పేట పాలిటిక్స్‌లో దూకుడు తగ్గిన రజనీ.. !
2024 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి విడుదల రజని.. తిరిగి తన పాత నియోజకవర్గమైన చిలకలూరిపేటపైనే దృష్టి సారించారు.
By: Garuda Media | 28 Sept 2026 1:59 PM ISTచిలకలూరిపేట నియోజకవర్గంలో వైసీపీ రాజకీయాలు ప్రస్తుతం కొంత మెత్తబడ్డాయన్న చర్చ సాగుతోంది. కొన్నాళ్ల కిందటి వరకు దూకుడు ప్రదర్శించిన మాజీ మంత్రి విడదల రజనీ.. ఇటీవల కాలంలో కేసులతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. దీంతో తాజాగా ఆమె దూకుడు తగ్గించారని తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో ఈ స్థానం నుండి టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు విజయం సాధించారు. అప్పటి నుండి నియోజకవర్గంలో రాజకీయ ముఖచిత్రం గణనీయంగా మారింది. ప్రస్తుత చిలకలూరిపేట వైసీపీ రాజకీయాలపై ఆయన ప్రభావం ఎక్కువ గానే ఉందన్న చర్చ సాగుతోంది. అధికార పార్టీ దూకుడు ప్రదర్శిస్తుండగా.. విపక్షం బలం లేమితో ఇబ్బంది పడుతోందని అంటున్నారు.
2024 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి విడుదల రజని.. తిరిగి తన పాత నియోజకవర్గమైన చిలకలూరిపేటపైనే దృష్టి సారించారు. వైసీపీ అధినేత జగన్ ఆమెను చిలకలూరిపేట సమన్వయకర్తగా నియమిం చారు. దీంతో తిరిగి పుంజుకునే ప్రయత్నాలు సాగాయి. పోరాటాలు, ఆందోళనలతో నియోజకవర్గంలో వైసీపీ క్యాడర్‌ను తిరిగి బలోపేతం చేసేందుకు విడుదల రజని ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా నిరుద్యోగుల సమస్యలు, డీఎస్సీ నోటిఫికేషన్, ఇతర స్థానిక ప్రజా సమస్యలపై కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె నిరసనలు చేపట్టారు.
ఈ క్రమంలో ఆమె సహా కీలక నాయకులపై పోలీసులు కేసులు పెట్టారు. దీనికితోడు గతంలో ఉన్న వివాదాలు కూడా కొనసాగుతున్నాయి. దీంతో విడదల దూకుడు తగ్గిందన్న వాదన ఉంది. దీనికి తోడు పార్టీకి కీలక నేత, వైసీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ ఇటీవల ఆకస్మికంగా మరణించారు. ఈ పరిణామం స్థానిక వైసీపీ శ్రేణుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇది కూడా రజనీ దూకుడుపై ప్రభావం పడేలా చేసిందని అంటున్నారు. ఇక, పార్టీ పరంగా వలసలు, అంతర్గత విభేదాల ప్రభావం మరింతగా రజనీకి కంట్లో నలుసుగా మారుతోంది. 2024 ఎన్నికల ముందే మాజీ ఇన్‌ఛార్జ్ మల్లెల రాజేష్ నాయుడు వంటి కీలక నేతలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు.
మున్సిపల్ కౌన్సిలర్లు పార్టీలు మారడంతో నియోజకవర్గంలో వైసీపీ కొంతవరకు రక్షణాత్మక ధోరణిలో పడింది. అంతేకాకుండా, పార్టీలోని సీనియర్ నేత మర్రి రాజశేఖర్ వర్గానికి, రజని వర్గానికి మధ్య ఉన్న అంతర్గత సమీకరణాలు కూడా స్థానిక రాజకీయాలపై ప్రభావం చూపుతున్నాయి. కొత్త వ్యూహాలు వేసే నాయకుల కొరతకూడా కనిపిస్తోంది. నియోజకవర్గంలో కూటమి బలాన్ని ఢీకొట్టేందుకు విడుదల రజని తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నా.. కేడర్‌లో భరోసా నింపలేక, వెళ్లే వారిని ఆపలేక ఆమె సతమతం అవుతున్నారు. ఇటీవల కాలంలో ఆర్థిక ఇబ్బందులు కూడా చుట్టుముటాయన్న ప్రచారం జరుగుతోంది. ఇటువైపు చూస్తే.. ప్రత్తిపాటి పుల్లారావు చక్రం తిప్పుతున్నారు. దీంతో రజనీ దూకుడు తగ్గిందని చెబుతున్నారు.
