Begin typing your search above and press return to search.

ఉప రాష్ట్రపతి పోల్ : క్రాస్ ఓటింగ్ భయం

ఈసారి ఎన్నికలు చాలా ఆసక్తిని పెంచేశాయి. సులువుగా ఎన్డీయేకు చాన్స్ ఇవ్వరాదని ఇండియా కూటమి భావిస్తోంది.

By:  Satya P   |   9 Sept 2025 8:45 AM IST
ఉప రాష్ట్రపతి పోల్ : క్రాస్ ఓటింగ్ భయం
X

ఉప రాష్ట్రపతి ఎన్నికలు మరో రాజకీయ సమరంగా మారాయి. రాజ్యాంగబద్ధమైన పదవి కోసం జరుగుతున్న ఈ ఎన్నికలను అధికార ఎన్డీయే విపక్ష ఇండియా కూటమి అత్యంత ప్రతిష్టగా తీసుకోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడింది. మంగళవారం ఉదయం నుంచి ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక ఓటింగ్ అనంతరం ఫలితాలను కూడా వెంటనే ప్రకటిస్తారు అని అంటున్నారు.

అత్యంత ఉత్కంఠభరితంగా :

ఈసారి ఎన్నికలు చాలా ఆసక్తిని పెంచేశాయి. సులువుగా ఎన్డీయేకు చాన్స్ ఇవ్వరాదని ఇండియా కూటమి భావిస్తోంది. అదే సమయంలో తమ సత్తా చాటుకోవాలని అనుకుంటోంది. ఎందుకు ఈ పట్టుదల అంటే అనూహ్యంగా వచ్చిన ఎన్నికలు ఇవి. ఉప రాష్ట్రపతిగా ప్రస్తుతం ఉన్న జగదీప్ ధన్ ఖర్ పదవీ కాలం ఇంకా రెండేళ్ళకు పైగా ఉండగానే మధ్యలో రాజీనామా చేసి వెళ్ళిపోవడంతో ఎన్డీయే వ్యూహాత్మకంగా ఈ ఎన్నికలను ముందుకు తీసుకుని వచ్చిందని విపక్షాలు భావిస్తున్నాయి. అందుకే తమ శక్తిని అంతా కూడదీసుకుని ధీటైన పోటీకి సిద్ధం అయ్యాయి.

బీజేపీకి బలం లేదని :

ఇక బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కానీ మిత్రుల ఆసరాతోనే ప్రభుత్వాన్ని నడుపుతోంది. బీజేపీకి బలం లేని చోట మిత్రుల ఊతకర్రతో సర్కార్ ని కొనసాగిస్తూ కూడా తమ మాట నెగ్గించుకోవాలని పంతంగా ఉంది. దాంతో విపక్షాలకు ఇది కూడా ఒక సవాల్ గా మారింది. ఎన్డీయే మిత్రుల మీద కూడా ఫోకస్ పెడుతూనే తటస్థ పార్టీల మీద కూడా ఇండియా కూటమి కన్నేసింది. గెలుపు అన్నది ఎన్డీయేకు దక్కినా అతి కష్టం మీద విజయం అని భావించేలా చేయాలని తమ సత్తా చాటాలని చూస్తోంది.

ఎలక్ట్రోల్ కాలేజీలో :

ఇక లోక్ సభ రాజ్యసభ ఎంపీల సంఖ్యను కలుపులుని ఎలక్ట్రోల్ కాలేజీ అంటారు. అక్కడ ఉప రాష్ట్రపతి ఎన్నిక కోసం మొత్తం 781 మంది ఎంపీలు ఓటేయనున్నారు. సగానికి కంటే ఒక్క ఓటు అదనంగా ఎవరికి వస్తుందో వారే కొత్త ఉప రాష్ట్రపతి అవుతారు. అంటే 391 ఓట్లు విజేతకు రావాలి అన్న మాట. ఎన్ డీయేకు చూస్తే ధీమా ఉంది. మిత్రుల అండతో తమ బలం 424 దాకా ఉందని లెక్క వేసుకుంటోంది. వైసీపీకి చెందిన 11 మంది ఎంపీల మద్దతు కూడా జత కలుస్తోంది. దాంతో భారీ మెజారిటీతోనే తమ అభ్యర్ధి సీపీ రాధాకృష్ణన్ గెలుస్తారు అని భావిస్తోంది.

అయితే ఇండియా కూటమి మీద వారి ప్రయత్నాలు మీద కూడా ఒక కన్ను వేసి ఉంచుతోంది. రాజకీయాలకు అతీతంగా ఓటు వేయమని ఇండియా కూటమి పిలుపు ఇస్తోంది. దాంతో క్రాస్ ఓటింగ్ ఏమైనా జరుగుతుందా అన్న చర్చ కూడా ఉంది. అందుకే ఒకటికి పదిసార్లు అన్నీ లెక్క చూసుకోవడం వర్క్ షాప్స్ ని నిర్వహించడం మాక్ పోల్ ని నిర్వహించడం వంటివి బీజేపీ చేస్తోంది. మొత్తానికి చూస్తే క్రాస్ ఓటింగ్ కచ్చితంగా జరుగుతుందని ఇండియా కూటమి లో ధీమా అయితే ఉంది మరి అది ఎన్డీయే కూటమి మిత్రుల వైపు నుంచా లేక తటస్థ పార్టీల వైపు నుంచా చూడాల్సి ఉంది.