ఉప రాష్ట్రపతిని పారిపోయేలా చేశారు !
ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్ధిగా మహా రాష్ట్ర ప్రస్తుత గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఒక వైపు ఉంటే మరో వైపు ఇండియా కూటమి అభ్యర్ధిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉన్నారు
By: Satya P | 8 Sept 2025 9:50 PM ISTదేశంలో ఉప రాష్ట్రపతికి ఎన్నికలు మంగళవారం జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్ధిగా మహా రాష్ట్ర ప్రస్తుత గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఒక వైపు ఉంటే మరో వైపు ఇండియా కూటమి అభ్యర్ధిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉన్నారు. దీంతో ఈసారి పోరు చాలా గట్టిగానే సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఇండియా కూటమికి మద్దతుగా ఓటు వేయమని కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఎన్డీయే ప్రభుత్వం మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఉన్న ఉప రాష్ట్రపతి రాజీనామాతో :
ఈసారి జరుగుతున్న ఉప రాష్ట్రపతి ఎన్నికలు మామూలు ఎన్నికలు కావని ఉండవల్లి చెప్పారు అంతే కాదు రొటీన్ గా జరిగేవి అంతకంటే కావని అన్నారు. ఇవి ఉన్న రాష్ట్రపతి అకారణంగా రాజీనామా చేస్తే వచ్చినవి అని అన్నారు. జగదీప్ ధన్ ఖర్ ఎందుకు రాజీనామా చేశారు అన్నది ఈ రోజుకీ ఎవరికీ తెలియదు అన్నారు. ఆయన ఆరోగ్య కారణాలు చెబుతున్నారు కానీ అదే కనుక అయితే ఆయన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కి బాధ్యత అప్పగించి కొన్నాళ్ళు రెస్ట్ తీసుకోవచ్చు అన్నారు కానీ అలా జరగకుండా ఏకంగా తన పదవికే రాజీనామా చేశారు అంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది అని ఉండవల్లి అన్నారు. ఆయన రాజ్యాంగం పట్ల పూర్తి అవగాహన ఉన్న వారు అలాంటి వారు ఎందుకు సడెన్ గా పదవిని వదులుకోవడమే కాకుండా మౌనంగా ఉన్నారు అన్నది ఆలోచించాలని అన్నారు ఆయనను పదవి విడిచి పెట్టి పారిపోయేలా చేశారు అనిపిస్తోంది అది తన అనుమానం అన్నారు.
ఆర్ఎస్ఎస్ కి సపోర్ట్ చేసినట్టే :
ఎన్డీయే నిలబెట్టిన అభ్యర్ధి పూర్తిగా ఆర్ఎస్ఎస్ వాది అని అన్నారు. అందువల్ల ఎన్డీయేకు సపోర్టు చేస్తే ఆర్ఎస్ఎస్ కి వేసినట్లే అని తెలుగు రాష్ట్రాలలోని పార్టీలు ఆలోచించుకోవాలని ఉండవల్లి చెప్పారు. చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అయితే తెలుగు వారు అభ్యర్థిగా ఉంటే వేయాలి కదా అని అన్నారు. తెలుగు వారి ఆత్మ గౌరవం కోసమే పెట్టిన పార్టీ టీడీపీ అని గుర్తు చేశారు. గతంలో ప్రతిభా పాటిల్ ని రాష్ట్రపతిగా కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీకి పెడితే కాంగ్రెస్ ని పూర్తిగా వ్యతిరేకించిన శివసేన మా రాష్ట్రానికి చెందిన వారు అని ఓటేసింది అని గుర్తు చేశారు.
వైసీపీ మద్దతు ఆశ్చర్యం :
వైసీపీ ఎందుకు ఎన్డీయేకు మద్దతు ఇస్తుందో ఎవరికీ అర్ధం కాదని ఉండవల్లి అన్నారు. 2024 ఎన్నికల్లో ఎన్డీయే మీద వైసీపీ పోటీ చేసింది అని అన్నారు. ఆ ఎన్నికల్లో వైసీపీని ఓడించి టీడీపీ బీజేపీ జనసేన అధికారంలోకి వచ్చాయని చెప్పారు. మరి అలాంటిది ఆ పార్టీలతో పోరాటం చేస్తూ ఎలా మద్దతు ఇస్తారో అని ఆయన వైసీపీని ప్రశ్నించారు. కాంగ్రెస్ తనను జైలులో పెట్టింది అని కోపం ఉంటే కనుక ఆ పార్టీకి సపోర్టు చేయకపోవచ్చేమో కానీ ఇండియా కూటమి అభ్యర్ధి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఏ రాజకీయ పార్టీకి చెందని వారు అని ఉండవల్లి చెప్పారు.
అందువల్ల ఆయనకు ఓటు వేయడం ద్వారా వైసీపీ తెలుగు పార్టీలు తమ ప్రాంతీయ అభిమానాన్ని చాటుకోవచ్చు అన్నారు. అంతే కాదు ఇది రాజకీయాలతో కాదు రాజ్యాంగంతో సంబంధం ఉన్న ఎన్నిక అన్నారు. చిన్న ఎన్నిక అనుకోవద్దని ఉప రాష్ట్రపతి ఎన్నిక అన్నది బీజేపీ పధకం ప్రకారం ముందుకు తీసుకుని వచ్చింది అన్నారు. ఈ రోజున బీజేపీకి పూర్తి మెజారిటీ లేదని అన్ని పార్టీలు సపోర్టు చేస్తేనే గెలుస్తుందని అన్నారు. అందువల్ల న్యాయ కోవిదుడు రాజ్యాంగం పట్ల పూర్తి అవగాహన ఉన్న సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని ఉండవల్లి కోరారు.
