Begin typing your search above and press return to search.

తెలుగు బిడ్డ సెంటిమెంట్...ఆ ముగ్గురికీ ఇబ్బందే !

ఇండియా కూటమి వ్యూహాత్మకంగానే తెలంగాణాకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా తెర మీదకు తెచ్చింది అని అంటున్నారు.

By:  Satya P   |   20 Aug 2025 12:05 AM IST
తెలుగు బిడ్డ సెంటిమెంట్...ఆ ముగ్గురికీ ఇబ్బందే !
X

ఉప రాష్ట్రపతి ఎన్నిక ఇపుడు తెలుగు రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీస్తోంది. తన పార్టీ పేరులోనే తెలుగును ఉంచుకున్న తెలుగుదేశం పార్టీకి ఇండియా కూటమి ఎంపిక చేసిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఎంపిక ఇరకాటమే అంటున్నారు. అలాగే తెలంగాణా సెంటిమెంట్ తో ఉద్యమించిన బీఆర్ఎస్ కి సైతం ఇదే ట్రబుల్ ఉంది. వైసీపీ విషయానికి వస్తే ఆ పార్టీ గతంలో ఎం వెంకయ్యనాయుడుని ఉప రాష్ట్రపతిగా ఓటేసి ఎన్నుకున్నపుడు తెలుగు వారు అన్న సెంటిమెంట్ కారణంగానే అని చెబుతూ వచ్చింది.

వ్యూహాత్మకంగానే :

ఇండియా కూటమి వ్యూహాత్మకంగానే తెలంగాణాకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా తెర మీదకు తెచ్చింది అని అంటున్నారు. ఒక్క నిర్ణయంతో మూడు పార్టీలను ఇరకాటంలో పెట్టడమే ఈ ఎంపిక వెనక ఉందని అంటున్నారు. ఇక చూస్తే ఇండియా కూటమి అభ్యర్ధికి ఎలాంటి రాజకీయ వాసనలు లేవు. ఆయనకు ఏ రాజకీయ పార్టీ అనుబంధమూ లేదు. ఆయన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి. అంతే కాదు న్యాయ కోవిదుడు. దాంతో రాజకీయాలకు అతీతంగా ఈ మూడు పార్టీలు చాలా సులువుగా నిర్ణయం తీసుకోవచ్చు అన్న సంకేతం ఇండియా కూటమి పంపించింది.

బాబుకు సన్నిహితుడికే :

ఇక చూస్తే కనుక జస్టిస్ సుదర్శన్ రెడ్డి చంద్రబాబుకు సన్నిహితుడుగానే చెబుతారు. దాంతో ఆయనకు ఇపుడు ఇబ్బందే అంటున్నారు ఎన్డీయే మిత్రపక్షంగా టీడీపీ ఇప్పటికే సీపీ రాధాకృష్ణన్ కి మద్దతు ప్రకటించింది. ఇపుడు ఇండియా కూటమి ట్రంప్ కార్డు తీసింది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి విషయంలో రాజకీయంగా చూడాలనుకున్నా ఏమీ చెప్పలేని స్థితి. అందుకే తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి మూడు పార్టీలకు అప్పీల్ చేశారు. సుదర్శన్ రెడ్డి మా పార్టీ వారు కారు అని ఆయన చెబుతూ రాజకీయాలకు అతీతంగా వైసీపీ టీడీపీ బీఆర్ఎస్ నిర్ణయం తీసుకోవాలని కోరారు

బీజేపీ ప్లాన్ కి ఇలా :

బీజేపీ విషయానికి వస్తే డీఎంకేని ఇరకాటంలో పెట్టేందుకు అన్నట్లుగా తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్ ని ఈ అత్యున్నత పదవికి ఎన్డీయే కూటమి అభ్యర్ధిగా ఎంపిక చేసింది. దీఎంతో తమిళనాడు భాషా సెంటిమెంట్ వంటి వాటితో డీఎంకే ఇబ్బంది పడుతుందని ఊహించింది. దానికి విరుగుడు మంత్రంగా ఇండియా కూటమి ఏకంగా మూడు తెలుగు పార్టీలని అదే భాషా సెంటిమెంట్ తో ఇరకాటంలో పెట్టింది. ఈ రోజున ఈ పార్టీలు కనుక తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో కూడా వాటి మీద వచ్చే విమర్శలను సైతం ఎదుర్కొనే విధంగా ఉంటుందని అంటున్నారు.

తెలంగాణా వాసికి అత్యున్నత పదవి కోసం నిలబెడితే మద్దతు ఇవ్వలేదని బీఆర్ఎస్ మీద నింద పడే చాన్స్ ఉంది. అలాగే తెలుగు భాష సెంటిమెంట్ మీద టీడీపీ రానున్న రోజులలో జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది. వెంకయ్యనాయుడు విషయంలో అనుసరించిన విధానం సుదర్శన్ రెడ్డి విషయంలో భాషా సెంటిమెంట్ తో ఎందుకు అనుసరించలేదు అన్న ప్రశ్నలకు వైసీపీ సైతం జవాబు ఇవ్వాల్సి ఉంటుంది అంటున్నారు. ఏది ఏమైనా దక్షిణాది ప్రాంతానికి చెందిన వారే కొత్త ఉప రాష్ట్రపతి అన్నది కన్ ఫర్మ్ అయింది. అంతే కాదు రానున్న రోజులలో దక్షిణ భారతమే జాతీయ రాజకీయాలను విశేషంగా ప్రభావితం చేయబోతోంది అనడానికి ఈ ఎన్నికలే తార్కాణం అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో. ఎవరి స్ట్రాటజీలు ఏ మలుపు తిరుగుతాయో.