రాజ్యాంగం వర్సెస్ రాజకీయం: ఉపరాష్ట్రపతి పోరులో ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్
ఉప రాష్ట్రపతి ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గురువారంతో ముగియనుంది. ఇక, అసలు క్రతువు వచ్చే నెల 9న జరగనుంది.
By: Garuda Media | 21 Aug 2025 9:00 PM ISTఉప రాష్ట్రపతి ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గురువారంతో ముగియనుంది. ఇక, అసలు క్రతువు వచ్చే నెల 9న జరగనుంది. ఆ రోజు పార్లమెంటు ఉభయ సభల సభ్యులతోపాటు.. నామినేటెడ్ సభ్యులు కూడా పోలింగ్‌లో పాల్గొని ఓటు వేయనున్నారు. చిత్రం ఏంటంటే.. దేశవ్యాప్తంగా బ్యాలెట్ విధానాన్ని పక్కన పెట్టినా.. ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం.. బ్యాలెట్ విధానాన్నే అనుసరిస్తున్నారు. ఈ క్రమంలో వచ్చే నెల 9న జరగనున్న ఉపరాష్ట్రపతి పోలింగ్‌లోనూ బ్యాలెట్ విధానాన్ని అనుసరించే ఎంపీ లు ఓటేయనున్నారు. సరే.. ఈ వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ.. అధికార, విపక్షాల తరఫున బరిలో నిలిచిన అభ్యర్థుల విషయం పై దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ సాగుతోంది.
అధికార కూటమి ఎన్డీయే తరఫున చంద్రపురం పొన్నుసామి రాధాకృష్ణన్, విపక్ష ఇండియా కూటమి తరఫున సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ. సుదర్శన్‌రెడ్డి బరిలో నిలిచారు. వాస్తవానికి ఆది నుంచి కూడా తమ విజయాన్నిఏకపక్షం చేసుకునే క్రమంలో బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కాంగ్రెస్ అగ్రనేత, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు కూడా బీజేపీ నేతలు ఫోన్లు చేసి.. సహకరించాలని కోరారు. కానీ, వీరి విన్నపాన్ని విభేదించిన కాంగ్రెస్.. ఇతర తన మిత్రపక్షాలను కూడా ఏకతాటిపైకి తీసుకువచ్చి.. తెలంగాణకు చెందిన బీ. సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేయడం గమనార్హం. అయితే.. కాంగ్రెస్ ఇలా ఎంచుకోవడానికి.. ఎన్డీయే రాధాకృష్ణన్‌వైపు మొగ్గు చూపడానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి.
కాంగ్రెస్ విషయం..
1) ప్రధానంగా ఈ పోటీ.. రెండు కూటముల కంటే కూడా.. రెండు వ్యవస్థలకు జరుగుతున్న పోరుగా కాంగ్రెస్ పేర్కొంటున్న విషయా నికి సర్వత్రా మద్దతు లభిస్తోంది. ఉపరాష్ట్రపతి అంటే.. రాజ్యాంగ బద్ధమైన పదవి. ఈ పదవిలో ఉండేవారు.. దానికి వన్నె తీసుకురావాలని.. ప్రస్తుత పరిస్థితిలో రాజ్యాంగంపై దాడి జరుగుతోందని.. దీనిని అడ్డుకోవాలంటే.. రాజ్యాంగపరమైన అవగాహన మెండుగా ఉన్నవారే ఈ పదవికి అర్హులని కాంగ్రెస్ భావిస్తోంది.
2) రాజకీయాలకు అతీతంగా ఉన్న బీ. సుదర్శన్‌రెడ్డి ఎంపిక వెనుక కూడా కాంగ్రెస్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించిందన్న వాదన వినిపిస్తోంది. రాజకీయాలకు మొగ్గు చూపే వ్యక్తులతో రాజ్యసభ నడిస్తే.. అది ప్రమాదంలో చిక్కుకుంటుందన్న భావన ఉంది. అందుకే.. అసలు రాజకీయాల పొడలేని సుదర్శన్‌రెడ్డిని ఎంపిక చేశారు.
3) ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో స్వప్రయోజనాలను కూడా కాంగ్రెస్ పక్కన పెట్టింది. అభ్యర్థి ద్వారా.. వచ్చే ఓటు బ్యాంకు, కుల సమీకరణలు, రాజకీయాలను అసలు పట్టించుకోలేదు. ఇప్పటికిప్పుడు పార్టీకి, లేదా ఇండియా కూటమికి ఒనగూరే లబ్ధి కన్నా.. విశాల భవితవ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సుదర్శన్ రెడ్డికి కాంగ్రెస్ మొగ్గు చూపినట్టు స్పష్టంగా తెలుస్తోంది.
