అమెరికా vs వెనిజులా : ఎవరి సైనిక బలం ఎంత? యుద్ధం చేసే దమ్ముందా?
అమెరికా రక్షణ బడ్జెట్ 800 బిలియన్లు కాగా.. వెనిజులాది కేవలం 5 బిలియన్లలోపే ఉంటుంది. ఇక అమెరికా వద్ద 13వేల యుద్ధ విమానాలున్నాయి.
By: A.N.Kumar | 4 Jan 2026 6:12 PM ISTఅమెరికా మరియు వెనిజులా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. 'ఆపరేషన్ అబ్సొల్యూట్ రిసాల్వ్' అనే పేరుతో అమెరికా మెరుపు దాడులు చేసింది. ఏకంగా వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అదుపులోకి తీసుకుంది. ఈ పరిణామం ప్రపంచ దేశాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ నేపథ్యంలో వెనిజులా సైనిక శక్తి ఎంత? అది నిజంగా అమెరికా వంటి అగ్రరాజ్యాన్ని ఢీకొనగలదా? అన్నది హాట్ టాపిక్ గా మారింది.
వెనిజులా సైన్యాన్ని నేషనల్ బొలివేరియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ (ఎఫ్.ఏ.ఎన్.బీ) అని పిలుస్తారు. దీని వెనుక రష్యా , చైనా వంటి దేశాల సాంకేతిక సహకారం కొంత ఉన్నప్పటికీ అమెరికాతో పోలిస్తే పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.
ఎవరి సైన్యం ఎంత?
వెనిజులా వద్ద సుమారు 1.9 లక్షల మంది క్రియాశీల సైనికులు ఉన్నారు. దీనికి తోడు ప్రభుత్వంపై విధేయత చూపే మిలీషియా పౌర సైన్యం దళాలు భారీగా ఉన్నాయి. రికార్డుల ప్రకారం సుమారు 20 లక్షల మంది వరకు మిలీషియా సభ్యులు ఉన్నట్లు అంచనా. ఒకవేళ విదేశీ దాడులు జరిగితే గెరిల్లా యుద్ధం చిన్న చిన్న బృందాలుగా విడిపోయి మెరుపు దాడులు చేయడం ద్వారా అమెరికాను ఇబ్బంది పెట్టడానికి వెనిజులా వ్యూహం పన్నింది..
ఆయుధ సంపత్తి ఎంత?
వెనిజులా ప్రధానంగా రష్యా నుండి కొనుగోలు చేసిన ఆయుధాలపై ఆధారపడి ఉంది. రష్యాకు చెందిన ఎస్.యూ-30ఎంకే2 యుద్ధ విమానాలు వెనిజులాకు ప్రధాన బలం. ఇవి శక్తివంతమైనవే కానీ.. అమెరికాలోని ఐదవ తరం స్టెల్త్ ఫైటర్ల ఎఫ్-22, ఎఫ్-35 ముందు వీటి మనుగడ ప్రశ్నార్థకమే. రష్యా తయారు చేసిన ఎస్-300 గగనతల రక్షణ వ్యవస్థలు వెనిజులా వద్ద ఉన్నాయి. ఇవి శత్రు విమానాలను అడ్డుకోవడంలో సమర్థవంతమైనవి.
అమెరికా - వెనిజులా సైనిక శక్తి ఇదీ
అమెరికా రక్షణ బడ్జెట్ 800 బిలియన్లు కాగా.. వెనిజులాది కేవలం 5 బిలియన్లలోపే ఉంటుంది. ఇక అమెరికా వద్ద 13వేల యుద్ధ విమానాలున్నాయి. వెనిజులా వద్ద కేవలం 300 లోపే ఉంటాయి. విమాన వాహక నౌకలు అమెరికా వద్ద ఏకంగా 11 ఉన్నాయి. వెనిజులా వద్ద ఒక్కటి లేవు. ఇక అమెరికా అణ్వాయుధాలు ఏకంగా 5500 వరకూ ఉంటాయి. వెనిజులా వద్ద అసలు లేనే లేవు. అమెరికా వద్ద అత్యాధునిక స్టెల్త్, శాటిలైట్ టెక్నాలజీ ఉంది. వెనిజులా వద్ద పాత తరం పరిమితమైన వనరులున్నాయి.
ప్రత్యక్ష యుద్ధం జరిగితే పరిస్థితి ఏంటి?
నిపుణుల విశ్లేషణ ప్రకారం, సంప్రదాయ యుద్ధం జరిగితే వెనిజులా అమెరికా ముందు కొన్ని రోజులు కూడా నిలబడటం కష్టం. దీనికి ప్రధాన కారణాలున్నాయి. గత దశాబ్ద కాలంగా వెనిజులా ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సంక్షోభం వల్ల సైనిక వాహనాల నిర్వహణ, విడిభాగాల కొరత తీవ్రంగా ఉంది. ఆకలితో అలమటిస్తున్న సైనికుల నైతిక బలం కూడా బలహీనపడింది. అమెరికా వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సామర్థ్యం వెనిజులా కమ్యూనికేషన్ వ్యవస్థను నిమిషాల్లో కుప్పకూల్చగలదు. సముద్రం మధ్యలో ఉండే అమెరికా విమాన వాహక నౌకల నుండి వచ్చే దాడులను అడ్డుకునే శక్తి వెనిజులా నావికా దళానికి లేదు.
రష్యా, చైనాల పాత్ర కీలకం
వెనిజులాకు సొంత బలం తక్కువైనా దానికి రష్యా, చైనాల వెన్నుదన్ను ఉంది. అందుకే సీక్రెట్ గా వెనిజులాపై దాడిచేసి అధ్యక్షుడిని అరెస్ట్ చేసి అమెరికా తీసుకెళ్లారు.ప్రత్యక్ష యుద్ధం జరిగితే చైనా, రష్యాలు వెనిజులాకు బోలెడంతా సాయం చేసి దెబ్బతీసే ప్రయత్నం చేసి ఉండేవి.
మొత్తానికి వెనిజులా సైన్యం తన పొరుగు దేశాలతో పోలిస్తే బలంగానే ఉన్నప్పటికీ అమెరికా వంటి సూపర్ పవర్‌తో పోల్చడం అశాస్త్రీయమే అవుతుంది. 'ఆపరేషన్ అబ్సొల్యూట్ రిసాల్వ్' వంటి పరిణామాలు నిజమైతే అది వెనిజులా చరిత్రలోనే కాదు.. ప్రపంచ రాజకీయాల్లోనే ఒక భారీ మలుపుగా మారుతుంది.
