నేతలు, కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇలా భక్షకుల్లా మారి దాడులకు పాల్పడుతుంటే.. ఇక ప్రాణాలు కాపాడేది ఎవరు అంటూ వైసీపీ ఎక్స్ లో ప్రశ్నించింది. ఈ సంఘటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనిత జవాబు చెప్పాలని నిలదీసింది. మరోవైపు నామినేషన్ల దాఖలు చేసే సమయంలో భద్రతా పరమైన ఇబ్బందులు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, పోలీసు రక్షణ మధ్య నామినేషన్లు వేయిస్తామని ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా ఆదేశాలు జారీ చేశారు. అయితే చాలాచోట్ల తమ నామినేషన్ సమర్పించేందుకు అనుకూలమైన వాతావరణం లేదని, దాడుల కారణంగా నామినేషన్లు వేయలేకపోయామని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి.