Begin typing your search above and press return to search.

నాగుపామును సేవ్ చేసేందుకు 80 కుట్లు

విషసర్పమైన పామును కనిపించినంతనే.. దాన్ని చంపేసే వరకు వదిలి పెట్టనోళ్లు ఎంతోమంది ఉంటారు.

By:  Garuda Media   |   27 Nov 2025 12:00 PM IST
నాగుపామును సేవ్ చేసేందుకు 80 కుట్లు
X

జంతుజాలంపై కొందరికి ఉండే ప్రేమాభిమానాలకు నిదర్శనంగా ఈ ఉదంతాన్ని చెప్పొచ్చు. విషసర్పమైన పామును కనిపించినంతనే.. దాన్ని చంపేసే వరకు వదిలి పెట్టనోళ్లు ఎంతోమంది ఉంటారు. అలాంటిది అనుకోకుండా తీవ్ర గాయాల బారిన పడిన ఒక పామును వెటర్నరీ ఆసుపత్రికి తీసుకెళ్లటం ఒక ఎత్తు అయితే.. దాని ప్రాణం పోకుండా కాపాడటం కోసం ఒక వెటర్నరీ వైద్యుడు రెండు గంటల పాటు శ్రమించి.. దాదాపు 80 కుట్లు వేసి సేవ్ చేసిన అరుదైన ఉదంతం చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని ఈ ఉదంతానికి వేదికైంది.

ఉజ్జయినిలోని విక్రమ్ నగర్ పారిశ్రామిక ప్రాంతంలో భవన నిర్మాణం కోసం తవ్వకాలు సాగుతున్నాయి. ఇదే సమయంలో జేసీబీ కారణంగా తీవ్ర గాయాలబారిన పడిందో నాగుపాము. గాయాల బాధ తట్టుకోలేక ఆ పాము.. అటు ఇటు తిరగసాగింది. దీంతో దాని తనకు మరింత పెద్ద గాయమైంది. దీంతో.. కొందరు దాన్ని మట్టితో కట్టి చంపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పాముకు మరిన్ని గాయాలయ్యాయి. ఇదే సమయంలో అక్కడ స్నేక్ ఫ్రెండ్స్ గా పేరున్న రాహుల్.. ముకుల్ అక్కడకు చేరుకున్నారు.

అక్కడి వారి చర్యల్ని అడ్డుకొని.. గాయాల బారిన పడిన పామును ఎంతో జాగ్రత్తగా పట్టుకొని దాన్ని వెటర్నరీ వైద్యశాలకు తీసుకెళ్లారు. చీఫ్ వెటర్నరీ సర్జన్ డాక్టర్ ముకేష్ జైన్ అతడి టీం పాము తలపై లోతైన గాయమైన విషయాన్ని గుర్తించారు. ఒక చోట చర్మం పూర్తిగా ఊడిపోయిన విషయాన్ని గుర్తించి.. దానికి సర్జరీ చేశారు. తక్కువ మోతాదులో అనస్తీషియా ఇచ్చి ఆపరేషన్ మొదలుపెట్టారు. దాదాపు రెండు గంటల పాటు శ్రమించి ఊడిన పాము చర్మాన్ని అతికించారు.

ఇందుకోసం ఏకంగా 80 కుట్లు వేశారు. సర్జరీ సక్సెస్ కావటంతో పాము ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. రెండు.. మూడు రోజులు అబ్జర్వేషన్ లో ఉంచిన తర్వాత.. దాని పరిస్థితి మరింత మెరుగైన తర్వాత దాన్ని అడవిలో విడిచి పెట్టాలని భావిస్తున్నారు. ఈ నాగుపాము ఎలపిడి కుటుంబానికి చెందినందిగా సర్జరీ చేసిన డాక్టర్ జైన్ ధ్రువీకరించారు. కళ్ల ముందు మనిషి చనిపోతున్నా పట్టించుకోని మనుషులు ఉన్న ఈ రోజుల్లో ఒక పాము కోసం ఇద్దరు స్నేక్ ఫ్రెండ్స్ తహతహలాడటం ఒక ఎత్తు అయితే.. అంతే బాధ్యతగా వ్యవహరించిన వైద్యుడ్ని అభినందించకుండా ఉండలేం.