Begin typing your search above and press return to search.

రాయలసీమ రాజకీయాలకు ‘అలయ్ బలయ్’ వ్యాక్సిన్ కావాలి.. వీహెచ్ తాత గొప్ప మాట..

వీహెచ్ వేదికపై మైక్ అందుకుంటే నవ్వులకు కొదవ ఉండదు. "మా తెలంగాణలో ఎంత కొట్టుకున్నా, మైకులు విరగ్గొట్టుకున్నా చివరికి అందరం ఒకటై కలుస్తాం.

By:  A.N.Kumar   |   23 Oct 2026 10:38 AM IST
రాయలసీమ రాజకీయాలకు ‘అలయ్ బలయ్’ వ్యాక్సిన్ కావాలి.. వీహెచ్ తాత గొప్ప మాట..
X

రాజకీయాల్లో డప్పు కొట్టడం వేరు.. డప్పు చప్పుడుకు స్టెప్పులేస్తూ ప్రత్యర్థులను కౌగిలించుకోవడం వేరు.. ఈ విద్యలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి. హనుమంతరావు (వీహెచ్) గారికి మాస్టర్స్ డిగ్రీ ఉందంటే అతిశయోక్తి కాదు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రతీ ఏటా ఎంతో ఘనంగా నిర్వహించే ‘అలాయ్ బలయ్’ కార్యక్రమంలో వీహెచ్ మార్క్ సందడి మరోసారి సభలో జోష్ నింపింది.

తెలంగాణ రాజకీయాలు ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. టీవీ స్టూడియోల్లో.. సభల్లో నాయకులు తిట్టుకున్నా.. కొట్టుకున్నంత పని చేసినా.. బయటకు రాగానే అలాయ్ బలయ్ అని కౌగిలించుకుని గ్లాసు కలుపుతారు. కానీ మన పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యంగా రాయలసీమ రాజకీయాల ముచ్చట వేరు.. ఇదే విషయాన్ని వీహెచ్ తనదైన సెటైరికల్ స్టైల్‌లో దత్తన్న ముందు వెళ్లబోసుకున్నారు.

"కడప, కర్నూలులో ఒకసారి గొడవ పడితే చచ్చినా కలవరు"

వీహెచ్ వేదికపై మైక్ అందుకుంటే నవ్వులకు కొదవ ఉండదు. "మా తెలంగాణలో ఎంత కొట్టుకున్నా, మైకులు విరగ్గొట్టుకున్నా చివరికి అందరం ఒకటై కలుస్తాం. కానీ కడప, కర్నూలు, అనంతపురం, ఒంగోలు ప్రాంతాల్లో అలా కాదు బాబోయ్.. ఒక్కసారి తేడా వచ్చిందో.. ఎన్నేళ్లయినా.. చచ్చినా కలవరు. అంతా పొడుచుకునుడు, చంపుకునుడే" అంటూ వీహెచ్ విసిరిన పంచ్‌లకు వేదికపై ఉన్న నాయకులతో పాటు జనాలు కూడా పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నారు. ఆంధ్రలో ఎన్నికలొస్తే నామినేషన్లు కూడా వేయనివ్వని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేసిన వీహెచ్.. "ఏం మనుషులండీ నాయనా.. అంత పగలూ ప్రతీకారాలు ఎందుకు?" అని ప్రశ్నించారు.

దత్తన్నా.. వచ్చే ఏడాది సీమకు పోదాం!

అందుకే ఈ రాయలసీమ, కోస్తా నాయకుల మధ్య ఉన్న ఈ 'ఫ్యాక్షన్ పగలను' కరిగించేందుకు ఒకే ఒక్క పరిష్కారం ఉందని వీహెచ్ ఒక మాస్టర్ ప్లాన్ ప్రతిపాదించారు. "అలయ్ బలయ్ అంటేనే దత్తన్న.. దత్తన్న అంటేనే అలయ్ బలయ్. అందుకే దత్తన్నా వచ్చే ఏడాది ఈ వేడుకను పక్క రాష్ట్రంలో పెట్టు. అక్కడ ఉన్న నాయకులకు అలయ్ బలయ్ ఇచ్చి వారిని మార్చే బాధ్యత మనం తీసుకుందాం" అని దత్తాత్రేయకు బంపర్ ఆఫర్ ఇచ్చారు.

రాజకీయ వైరుధ్యాలను పక్కనబెట్టి అందరినీ ఒకే వేదికపైకి తెచ్చే తెలంగాణ సంస్కృతిని ఆంధ్రాకి కూడా ఎగుమతి చేయాలని వీహెచ్ కోరారు. ప్రతీ ఏటా డప్పు దరువులకు డ్యాన్స్ చేసే వీహెచ్.. ఈసారి కూడా ఇతర పార్టీల నాయకులను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటూ అందరినీ అలరించారు. 'సీమ పగలకు తెలంగాణ అలయ్ బలయ్ ఒక మంచి ఔషధం' అని వీహెచ్ తేల్చేశారు. మరి దత్తన్న వచ్చే ఏడాది బస్సు ఎక్కి రాయలసీమకు బయలుదేరుతారో లేదో చూడాలి.