ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే: తన - మన లేదా...!
ఇది రాజకీయాల్లో సహజంగానే ఉండే లక్షణం. వాస్తవానికి ఈ లక్షణమే ఆయనకు ఉండిఉంటే.. ఇప్పుడు అందరితోనూ భేష్ అని ఎలా అనిపించుకుంటారు.
By: Garuda Media | 17 Nov 2025 5:28 PM ISTఆయన తొలిసారి విజయం దక్కించుకున్నారు పైగా.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీకి చెందిన వారిని గతంలో ఇబ్బందులు పెట్టిన మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో గెలుపుగుర్రం ఎక్కారు మరి అలాంటి నాయకుడు ఎలా ఉండాలి? తన వారిని.. తన పార్టీ వారిని మాత్రమే పట్టించుకోవాలి. వారికే పనులు చేసి పెట్టాలి. ఇది రాజకీయాల్లో సహజంగానే ఉండే లక్షణం. వాస్తవానికి ఈ లక్షణమే ఆయనకు ఉండి ఉంటే.. ఇప్పుడు అందరితోనూ భేష్ అని ఎలా అనిపించుకుంటారు.
ఫక్తు రాజకీయాలకు భిన్నంగా వ్యవహరిస్తూ.. నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరినీ పార్టీలు, కులాలు, మతాల కు భిన్నంగా ఆదరిస్తున్నారు. ప్రజలతో భేష్ అనే మాటను అనిపించుకుంటున్నారు. ఆయనే.. వెని గండ్ల రాము. గుడివాడ నియోజకవర్గం నుంచి తొలిసారి విజయం దక్కించుకున్న టీడీపీ నాయకుడు. పైగా ఎన్నారై గా కూడా ఆయనకు మంచి పేరుంది. ఇక, నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంటుంది..?. ఆప్రస్తుతం మాజీ అయిన కొడాలి నాని.. గతంలో నియోజకవర్గంలో అన్నీ తానై వ్యవహరించారు.
ముఖ్యంగా.. టీడీపీకి వ్యతిరేకంగా కొడాలి చేసిన రాజకీయం అంతా ఇంతా కాదు. పైగా టీడీపీ జెండా కట్టారన్న కారణంగా కొందరు యువకులను 2021లో నిర్బంధించారన్న ఫిర్యాదు కూడా ఆయనపై ఉంది. అయితే.. కాలం ఎప్పుడూ ఒకే టైపులో ఉండదు కదా. అలానే.. గుడివాడలోనూ ఎమ్మెల్యే మారారు. గత ఎన్నికల్లో రాము విజయం దక్కించుకున్నారు. సో.. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? వాస్తవానికి వైసీపీ నాయకులు, కార్యకర్తలకు డిస్టెన్స్ పాటించాలి. వారి పనులు కూడా చేయకూడదు.
కానీ, రాము అలా ఆలోచన చేయలేదు. చేయడం లేదు. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయం.. ఇప్పుడు అంతా అభివృద్ధిపైనే దృష్టి పెడతామని చెబుతూ అదే పనిచేస్తున్నారు. నియోజకవర్గంలో వైఎస్సార్ పేరుతో ఉన్న ఓ వీధికి రోడ్డు వేయించారు. వైసీపీ కార్యకర్త కుటుంబంలో ఒకరికి తీవ్ర అనారోగ్యం చేస్తే.. సీఎంఆర్ ఎఫ్ కింద దరఖాస్తు చేయించి.. సొమ్ములు మంజూరు చేయించారు. ఇక, పేదలు, రోడ్డు పక్క వ్యాపారాలు చేసుకుని.. వైసీపీకి మద్దతుగా ఉన్నప్పటికీ.. రాము వారికి అవసరమైన సాయం చేస్తున్నారు. మొత్తంగా ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేనే అయినా.. రాము చాలా పరిణితిగా ముందుకు సాగుతున్నారని అంటున్నారు పరిశీలకులు.
