హమ్మయ్య.. మన వీహెచ్ తాతా ఎట్టకేలకు హ్యాపీ
ఈ నియామకంతో పాటు ఆయనకు నెలకు సుమారు మూడు లక్షల రూపాయల వేతనం, అధికారిక వాహనం, భద్రతా సిబ్బంది, వ్యక్తిగత సహాయకుడు (పీఏ) వంటి సౌకర్యాలను ప్రభుత్వం కల్పించనుంది.
By: A.N.Kumar | 30 April 2026 11:52 PM ISTతెలంగాణ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీ. హనుమంతరావుకు (వీహెచ్) ఎట్టకేలకు కీలక పదవి దక్కింది. రాష్ట్ర ప్రభుత్వం ఆయనను ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు ఈ పదవికి మంత్రి హోదాను కూడా కల్పిస్తూ ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది. బీసీ సంక్షేమ శాఖ మంత్రికి సమానమైన హోదాతో ఆయన ఈ బాధ్యతలు నిర్వహించనున్నారు. దీని ద్వారా వీహెచ్‌కు అధికారికంగా ప్రభుత్వ వ్యవస్థలో ఒక స్థానం లభించినట్లైంది.
ఈ నియామకంతో పాటు ఆయనకు నెలకు సుమారు మూడు లక్షల రూపాయల వేతనం, అధికారిక వాహనం, భద్రతా సిబ్బంది, వ్యక్తిగత సహాయకుడు (పీఏ) వంటి సౌకర్యాలను ప్రభుత్వం కల్పించనుంది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై సలహాలు ఇవ్వడం, ముఖ్యంగా సామాజిక వర్గాలకు సంబంధించిన అంశాలపై సూచనలు చేయడం ఆయన బాధ్యతలుగా ఉండనున్నాయి.
అయితే ఈ పదవి ఆయనకు ఎంతవరకు సంతృప్తి కలిగిస్తుందనే అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా తన సీనియారిటీకి తగిన గుర్తింపు ఇవ్వాలని వీహెచ్ పార్టీ అధిష్టానాన్ని కోరుతూ వస్తున్నారు. ముఖ్యంగా రాజ్యసభ అవకాశంపై ఆయన తీవ్రంగా ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించలేదు. ఈ నేపథ్యంలో ఆయనలో అసంతృప్తి వ్యక్తమైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీనియర్ నేతలకు గౌరవం ఇవ్వాలని స్పష్టం చేయడంతో వీహెచ్‌కు ఈ పదవిని ఇవ్వడం ద్వారా పార్టీ ఒక విధంగా సమతుల్యత సాధించే ప్రయత్నం చేసినట్లు భావిస్తున్నారు. అయినప్పటికీ వీహెచ్ గతంలో పలుమార్లు “తాను ఇచ్చే సలహాలను ఎవరూ పట్టించుకోవడం లేదని” బహిరంగంగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. “నా మాట ఎవరు వింటారు బిడ్డా!” అంటూ ఆయన పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇప్పుడు అదే సలహాదారు పదవిని ఇవ్వడంతో పరిస్థితి ఎలా మారుతుందనే దానిపై ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం ఆయన సూచనలను నిజంగా అమలు చేస్తుందా? లేక ఇది కేవలం గౌరవప్రదమైన హోదాగా మాత్రమే మిగిలిపోతుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజకీయంగా అనుభవం ఉన్న నేతగా వీహెచ్ సూచనలు కీలకంగా మారే అవకాశం ఉన్నప్పటికీ వాటి అమలు విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.
మొత్తానికి దీర్ఘకాలంగా పార్టీకి సేవలు అందించిన వీహెచ్‌కు ఒక గౌరవప్రదమైన స్థానం దక్కినప్పటికీ, ఇది ఆయన ఆశించిన స్థాయిలో సంతృప్తి కలిగిస్తుందా లేదా అనేది సమయం మాత్రమే నిర్ణయించాల్సి ఉంది.
