వందేళ్లు వద్దు ..... వెంకయ్య వేదాంతం
ముప్పవరపు వెంకయ్యనాయుడు. అద్భుతమైన వక్త. తెలుగులో అనర్గళంగా మాట్లాడే నేర్పు ఆయన సొంతం. ఆయన మాటలు ఆయన చలోక్తులు హావ భావాలు సభలలో ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి.
By: Satya P | 19 Dec 2025 5:55 PM ISTముప్పవరపు వెంకయ్యనాయుడు. అద్భుతమైన వక్త. తెలుగులో అనర్గళంగా మాట్లాడే నేర్పు ఆయన సొంతం. ఆయన మాటలు ఆయన చలోక్తులు హావ భావాలు సభలలో ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. సభికులను ఆకట్టుకునే విధంగా ప్రసంగించడంలో వెంకయ్యనాయుడు దిట్ట అని వేరేగా చెప్పాల్సినది లేదు. ఆయన సరదాగా మాట్లాడుతూనే ఎన్నో మంచి విషయాలు చెబుతారు. నవ్వుతూనే చురకలు అంటిస్తారు. ముఖ్యంగా యువతరానికి ఆయన చేసే హితబోధ విని తీరాల్సిందే. ఎంతో జీవితాన్ని చూసి ఎవరెస్ట్ శిఖరం అంత కీర్తిని సంపాదించుకున్న వెంకయ్యనాయుడు దేశంలో రెండవ అత్యున్నత రాజ్యాంగ పదవిని అందుకున్నారు. ఆయన ప్రధాని కావాల్సిన వారు అని చెబుతారు. రాష్ట్రపతి పదవి ఇచ్చినా తెలుగు వారికి గర్వకారణం అని కూడా అంతా ఒప్పుకుంటారు. అలాంటి వెంకయ్య నాయుడు తన సరదా కబుర్లలో వేదాంతాన్ని జొప్పిస్తూ తాజాగా ఒక ప్రసంగం చేశారు.
వెయిటింగ్ లిస్టు అంటూ :
తాను ప్రస్తుతం 76 ఏళ్ళ వయసులో ఉన్నానని వెంకయ్య నాయుడు చెప్పారు ఆయన గుడివాడ ఏఎన్నార్ కళాశాల వర్జోత్సవాలలో ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను చూడని జీవితం లేదని ఎక్కని ఎత్తులు లేవని ఆయన చెప్పారు. తన జీవితానికి ఎంతో సంతృప్తిగా ఉందని అన్నారు. తాను వెయిటింగ్ లిస్టులో ఉన్నాను అని ఆ దేవుడి ఎపుడు పిలిస్తే అపుడు అన్నట్లుగా పూర్తి వేదాంత ధోరణిలో మాట్లాడారు. తాను వందేళ్ళు బతకాలని అంటున్నారని కళాశాల వందేళ్ళ పండుగకు రావాలని అయితే తనకు అంతటి జీవితం వద్దు అని ఆయన స్పష్టంగా చెప్పేశారు.
ఎన్టీఆర్ ఏయన్నార్లతో :
తాను చేయాల్సిన పనులు బోలెడు ఉన్నాయని తాను ఆ పైలోకంలో ఉన్న ఎన్టీఆర్ ఏయన్నార్ లను కలుసుకోవాలని ఉందని, అలాగే సావిత్రి ఘంటసాల ఎస్పీబీ ఇలా ఎంతో మందితో కలసి ముచ్చటించాలని ఉందని ఆయన ఇంతటి వేదాంతంలోనూ చలోక్తులు విసిరారు. ఎవరికైనా జీవితంలో సంతృప్తి ఉండాలని ఆయన అన్నారు. తాను 76 ఏళ్ళ వయసులో ఉన్నా 96 ఏళ్ళ పని చేశాను అని ఆయన చెబుతూ బాగా అలసిపోయాను అన్నట్లుగా మాట్లాడారు. అయినా సభలకు తనను పిలుస్తున్నారు అని తాను కూడా వెళ్ళాలని భావించి వస్తున్నాను అన్నారు. నాలుగు మంచి మాటలు యువతకు చెప్పాలన్నదే తన కోరిక అని ఆయన చెప్పారు.
కుటుంబ విలువలు ముఖ్యం :
ఈనాటి యువత టెక్నాలజీ మోజులో పడి కుటుంబ విలువలను కోల్పోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల బారిన పడుతోందని అలాంటివి చేయవద్దు అన్నారు. తల్లిదండ్రులను బంధువులు సమాజాన్ని ప్రేమించాలని అందరితో మంచిగా ఉండాలని ఆయన హిత బోధ చేశారు. ప్రతీ మనిషి తన వల్ల ఏమి మేలు జరిగింది అన్నది ఆలోచించాలని వెంకయ్య కోరారు. ఎక్కడికీ కదలకుండా మొబైల్ ఫోన్లలో కాదు, యువత తాము కదులుతూ ముందుకు సాగాలని ఆయన సూచించారు. మొత్తానికి వెంకయ్యనాయుడు చేసిన ఈ ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకుంది. అయితే ఆయన ప్రసంగం యూ ట్యూబ్ ల ద్వారా చూసిన నెటిజన్లు 76 ఏళ్ళు వచ్చినా ఎక్కడా తడబడకుండా చురుకుగా మాట్లాడుతున్న వెంకయ్య లాంటి మేధావులు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉంటూ ఎప్పటికీ సమాజ హితైషులుగా ఉండాలని కోరుకుంటున్నారు.
