Begin typing your search above and press return to search.

విడుదల రజినీ మళ్లీ కెమెరా యాక్షన్ మొదలుపెట్టింది!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) మాజీ మంత్రి విడుదల రజినీ మరోసారి సోషల్ మీడియా వేదికగా యాక్టివ్ అయ్యారు.

By:  A.N.Kumar   |   2 Nov 2025 12:26 PM IST
విడుదల రజినీ మళ్లీ కెమెరా యాక్షన్ మొదలుపెట్టింది!
X

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) మాజీ మంత్రి విడుదల రజినీ మరోసారి సోషల్ మీడియా వేదికగా యాక్టివ్ అయ్యారు. 2024 ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ, ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చాలా మంది వైసీపీ నాయకులు సైలెంట్‌గా ఉండగా, రజినీ మాత్రం తిరిగి కెమెరా యాక్షన్ మొదలుపెట్టారు.

* సోషల్ మీడియాపై రజినీ నమ్మకం

వైసీపీ ప్రభుత్వంలో విడుదల రజినీకి మంత్రి పదవి దక్కించుకోవడానికి సోషల్ మీడియా రీల్స్, వినూత్న హైటెక్ ప్రచారం బాగా ఉపయోగపడ్డాయని నియోజకవర్గంలో చర్చ ఉంది. యువ డైనమిక్ నేతగా ఫోకస్ కావడంలో ఈ ప్రచారం ఆమెకు సాయపడింది. ప్రజల్లో సేవ చేస్తున్నట్టుగా ఫేమస్ అవ్వడంలో ఈ ప్రచారం కీలకపాత్ర పోషించిందని అంటారు. తాజాగా, టీడీపీ ఊపులో ఓటమి తర్వాత, విడుదల రజినీ మళ్లీ పాత వ్యూహాన్నే అనుసరిస్తున్నట్టు కనిపిస్తోందని నియోజకవర్గంలో చర్చించుకుంటున్నారు.

* తుఫాను బాధిత రైతుల పరామర్శ

తాజాగా విడుదల రజినీ సోషల్ మీడియా టీం మరియు అభిమానులు ఆమె చేసిన సేవా కార్యక్రమాలను వైరల్ చేసే పనిలో పడ్డారు. దీనిలో భాగంగా నాదెండ్ల మండలం తూబాడు గ్రామంలో తుఫాను కారణంగా నష్టపోయిన రైతుల పంట పొలాలను ఆమె సందర్శించారు. రైతులకు అండగా ఉంటామని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారి పక్షాన పోరాడుతుందని భరోసా ఇచ్చారు.

ఈ పరామర్శకు సంబంధించిన వీడియోలకు ఆమె టీం మంచి సినిమాటిక్ పాటలను జోడించి సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఈ వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతూ, రజినీకి కావాల్సినంత ప్రచారం కల్పిస్తున్నాయి.

* ప్రత్యర్థుల నుంచి ట్రోల్స్

అయితే, రజినీ తిరిగి రీల్స్, వీడియో కంటెంట్‌తో జనాల్లోకి వెళ్లడంపై ఆమె వ్యతిరేక వర్గం ట్రోల్స్ మొదలుపెట్టింది. రజినీ రాజకీయ సేవ కంటే కూడా ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తోందని, ప్రజలకు సేవ చేసేది తక్కువ, ప్రచారం చేసుకునేది ఎక్కువ అంటూ ఆమె ప్రత్యర్థులు ఈ వీడియోలను ఎద్దేవా చేస్తున్నారు.

* నియోజకవర్గంలో రంజుగా ఫైట్

ఒకవైపు ట్రెండింగ్ రీల్స్‌తో రజినీ ప్రజల్లోకి వెళ్తుండగా, అంతే స్థాయిలో ఆమె ప్రత్యర్థులు ఈ ప్రచార పర్వాన్ని ట్రోల్స్ చేస్తున్నారు. మొత్తానికి, నియోజకవర్గంలో సోషల్ మీడియా కేంద్రంగా సాగుతున్న ఈ రాజకీయ పోరాటం యమ రంజుగా మారినట్టు తెలుస్తోంది. ప్రజా సేవతో పాటు ప్రచారం కూడా రజినీకి ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.