Begin typing your search above and press return to search.

భేష్ లోకేష్....ఊహించని కాంప్లిమెంట్

రాష్ట్ర మంత్రి తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గురించి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేయడం విశేషం.

By:  Satya P   |   2 May 2026 9:26 PM IST
భేష్ లోకేష్....ఊహించని కాంప్లిమెంట్
X

రాష్ట్ర మంత్రి తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గురించి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేయడం విశేషం. ఏపీలో పదవ తరగతి పరీక్షలలో సర్కార్ బడులలో చదువుకున్న విద్యార్ధులు అద్భుతమైన ప్రతిభను కనబరచారు. ఎన్నడూ లేని విధంగా ర్యాంకుల పంట పండించారు. చాలా ప్రభుత్వ స్కూళ్ళలో టెన్త్ ఫలితాలలో సంచలన విజయాలు నమోదు అయ్యాయి. దాంతో విద్యా శాఖ మంత్రిగా లోకేష్ పని తీరు ఒక్కసారిగా చర్చకు తావిచ్చింది. అంతా ఆయన మార్క్ పరిపాలనను మెచ్చుకుంటున్నారు. తలపండిన వారే విద్యా శాఖను నిర్వహిస్తారు, వారే అందులో రాటు దేలి రాణించగలరు అన్న పాత సంప్రదాయానికి చెక్ పెడుతూ యువకుడిగా ఉన్న లోకేష్ అతి పెద్ద విద్యా శాఖ భారాన్ని మోసారు. ఆయన ఈ బాధ్యతలు అందుకోగానే విద్యా శాఖలో చేపట్టిన మార్పులే ఈ రోజున ప్రతిభా పుష్పాలను అందిస్తున్నాయని అంటున్నారు.

వెంకయ్య కితాబు :

ఇదిలా ఉంటే ఏపీలో టెన్త్ ఫలితాలలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సాధించిన ఘనతను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మెచ్చుకున్నారు. అదే సమయంలో విద్యా శాఖ మంత్రిగా నారా లోకేశ్ తీసుకుంటున్న చర్యలు ఎంతో బాగున్నాయని అవి మంచి రిజల్ట్స్ రావడానికి కారణం అయ్యాయని ప్రశంసించారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గొలగమూడిలో జరిగిన కార్యక్రమంలో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ విద్య, కుటుంబం సామాజిక విలువలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే సందర్భంలో ఏపీలో రాష్ట్ర విద్యాశాఖలో వస్తున్న మార్పులను వెంకయ్య నాయుడు ప్రత్యేకంగా ప్రస్తావించడం విశేషం. ఈ ఏడాది టెన్త్ రిజల్ట్స్ లో సర్కార్ బడులు మంచి ప్రతిభను కనబరచాయని వెంకయ్య నాయుడు అన్నారు. దానికి ఏపీలో కూటమి ప్రభుత్వం విద్యా శాఖ మంత్రిగా లోకేష్ తీసుకున్న చర్యలే ప్రధాన కారణం అని ఆయన కొనియాడారు. ఎవరైనా ఎక్కడైనా మంచి పనులు చేస్తే ప్రోత్సహించాలని వెంకయ్య నాయుడు అంటూ లోకేష్ ని కూడా ఈ సందర్భంగా మెచ్చుకున్నారు.

తల్లిదండ్రుల బాధ్యత :

ఇక పిల్లలు బాగుపడాలీ అంటే తల్లిదండ్రులు కూడా ముఖ్య పాత్ర పోషించాలని వెంకయ్య నాయుడు సూచించారు. పిల్లలకు ఎక్కువ సమయం తల్లిదండ్రులు కేటాయించాలని ఆయన కోరారు టీవీలు మొబైళ్లకే ఈనాటి తల్లిదండ్రులు ఎక్కువగా సమయం ఇస్తున్నారని దాని వల్ల పిల్లల భవిష్యత్తు దెబ్బ తింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లలతో ఎక్కువ సమయం గడపడం వారికి విలువలను నేర్పడం చేయాలని ఆయన సూచించారు. అదే సమయంలో పిల్లలు కూడా చదువు మీద దృష్టి పెట్టాలని ఆయన కోరారు. మొత్తానికి విద్యా విధానం గురించి భావి పౌరుల గురించి వారిని తీర్చి దిద్దే తల్లిదండ్రుల గురించి వెంకయ్య నాయుడు విలువైన సూచనలు చేశారు. అలాగే విద్యా మంత్రిగా లోకేష్ పనితీరుని వెంకయ్య నాయుడు మెచ్చుకోవడం అంటే అది లోకేష్ కి లభించిన అరుదైన కాంప్లిమెంట్ గానే అంతా అంటున్నారు.