వైసీపీ నుంచి విడదల ...లీక్స్ ఇస్తున్నారా ?
అయితే రేపల్లెలో వైసీపీ గెలవడం అంత ఈజీ టాస్క్ కాదని అంటున్నారు. అక్కడ రెవిన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఉన్నారు.
By: Satya P | 7 Dec 2025 3:00 PM ISTవైసీపీ అధికారంలోకి రావడంతో ఎంతో మంది రాజకీయంగా అదృష్టవంతులు అయ్యారు. ఆ వరసలో గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన మహిళా నాయకురాలు విడదల రజనీ కూడా ఉంటారని అంటారు. ఆమె టీడీపీలో మొదట చేరినా తన రాజకీయ ఎదుగుదలను దృష్టిలో ఉంచుకుని 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. ఆమె చేరినదే లగాయితు పార్టీలో కీలక ప్రాధాన్యతను అందుకున్నారు. అంతే కాదు వెంటనే టికెట్ దక్కడం ఆ మీదట మంత్రివర్గంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన వైద్య ఆరోగ్య శాఖను సొంతం చేసుకోవడంతో ఆమె రాజకీయం అంతా నల్లేరు మీద నడకలా సాగిపోయింది.
కట్ చేస్తే :
అయితే 2019 నుంచి 2024 వరకూ అధికార వైభోగాలతో రాజయోగం తో సాగిన విడదల రజనీ రాజకీయం కాస్తా 2024 ఎన్నికల ముందే గతి తప్పింది. ఆమెను చిలకలూరిపేట నుంచి గుంటూరు పశ్చిమకు హై కమాండ్ షిఫ్ట్ చేసింది. తమది కాని చోట కొత్త నియోజకవర్గంలో చివరి నిముషంలో ఆమె పోటీకి దిగి భారీ ఓటమిని మూటగట్టుకున్నారు. దాంతో ఆమె తిరిగి చిలకలూరిపేటకు వచ్చేశారు. హైకమాండ్ సైతం ఆమె పట్ల కొంత సానుకూలత చూపించి పేటకు వైసీపీ ఇంచార్జి గా నియమించింది. మొదట్లో సైలెంట్ గా ఉన్నా కూడా ప్రత్యర్థుల నుంచి వస్తున్న విమర్శల బాణాలతో రజనీ దూకుడు పెంచారు. ఆమె పేటలో తనదైన రాజకీయం చేయాలనుకుంటున్న వేళ హఠాత్తుగా మరో ప్రచారం మొదలైంది. ఆమెకు మరో బదిలీ ఉందని ఆ ప్రచారం సారాంశం.
రెపల్లెకు రజనీ :
వైసీపీకి కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ టీడీపీలో చేరిపోవడం, అక్కడ వైసీపీ 2024 ఎన్నికల్లో టికెట్ ఇచ్చిన నేత పెర్ఫార్మెన్స్ సరిగ్గా లేకపోవడంతో ఫైర్ బ్రాండ్ లేడీగా ఉన్న విడదల రజనీని రేపల్లెకు రాజకీయ బదిలీ చేయాలని అధినాయకత్వం సీరియస్ గా ఆలోచిస్తోంది అన్నది ప్రచారంగా ఉంది. బీసీ నేతగా మాజీ మంత్రిగా రజనీ అయితేనే రేపల్లెలో వైసీపీకి విజయం సాధించిపెట్టగలరని అధినాయకత్వం నమ్ముతోందిట.
అనగాని ఇలాకాగా :
అయితే రేపల్లెలో వైసీపీ గెలవడం అంత ఈజీ టాస్క్ కాదని అంటున్నారు. అక్కడ రెవిన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఉన్నారు. ఆయన వరసగా అనేక పర్యాయాలు గెలుస్తూ వస్తున్నారు. ఒక విధంగా రేపల్లెని కంచుకోటగా ఆయన మార్చుకున్నారు. పైపెచ్చు ఆయన ఇపుడు రెవిన్యూ మంత్రిగా కీలకమైన పొజిషన్ లో ఉన్నారు. దాంతో రజనీ వర్గీయులు తమ నాయకురాలిని రేపల్లె షిఫ్టింగ్ చేస్తున్నారాన్న ప్రచారం పట్ల కలవర పడుతున్నారు. ఇప్పటికే గుంటూర్ పశ్చిమకు వెళ్ళి ఓటమిని కొని తెచ్చుకున్నారని ఉన్న సీటు సొంత సీటు అయిన చిలకలూరిపేటని విడిచిపెట్టడం మంచిది కాదని వారు అంటున్నారు.
పార్టీ మారుతారా :
అయితే హైకమాండ్ రజనీని రేపల్లెకి పంపించాలని కచ్చితమైన ఆలోచనతో ఉంది అని అంటున్నారు. దాంతో రజనీ పార్టీ మారుతారు అని ప్రచారం అపుడే స్టార్ట్ అయిపోయింది. నిజానికి రజనీ వైసీపీని వీడుతారా లేక లీక్స్ గా ఈ ప్రచారం సాగుతోందా అన్నది అయితే తెలియదు కానీ ఆమె విసిగి పోయి ఉన్నారని అంటున్నారు. అదే పనిగా రాజకీయ బదిలీలు చేయడం వల్ల తన పొలిటికల్ కెరీర్ ముగిసిపోతుందని ఆమె కలవరపడుతున్నారు అని అంటున్నారు.
అయితే రజనీ వైసీపీని వీడితే వైసీపీకి అది రాజకీయంగా నష్టమా లేక లాభమా అన్న చర్చ సాగుతోంది. ఇక చిలకలూరిపేటలో రజనీ వల్ల ఎంతో మంది కీలక నేతలు పార్టీని వీడారని ఆమె పార్టీని వీడితే వారు తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది. అంతే కాదు మరోసారి ఆమెకు పేట టికెట్ ఇచ్చినా విజయావకాశాలు ఏ మేరకు ఉంటాయని ఆలోచించిన మీదటనే రేపల్లెకు వెళ్ళమని హైకమాండ్ కోరుతోంది అని ప్రచారం కూడా ఉందిట. మొత్తానికి రజనీ రేపల్లెకు షిఫ్ట్ అవుతారా లేక వైసీపీ నుంచి ఏకంగా షిఫ్ట్ అవుతారా అన్నదే ఇపుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా ఉంది అని అంటున్నారు.
