Begin typing your search above and press return to search.

ఇండియా కూటమికి దెబ్బ కొట్టిన సొంత ఎంపీలు !

ఉప రాష్ట్రపతి పదవికి ఎన్నికలు జరిగాయి. కానీ ఇది ఒక రాజకీయ పదవికి సాగిన ఎన్నికలుగా తలపించాయి.

By:  Satya P   |   10 Sept 2025 9:00 PM IST
ఇండియా కూటమికి దెబ్బ కొట్టిన సొంత ఎంపీలు !
X

ఉప రాష్ట్రపతి పదవికి ఎన్నికలు జరిగాయి. కానీ ఇది ఒక రాజకీయ పదవికి సాగిన ఎన్నికలుగా తలపించాయి. అంతే కాదు వేడి చూస్తే తారస్థాయికి చేరింది. గెలిచేస్తామన్న ఫీలింగ్ ని అయితే ఇండియా కూటమి ఒక దశలో కలిగించింది అని చెప్పాలి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి మీద ఒక సందర్భంలో హాట్ కామెంట్స్ చేశారు అంటేనే పోటీ తీవ్రం అన్నది అప్పటికి ఉన్న భావనగా చెప్పుకున్నారు. అయితే పోలింగ్ వేళకు మాత్రం అంతా చల్లబడిపోయినట్లుగా అనిపించింది. కొన్ని పార్టీలు ఓటింగ్ కి దూరం గా ఉంటే మరి కొన్ని పార్టీలు ఎన్డీయేకు మద్దతుగా నిలిచాయి. ఇక భారీ ట్విస్ట్ ఏంటి అంటే ఇండియా కూటమిలో ఉన్న పార్టీలకు చెందిన ఎంపీలే కొందరు ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్ధి సీపీ రాధాకృష్ణన్ కి ఓటు చేయడం. అలా క్రాస్ ఓటింగ్ భారీగానే ఇండియా కూటమి వైపు నుంచి జరిగింది అని అంటున్నారు.

పనిచేసిన సెంటిమెంట్ :

ఇక ఎన్డీయే కూటమి అభ్యర్ధిగా బరిలో ఉన్న సీపీ రాధాకృష్ణన్ కి ప్రాంతీయ సెంటిమెంట్ తో పాటు పనిచేసిన చోట సెంటిమెంట్ కూడా బాగా వర్కౌట్ అయింది అని అంటున్నారు. ఆయన తమిళనాడుకు చెందిన వారు కావడంతో తమిళ పార్టీల ఎంపీలు ఆయనకు అనుకూలంగా ఓటు చేశారు అని అంటున్నారు. అలాగే మహారాష్ట్రకు ప్రస్తుతం గవర్నర్ గా ఉన్నందువల్ల అక్కడ కొన్ని పార్టీలు సైతం ఆయన మీద వ్యక్తిగతమైన అభిమానాన్ని చూపించారని అంటున్నారు. అంతే కాదు ఇతర రాష్ట్రాలలోని ఎంపీలు సైతం ఎన్డీఎయేకు మొగ్గు చూపారు అని అంటున్నారు.

లిస్టులో చాలా పార్టీలు :

ఈ విధంగా చూస్తే కనుక తమిళనాడు నుంచి డీఎంకేకి చెందిన కొందరు ఎంపీలు రాధాకృష్ణన్ కి అనుకూలంగా ఓటు చేసినట్లుగా ఇండియా కూటమి పెద్దల విశ్లేషణలో తెలుస్తోందిట. తమ ప్రాంతానికి చెందిన వారు అన్న అభిమానమే వారి చేత క్రాస్ చేయించింది అంటున్నారు. మహారాష్ట్రలో చూస్తే ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వాంలోని శివసేన ఎంపీలు ముగ్గురు, అలాగే అక్కడ కాంగ్రెస్ నుంచి నలుగురు ఎంపీలు అలా ఏడుగురు క్రాస్ చేసినట్లుగా చెబుతున్నారు. అదే విధంగా ఆప్ ఆర్జేడీ ఎంపీలు ఇద్దరు కూడా క్రాస్ ఓటింగ్ చేసి ఎన్డీయేకు ఓటు వేశారు అని అంటున్నారు.

ఖంగు తినిపించిన ఫలితం :

మరో వైపు చూస్తే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్ధికి కచ్చితంగా 324 ఓట్లు రావాలని లెక్క వేసుకున్నారు తీరా చూస్తే కనుక 300 ఓట్లు వచ్చాయి. మరో పదిహేను ఓట్లు చెల్లకుండా పోయాయి. ఇక ఎన్డీయే అభ్యర్ధికి ఉన్న ఓట్ల బలం 427గా ఉంది. వైసీపీకి చెందిన 11 మంది ఎంపీల ఓట్లతో కలుపుకుంటే అది కాస్తా 438గా ఉంది. ఫలితాలలో చూస్తే 452 ఓట్లు వచ్చాయి. అంటే అదనంగా 14 ఓట్లు క్రాస్ జరిగింది అన్న మాట. దాంతోనే ఇండియా కూటమి నుంచే ఈ భారీ క్రాస్ ఓటింగ్ జరిగింది అని అంటున్నారు.

ఓటమి కాదు పోరాటం :

ఇదిలా ఉంటే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్ధి ఓటమి మీద కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలో ఓటమి గెలుపు కాదు పోరాటం అన్నది ముఖ్యమని అన్నారు. తాము ఈ ఎన్నికల్లో అదే చేశామని చెప్పారు. తమ ఓట్లు తమకే పడ్డాయని ఆయన చెప్పారు. కానీ అనుకున్న దాని కంటే 24 ఓట్లు తగ్గాయి. కేవలం 300 మాత్రమే వచ్చాయి. పైగా మరో 15 ఓట్లు చెల్లలేదని అంటున్నారు ఇదంతా ఎందుకు ఎలా జరిగింది అన్నది ఆరా తీయడానికి తొందరలోనే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి పార్టీలతతో ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తారు అని అంటున్నారు. మరి నువ్వా నేనా అన్నట్లుగా సాగిన ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి పార్టీలు ఐక్యంగా ఉండకపోవడంతో పాటు క్రాస్ చేయడం మీద అయితే జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. దాంతో పాటు అమాంతం పెరిగిన ఎన్డీఎ అభ్యర్ధి ఓట్ల బలం కూడా ఆసక్తికరమైన చర్చకు తావిస్తోంది.