టీడీపీతో స్టార్ట్... వైసీపీలో వెలిగి జనసేనలోకి ?
ఏమిటో రాజకీయాల్లో ప్రచారాలు ఎక్కువగా ఉంటాయి. అందులో నిజాలు ఏమిటి అన్నది తెలియదు. అయితే ఒట్టి ప్రచారాలు కొన్ని అయితే గట్టి ప్రచారాలు చాలానే ఉంటాయి.
By: Satya P | 17 Dec 2025 8:30 AM ISTఏమిటో రాజకీయాల్లో ప్రచారాలు ఎక్కువగా ఉంటాయి. అందులో నిజాలు ఏమిటి అన్నది తెలియదు. అయితే ఒట్టి ప్రచారాలు కొన్ని అయితే గట్టి ప్రచారాలు చాలానే ఉంటాయి. అలా నిజాలు అయినవి కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే వైసీపీకి చెందిన ఒక మహిళా నేత, మాజీ మంత్రి విషయంలో ఇటీవల కాలంలో ప్రచారాలు ఎక్కువ అవుతున్నాయి. ఆమె రాజకీయ భవిష్యత్తు మీద కూడా చర్చ సాగుతోంది. ఆమె ఎవరో కాదు గుంటూరు జిల్లాకు చెందిన విడదల రజని. ఆమె వైసీపీలో ఎంతో కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. ఇక ఆమె రాజకీయ జీవితం టీడీపీతో స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇపుడు ఆమె తన ఫ్యూచర్ పాలిటిక్స్ ని ఏ దిశగా తీసుకుని వెళ్ళాలి అన్నది సీరియస్ గానే ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.
వైసీపీతో గ్యాప్ :
విడదల రజనీ వైసీపీలోకి 2019 ఎన్నికల ముందు వచ్చారు. ఆమె అలా వచ్చీ రాగానే ఆమెకు ఆ పార్టీ చిలకలూరిపేట సీటు ఇచ్చింది. ఆమె అప్పటి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావునే ఓడించారు. అలా ఆమె వైసీపీలో కీలక నేతగా మారారు. వైసీపీ ప్రభుత్వంలో రెండో విడత విస్తరణలో ఆమె మంత్రి పదవిని అందుకున్నారు. ఆమె వైసీపీలో టాప్ పొజిషన్ లో ఉంటే వైసీపీలో ముందు నుంచి ఉన్న చాలా మంది నేతలు సైడ్ అయిపోయారు. ఇక ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ కూడా ఆ మధ్యనే వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలోకి వెళ్ళిపోయారు. ఇవన్నీ ఇలా ఉంటే ఆమెకు వైసీపీ హైకమాండ్ తో ఇటీవల కాలంలో గ్యాప్ ఏర్పడింది అని అంటున్నారు.
షిఫ్టింగులతో షాక్ :
విడదల రజనీని 2024 ఎన్నికలలో గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేయించారు. ఆమె అక్కడ ఓటమి చెందగానే తిరిగి చిలకలూరిపేటకు వచ్చారు. ఆమెకు వైసీపీ ఇన్చార్జి బాధ్యతలు కూడా అప్పగించారు. అయితే ఆమె వల్ల వైసీపీ గ్రాఫ్ ఏమీ పెరగడం లేదని పైగా వర్గ పోరు ఉందని భావించిన వైసీపీ పెద్దలు ఆమెను ఏకంగా రేపల్లెకు షిఫ్ట్ చేశారు. అక్కడ బీసీ నేతగా మహిళగా ఆమె ప్రస్తుత మంత్రి అనగాని సత్యప్రసాద్ తో పోటీ చేసి గెలవాలని టఫ్ టాస్క్ ఇచ్చారు. అయితే దీని మీద విడదల రజనీ అసంతృప్తిగా ఉన్నారు అని టాక్ అయితే గట్టిగా వినిపిస్తోంది.
పేటతోనే అంటూ :
అయితే రజనీ వర్గీయులు మాత్రం తాము పేటని విడిచేది లేదని చెబుతున్నారు. అక్కడ నుంచే రాజకీయం చేస్తామని లేకపోతే లేదని అంటున్నారు. రజనీ కూడా ఇదే రకమైన భావనతో ఉన్నారని అంటున్నారు. దాంతో ఆమె తాడేపల్లి కేంద్ర కార్యాలయం వైపు కూడా చూడడం లేదని అంటున్నారు. ఈ లోగా ఆల్టర్నేషన్ గా కొత్త ఆలోచనలు చేస్తున్నారు అని అంటున్నారు.
జనసేనలోకి :
విడదల రజనీ జనసేనలోకి వెళ్తారు అని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అయితే ఈ ప్రచారం ఇప్పటిది కాదు, గతంలోనూ ఉంది. ఆమె మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ద్వారా జనసేనలోకి వెళ్ళేందుకు చూస్తున్నారు అని గతంలో ప్రచారం అయితే సాగింది. కానీ అదంతా కాదని అప్పట్లో ఖండించారు. కానీ ఈసారి మాత్రం పక్కా అని అంటున్నారు. ఆమె ఈసారి జనసేనలో చేరడం తధ్యమని ఈ మేరకు జనసేన అధినాయకత్వం కూడా సుముఖంగా ఉందని అంటున్నారు. మరో వైపు చూస్తే వైసీపీలో ఆమె ప్రత్యర్థిగా ఉన్న మర్రి రాజశేఖర్ టీడీపీలో ఉన్నారు. ఇపుడు విడదల రజనీ జనసేనలో చేరితే కూటమిలో సఖ్యత ఎలా ఉంటుందో చూడాల్సి ఉంటుందని అంటున్నారు. మొత్తం మీద రజనీ రాజకీయం అయితే ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తోంది అని అంటున్నారు.
