Begin typing your search above and press return to search.

ఉద్యోగాల పేరుతో మోసం!. మాజీ మంత్రి విడదల రజినీకి చిక్కులు?

2022 మంత్రిగా పనిచేసిన విడదల రజిని హామీ మేరకే తాము ఆమె పీఏలు శ్రీకాంత్, రామకృష్ణ, అనుచరులు శ్రీగణేష్ కు డబ్బు ఇచ్చినట్లు ప్రకాశం జిల్లా దోర్నాలకు చెందిన బాధిత విద్యార్థి కృష్ణ మీడియాకు తెలిపాడు.

By:  Tupaki Political Desk   |   4 Nov 2025 5:31 PM IST
ఉద్యోగాల పేరుతో మోసం!. మాజీ మంత్రి విడదల రజినీకి చిక్కులు?
X

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి విడదల రజిని మరో వివాదంలో చిక్కుకున్నారు. అధికారంలో ఉండగా, పలువురు నుంచి వసూళ్లకు పాల్పడినట్లు ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న రజినీ ఇప్పుడు ఉద్యోగాల కుంభకోణంలో చిక్కుకున్నారు. వైసీపీ అధికారంలో ఉండగా, ఆమె అనుచరులు పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని పలువురి నుంచి ఉద్యోగాల పేరుతో డబ్బు వసూలు చేశారని, ఉద్యోగాలు ఇవ్వకపోగా చంపేస్తామని బెదిరిస్తున్నారని బాధితులు సోమవారం పల్నాడు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బాధితుల కథనం ప్రకారం వైసీపీ ప్రభుత్వంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా విడదల రజిని పనిచేసిన సమయంలో ఆమె అనుచరులైన బత్తుల శ్రీగణేష్, ఆయన సోదరుడు కుమారస్వామి, మాజీ మంత్రి పీఏలు మానుకొండ శ్రీకాంత్, దొడ్డా రామకృష్ణా కలిసి ముఠాగా ఏర్పడి ఉద్యోగాలిస్తామని డబ్బులు వసూలు చేసినట్లు చిలకలూరిపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిన్నతోపాటు పలువురు విద్యార్థులు, వైసీపీ నేతలు పల్నాడు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సుమారు 15 మంది నుంచి రూ.5 కోట్లు వసూలు చేశారని, ఉద్యోగాలు ఇవ్వకపోగా, తమను తిరిగి చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

2022 మంత్రిగా పనిచేసిన విడదల రజిని హామీ మేరకే తాము ఆమె పీఏలు శ్రీకాంత్, రామకృష్ణ, అనుచరులు శ్రీగణేష్ కు డబ్బు ఇచ్చినట్లు ప్రకాశం జిల్లా దోర్నాలకు చెందిన బాధిత విద్యార్థి కృష్ణ మీడియాకు తెలిపాడు. ఉద్యోగాలిస్తామని రజని పీఏలు శ్రీకాంత్, రామకృష్ణ డబ్బు అడిగితే, మేడమ్ తో మాట్లాడించాలని ఆ తర్వాతే ఇస్తానని తాను చెప్పినట్లు బాధితుడు వెల్లడించాడు. ఆ తర్వాత పీఏలు అప్పటి మంత్రి రజిని వద్దకు తీసుకువెళ్లారని తాను ఉద్యోగం కోసం అడిగితే ఏదైనా ఉంటే పీఏలతో మాట్లాడుకోవాలని ఆమె సూచించినట్లు బాధితుడు వివరించాడు. తనకు రజిని పీఏలకు మధ్య శ్రీగణేష్ ఉన్నాడని స్పష్టం చేశాడు. డబ్బు వసూలు చేసిన తర్వాత ఉద్యోగాలు ఇవ్వలేదని, మూడేళ్లుగా తిప్పించుకుంటారని వాపోయారు. మాజీ మంత్రి రజినీపై వైసీపీ నేతలు కూడా ఆరోపణలు, ఫిర్యాదులు చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే చిలకలూరిపేటలో మాజీ మంత్రి రజిని తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. స్టోన్ క్టషర్ వ్యాపారిని బెదిరించి డబ్బు వసూలు చేశారని ఇప్పటికే ఆమెపై కేసు నమోదైంది. ఇప్పుడు తాజాగా ఉద్యోగాల పేరుతో మోసం వ్యవహారంలోనూ బాధితులు మాజీ మంత్రి పేరును ప్రస్తావిస్తుండటం హీట్ ఫుట్టిస్తోంది.