జగన్ మాత్రమే ముద్దు...కేసీఆర్ ఎందుకు వద్దు ?
ఇక ఎన్డీయే ఉప రాష్ట్రపతి పదవికి తమ అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ ని ఎంపిక చేసిన వెను వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఫస్ట్ ఫోన్ కాల్ చేసింది ఏపీలోని వైసీపీకే అని అంటున్నారు.
By: Satya P | 24 Aug 2025 10:00 PM ISTదేశంలో ఉప రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి. అధికార ఎన్డీయే విపక్ష ఇండియా కూటమి రెండూ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎన్డీయేకి ఉండాల్సిన మిత్రులు ఆ కూటమిలో ఉన్నారు. ఇండియా కూటమికి పాతిక మందికి పైగా మిత్ర పార్టీలు ఉన్నాయి. ఇక ఈ రెండు కూటములలో లేని పార్టీలు న్యూట్రల్ గా ఉన్నవి దేశంలో ఉన్నాయి. తెలుగునాట చూస్తే జగన్ నాయకత్వంలోని వైసీపీ కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ఉన్నాయి. అయితే జాతీయ రాజకీయ పార్టీల చూపు తెలుగు రాష్ట్రాలలోని ఈ రెండు ప్రాంతీయ పార్టీల మీద ఎలా ఉంది వారి ఆలోచనలు ఈ తీరుగా ఉన్నాయన్నది కొత్త విశ్లేషణగా ముందుకు వస్తోంది.
ఆఘమేఘాల మీద జగన్ కి ఫోన్ :
ఇక ఎన్డీయే ఉప రాష్ట్రపతి పదవికి తమ అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ ని ఎంపిక చేసిన వెను వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఫస్ట్ ఫోన్ కాల్ చేసింది ఏపీలోని వైసీపీకే అని అంటున్నారు. న్యూట్రల్ పార్టీలు దేశంలో చాలా ఉన్నాయి. కానీ జగన్ కే ఫోన్ కాల్ ఎందుకు అన్నదే ఒక చర్చ. అదే సమయంలో జగన్ కి చేసిన మాదిరిగా మరో తెలుగు ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ కి ఎందుకు చేయలేదు అన్నది కూడా చర్చగా ఉంది. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ జగన్ కి ఫోన్ చేసి మద్దతు కోరితే. మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాకు బీఆర్ఎస్ మద్దతు అవసరం లేదని తేల్చి చెప్పారు.
ఈ రాజకీయ లెక్కలేంటి :
ఏపీలో వైసీపీకి లోక్ సభ రాజ్యసభ కలిపి మొత్తం 11 మంది ఎంపీలు ఉన్నారు అదే బీఆర్ఎస్ కి లోక్ సభలో ఎంపీలు లేరు. రాజ్యసభలో నలుగురు ఉన్నారు. ఇలా సంఖ్యాపరంగా చూస్తే బీఆర్ఎస్ కంటే మూడు రెట్లు ఎక్కువ బలం వైసీపీకి ఉంది అని ఆ పార్టీకి చేశారా అన్నది ఒక ప్రశ్న. అయితే రాజకీయాల్లో ఒక్క సీటు కూడా ఇంపార్టెంటే. అందువల్ల బీఆర్ స్ కి ఉన్న నలుగురూ అవసరమే. కానీ తెలంగాణా రాజకీయాల్లో చూస్తే కనుక బీఆర్ఎస్ ని పక్కన పెట్టి బీజేపీ ఎదగాలని అనుకుంటోంది. అందువల్ల బీఆర్ఎస్ మద్దతు ఈ రోజు తీసుకుంటే రేపటి రోజున ఆ పార్టీ విషయంలో కొంత సాఫ్ట్ కార్నర్ చూపించాల్సి ఉంటుందని అది బీజేపీ ఎదుగుదలకు మంచిది కాదని భావించే అలా చేశారు అన్నది ఒక చర్చ. ఇదంతా వ్యూహాత్మకంగానే చేశారు అన్నది కూడా చెబుతున్నారు.
భవిష్యత్తు అవసరాలేనా :
ఇక వైసీపీకి ఫోన్ చేసి మద్దతు కోరాల్సినంత ఇబ్బంది అయితే బీజేపీకి లేదు. వారికి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్ధిని గెలిపించుకునే టంత బలం ఉంది. కానీ ఎందుకు అంటే జగన్ వేరే కూటమి వైపు వెళ్లరాదు అన్నది ఒక వ్యూహం. తాము పక్కన పెడితే ఎక్కడ ఇండియా కూటమి ఆప్షన్ తీసుకుంటుందో అన్న ఆలోచన. పైగా ఏపీ రాజకీయాల్లో బీజేపీకి పెద్దగా బలం అంటూ లేదు. ఆ పార్టీ ఇప్పట్లో అధికారంలోకి వచ్చేది కూడా లేదు అందువల్ల వైసీపీ మద్దతు తీసుకున్నా పెద్ద ఇబ్బంది అయితే రాదు. రేపటి రోజున అంటే 2029 నాటికి వైసీపీకి ఎక్కువ ఎంపీ సీట్లు వస్తే కేంద్రంలో అధికారానికి కూడా మద్దతు కోసం ఈ రకంగా ముందస్తు బంధం వేసినట్లుగా కూడా ఈ ఫోన్ కాల్ ఉంటుందని అంటున్నారు. మొత్తానికి జగన్ విషయంలో బీజేపీ పెద్దల ఆలోచన బహుముఖంగా ఉన్నాయి. అదే బీఆర్ఎస్ విషయంలో చూస్తే కనుక తనకు రాజకీయ ప్రత్యర్ధి గా భావిస్తున్నారు. అందుకే జగన్ అంటే ముద్దు కేసీఆర్ అంటే వద్దు అన్నది ఒక విధానంగా పెట్టుకున్నారు అన్నది ఒక విశ్లేషణగా కనిపిస్తోంది.
