10 వేల మరణాలా? వెనెజువెలా భారీ భూకంప తీవ్రత షాకింగ్ అంచనాలు!
మరో భయానక ప్రకృతి విపత్తు చోటు చేసుకుంది. దక్షిణ అమెరికా దేశమైన వెనెజువెలాలో పిశాచ భూకంపం ఒకటి విరుచుకుపడింది.
By: Garuda Media | 25 Jun 2026 10:52 AM ISTమరో భయానక ప్రకృతి విపత్తు చోటు చేసుకుంది. దక్షిణ అమెరికా దేశమైన వెనెజువెలాలో పిశాచ భూకంపం ఒకటి విరుచుకుపడింది. అమెకాకు చెందిన సంస్థ అంచనా ప్రకారం ఈ ఘోర భూకంపంలో దాదాపుగా 10వేల మంది ప్రజలు మరణించి ఉండొచ్చన్న అంచనాలు భయాన్ని కలిగిస్తున్నాయి. అదే సమయంలో తాజా తీవ్రతను చూస్తే.. లక్ష మంది ప్రాణాలు బలైనా ఆశ్చర్యపోనక్కర్లేదన్న మాట వినిపిస్తోంది. దీనికి కారణం బలంగా ఏర్పడిన రెండు భూకంపాలుగా చెబుతున్నారు. షాకింగ్ నిజం ఏమంటే.. వెనెజువెలా చరిత్రలో 1967లో చోటు చేసుకున్న అత్యంత తీవ్రమైన భూకంపం కంటే ఇది ప్రమాదకరమైనదిగా అక్కడి వారు చెబుతున్నారు.
తాజా భూకంప తీవ్రత ఆ దేశం మొత్తాన్నే కాదు పొరుగుదేశమైన కొలంబియా రాజధాని బొగోటా వరకు ప్రకంపనలు చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. భారతకాలమానం ప్రకారం ఈ ఉదయం (గురువారం) 3.34 గంటలకు తొలి భూకంపం చోటు చేసుకుంది. వెనెజువెలా దేశ కాలమానం ప్రకారం జూన్ 24 (బుధవారం) సాయంత్రం 6.04 గంటల సమయంలో తొలి భూకంపం చోటు చేసుకుంది. వెనెజువెలా కంటే భారత కాలమానం 9.30గంటలు ముందు ఉంటుందన్న విషయం తెలిసిందే.
తొలి ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్ మీద 7.1గా నమోదైతే.. సరిగ్గా 40 సెకన్ల తర్వాత చోటు చేసుకున్న రెండో భూకంప తీవ్రత మొదటి దానికి మించి రిక్టర్ స్కేల్ మీద 7.5గా నమోదైంది. భూమికి కేవలం 10 నుంచి 13 కి.మీ. లోతులోనే తాజా భూకంపం చోటు చేసుకోవటంతో విధ్వంస తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. వెనెజువెలా రాజధాని కారకాస్ కు పశ్చిమంగా సుమారు 160 కి.మీ. దూరంలోని కరీబియన్ తీర ప్రాంతం మొరోన్ సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లుగా నమోదైంది.
పిశాచి భూకంప తీవ్రత కారణంగా ఆ దేశ రాజధాని కారకాస్ లోని అల్తామిరా తదితర ప్రాంతాల్లోని పలు బహుళ అంతస్తుల భవనాలు.. నివాస సముదాయాలు పేకమేడల్లా కూలిపోయాయి. దీంతో భారీ ప్రాణ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. భూకంపం ధాటికి అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా.. ఇంటర్నెట్ సరఫరా సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. కారకాస్ ఎయిర్ పోర్టులో రన్ వే.. విమానాశ్రయంలోని భవనాలు దెబ్బ తినటంతో విమాన సర్వీసుల్ని తాత్కాలికంగా నిలిపివేశారు. తీర ప్రాంతం వెంట భూకంపం రావటంతో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
దురదృష్టకరమైన విషయం ఏమంటే వెనెజువెలా దేశ స్వాతంత్య్రానికి కారణమైన చారిత్రక సైనిక విజయం జ్ఞాపకార్థం బుధవారం జాతీయ సెలవుదినం. దీంతో.. ప్రజలంతా ఎక్కువ మంది ఇళ్లల్లోనే ఉండటంతో ప్రాణనష్టం అధికంగా ఉంటుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా భూగర్భ వాస్త్ర సర్వే ప్రాథమిక అంచనాల ప్రకారం.. ఈ విపత్తు కారణంగా ప్రాణ నష్టం పది వేల నుంచి లక్ష వరకు ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న మాటను చెబుతున్నారు. వణికించే ఈ అంచనా నిజం కాకూడదని భావిద్దాం. సాయంత్ర వేళ చోటు చేసుకున్న విధ్వంసక భూకంపంతో పలు భవనాలు కూలిపోవటం.. శిధిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు అత్యవసర సహాయక సిబ్బందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మొత్తంగా అత్యంత తీవ్రమైన సవాల్ ను వెనెజువెలా ఇప్పుడు ఎదుర్కొంటోందని చెప్పక తప్పదు.
