Begin typing your search above and press return to search.

రాజకీయ వారసత్వం మీద వెంకయ్య సంచలన వ్యాఖ్యలు

ముప్పవరపు వెంకయ్యనాయుడు పూర్వ ఉప రాష్ట్రపతి, దాని కంటే ముందు దేశంలో కేంద్ర మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు.

By:  Satya P   |   11 Jan 2026 5:07 PM IST
రాజకీయ వారసత్వం మీద వెంకయ్య సంచలన వ్యాఖ్యలు
X

ముప్పవరపు వెంకయ్యనాయుడు పూర్వ ఉప రాష్ట్రపతి, దాని కంటే ముందు దేశంలో కేంద్ర మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. బీజేపీకి జాతీయ అధ్యక్షుడిగా చేశారు. ఉమ్మడి ఏపీకి కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా చేశారు. ఎంపీగా అనేక సార్లు తెలిచారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో కీలక ప్రతిపక్ష నాయకుడిగా పాత్ర పోషించారు. మరి సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానం కలిగిన వెంకయ్యనాయుడు తన రాజకీయ వారసులను ఎందుకు ఈ రంగంలోకి తీసుకుని రాలేదు అన్న సందేహాలు అయీ అందరిలోనూ ఎపుడూ ఉన్నాయి. కానీ దానికి జవాబు అయితే స్పష్టంగా వారి కుటుంబం నుంచి రాలేదు.

ఇష్టం లేనందువల్లనే :

దానికి సరైన సమాధానాన్ని వెంకయ్యనాయుడు చెప్పి క్లారిటీ ఇచ్చారు. రాజకీయాల్లో వారసత్వాన్ని ప్రోత్సహించడం తనకు ఇష్టం లేదని ఆయన చెప్పారు. హైదరాబాద్ లోని ముచ్చింతల్ లో స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్య నాయుడు తన కుమారుడు, కుమార్తెని రాజకీయాలలోకి తీసుకుని రావడం పట్ల తనకు ఆసక్తి లేదని అన్నారు. వారసులకు ఇవ్వాల్సింది సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలన్న బాధ్యత మాత్రమే అని ఆయన గుర్తు చేశారు. అదే అసలైన సంపద అని అన్నారు. తన పిల్లలకు వారసత్వంగా స్వర్ణ భారత్ ట్రస్ట్ ని మాత్రమే ఇచ్చాను అని ఆయన వెల్లడించడం విశేషం.

సేవను కొనసాగించాలని :

ఇక స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా సేవను కొనసాగించాలని తన కుమార్తెకు చెప్పానని వెంకయ్యనాయుడు తెలిపారు. సేవ ద్వారానే ఎవరైనా మంచి పేరు తెచ్చుకుంటారని అందుకే ఆ రంగంలోనే తన వారసులు కొనసాగుతున్నారని వెంకయ్యనాయుడు చెప్పడం గమనార్హం. ఇక మన పండుగలు మన విశిష్టత భావి తరాలకు తెలియచేయాలని వెంకయ్యనాయుడు కోరారు.

ఎన్ని మారినా మూలాలు ఒక్కటే :

గతంతో పోలిస్తే వాతావరణంలో మార్పులు పెద్ద ఎత్తున వస్తున్నాయని వెంకయ్యనాయుడు అన్నారు. రుతువులు కూడా మారుతున్నాయని అన్నారు. అయితే ఎన్ని మారినా భారతీయ మూలాలు గుర్తు చేసుకుంటూనే ఉండాలని ఆయన హితవు పలికారు. మనదైన సంప్రదాయాలను ఎవరూ మరచిపోకూడదని ఆయన అన్నారు.

ఏపీకి మరో హైదరాబాద్ :

హైదరాబాద్ బ్రహ్మాండమైన నగరం అని వెంకయ్యనాయుడు అన్నారు. అలాంటి నగరం ఏపీకి కూడా చాలా అవసరం అని ఆయన చెప్పారు. అయితే అమరావతిని కూడా ఆ దిశగా కేంద్రం సహకారంతో ఏపీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందన్న నమ్మకం అయితే తనకు ఉందని వెంకయ్యనాయుడు అన్నారు. ఏపీ సైతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు.