ఉప రాష్ట్రపతి పోల్ : వైసీపీ బీఆర్ఎస్ లకు పెద్ద చిక్కులున్నాయి !
ఇక ఏ కూటమి వైపు లేకుండా తటస్థంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు ఈ విషయంలో ఏమి చేస్తాయి అన్న చర్చ అయితే ఉంది.
By: Satya P | 22 Aug 2025 3:00 AM ISTదేశంలో అత్యున్నత రాజ్యాంగ పదవి ఉప రాష్ట్రపతి. మొత్తం ఎనిమిది పదుల స్వాతంత్ర్య భారతంలో కేవలం నాలుగు అంటే నాలుగు సార్లు మాత్రమే ఉప రాష్ట్రపతి పదవి ఏకగ్రీవం అయింది. మిగిలిన అన్ని సార్లూ పోటీ ఉంటూ వచ్చింది. ఇక చూస్తే అనేక సార్లు గట్టి పోటీ కూడా ఉంటోంది. ఈసారి చూసినా అదే విధంగా పరిస్థితి ఉంటోంది. అయితే దేశంలో ఇపుడు ఎన్డీయే ఇండియా కూటమి మధ్యన పోరుగా కూడా మారుతోంది. ఇక ఏ కూటమి వైపు లేకుండా తటస్థంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు ఈ విషయంలో ఏమి చేస్తాయి అన్న చర్చ అయితే ఉంది.
వైసీపీ మీద ఒత్తిడి :
వైసీపీ అయితే ఎన్డీయే కూటమి అభ్యర్థి అయిన సీపీ రాధాక్రిష్ణన్ కి మద్దతు ఇచ్చేందుకు సిద్ధపడుతోంది అని అంటున్నారు. ఈ మేరకు స్పష్టమైన విధానమే ఉంది. కానీ ఇంకా చాలా రోజులు ఎన్నికలకు ఉంది. దాంతో ఈ మధ్యలో ఏమైనా జరుగుతుందా అన్నదే చర్చ. ఇలా ఎందుకు అంటే ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలుగు వారు. ఇది మొదటి పాయింట్. ఆయన ఏ రాజకీయ పార్టీలకు చెందిన వారు కారు. ఇది రెండవ పాయింట్. ఇక ఆయన న్యాయ కోవిదుడు. ఇది మూడవ పాయింట్. అంతే కాదు ఆయన బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు కావడం నాలుగవ కీలకమైన పాయింట్ గా ఉంది. దాంతో వైసీపీ మీద ఒత్తిడి ఉందని అంటున్నారు.
బలమైన సామాజిక వర్గం నుంచి :
వైసీపీకి ఇంధనంగా కీలక సాధనంగా ఒక బలమైన సామాజిక వర్గం ఉందని అంటూంటారు. ఇపుడు అదే సామాజిక వర్గం నుంచి ఒత్తిడి వస్తోంది అని చెబుతున్నారు. ఆయనకు మద్దతు ఇవ్వడం సముచితం అని అంటున్నారని చెబుతున్నారు. ఆయన రాజకీయాలకు అతీతుడు కాబట్టి నేరుగా ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇచ్చినట్లు అవదని చెబుతున్నారు. అదే సీపీ రాధాకృష్ణన్ కి మద్దతు ఇస్తే ఆయన బీజేపీకి చెందిన వారు. అంతే కాదు ఎన్డీయేకు మద్దతు ఇవ్వడం వల్ల కీలక వర్గాల అసంతృప్తికి గురి కావాల్సి ఉంటుందని అంటున్నారుట. దాంతో వైసీపీలో దీని మీదనే మల్లగుల్లాలు పడుతున్నారని అంటున్నారు. అయితే అంతిమ నిర్ణయం అధినాయకత్వానిదే కాబట్టి ఏదైనా అద్భుత్వం జరిగితే తప్ప ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వడం జరగదు అనే అంటున్నారు.
బీఆర్స్ విషయం అంతే :
మరో వైపు చూసుకుంటే కనుక బీఆర్ఎస్ లోనూ అదే రకమైన చర్చ ఉంది. ఆ పార్టీ కూడా న్యూట్రల్ గా ఉంది. అయితే తెలంగాణాలో కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్ధి చూస్తూ చూస్తూ ఆ పార్టీ నిలబెట్టిన అభ్యర్ధికి మద్దతు ఇవ్వ్వడమా అన్నదే ఒక అభ్యంతరం అంటున్నారు. కానీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజకీయ వాసనలు లేని వారుగా చూడాలని కూడా మరో మాట ఉంది. అంతే కాదు ఆయన అచ్చమైన తెలంగాణా వాసి. తెలంగాణా నినాదం మీద పుట్టుకొచ్చిన బీఆర్ఎస్ ఇపుడు ఈ కీలక సమయంలో కనుక ఆయనకు మద్దతు ఇవ్వకపోతే రేపటి రోజుల జవాబు ఇచ్చుకోవాల్సినవి చాలానే ఉంటాయని అంటున్నారు.
డైలమా కంటిన్యూ :
మొత్తం మీద చూస్తే వైసీపీలోనూ బీఆర్ఎస్ లోనూ డైలమానా అయితే ఉప రాష్ట్రపతి ఎన్నికల విషయంలో ఉందని అంటున్నారు. ఈ రెండు పార్టీలకు ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగానే ఉందని అంటున్నారు. తెలుగు వారు అభ్యర్ధి కాకుండా ఉంటే వేరే విషయం కానీ ఇపుడు అదే సెంటిమెంట్ వెంటాడేలా ఉందని అంటున్నారు. దాంతో ఎటు పాలుపోని స్థితి అయితే ఉందని అంటున్నారు. ఎన్డీయే వైపు ఉండాలని అనుకోవడానికి రాజకీయ కారణాలు అనేకం ఉంటాయి. కానీ ఇండియా కూటమి వైపు ఉండాలని అనుకోవడానికి అంతకు మించి తార్కిక కారణాలు ఉంటాయని అంటున్నారు.
దాంతో ఈ వ్యవహారం కొంచెం తేల్చుకోవడం కష్టమే అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఏమి చేయాలన్నది ఇదమిద్దంగా అయితే బీఆర్ఎస్ తేల్చుకోలేదు. కానీ వైసీపీ ఎన్ డీయే వైపే అని అంటున్నారు. చూడాలి మరి రానున్న రోజులలో ఏమైనా మర్పు ఉంటుందా ఉండదా అన్నది.
