మదురో.. మహా ముదురో...! రూ.40 వేల కోట్ల బంగారం స్విస్ బ్యాంకులకు
స్విట్జర్లాండ్ బ్యాంకులు తమ దగ్గర డిపాజిట్ చేసినవారి వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించవు అని చెప్పేవారు.
By: Tupaki Political Desk | 8 Jan 2026 2:00 AM ISTకొన్నాళ్ల కిందటి వరకు ప్రజా జీవితంలోని నాయకుల మీద ప్రధాన ఆరోపణ ఒకటి ఉండేది... రూ.వేలాది కోట్లను కొల్లగొట్టి స్విస్ బ్యాంకుల్లో దాచారని! ఇది నిరూపితం అయిందీ లేదు..! స్విస్ బ్యాంకులు వెల్లడించినదీ లేదు..! కానీ, స్విస్ బ్యాంకులకు మాత్రం మంచి ప్రచారం దక్కేది. అయితే, ఇప్పుడు కూడా అలాంటి ఆరోపణే మరొకటి బలంగా వినిపిస్తోంది. అది... వెనెజులా పదవీచ్యుత అధ్యక్షుడు నికొలస్ మదురో గురించి. హ్యూగో చావెజ్ మరణం అనంతరం 2013లో మదురో అధ్యక్షుడు అయ్యారు. అప్పటినుంచి మూడేళ్ల పాటు ఆయన భారీగా బంగారాన్ని స్విట్జర్లాండ్ కు తరలించారని కథనాలు వస్తున్నాయి. అయితే, ఇవి పాశ్చాత్య మీడియా పుట్టించే ఫేక్ వార్తలు అనే అభిప్రాయం కూడా ఉంది. తమకు గిట్టనివారి గురించి ఇలా దుష్ప్రచారం చేస్తుందనే వాదన వినిపిస్తున్నది.
అక్కడికే ఎందుకు?
స్విట్జర్లాండ్ బ్యాంకులు తమ దగ్గర డిపాజిట్ చేసినవారి వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించవు అని చెప్పేవారు. అందుకే చాలామంది వాటిలో తమ డబ్బును దాచేవారని అంటారు. ఇలానే మదులో 5.20 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని మదురో స్విట్జర్లాండ్ తరలించారని.. దీని విలువ భారత కరెన్సీలో రూ.46 వేల కోట్లు ఉంటుందని చెబుతున్నారు. అయితే, వెనెజులా 2013 తర్వాత తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంది. ఆర్థిక వ్యవస్థను నిలబెట్టేందుకు భారీఎత్తున బంగారాన్ని ప్రభుత్వం విక్రయించింది. ఆ సమయంలోనే స్విట్జర్లాండ్ కూ తరలింపు జరిగినట్లు చెబుతున్నారు.
2017 నుంచి తరలింపు లేదు..
2013 నుంచి 2017 వరకు 113 టన్నుల బంగారాన్ని వెనెజులా సెంట్రల్ బ్యాంక్ నుంచి స్విట్జర్లాండ్ కు తరలించారని, అయితే, 2017 తర్వాత మాత్రం ఇలాంటిదేమీ లేదని ఇంగ్లిష్ మీడియా రాస్తోంది. దీనికి కారణం యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఆంక్షలేనని ప్రస్తావించింది. ఇప్పుడు మదురోను అమెరికా నిర్బంధించినందున ఆయనతో పాటు ఆయన సహచరులకు సంబంధించిన ఆస్తులను స్తంభింపచేయాలని స్విట్జర్లాండ్ ఆదేశాలు జారీ చేసింది.
ఎన్ని ఆస్తులున్నాయో? వాటి విలువ ఎంతో?
స్విట్జర్లాండ్ లో మదురో, ఆయన సంబంధీకులకు ఎన్ని ఆస్తులున్నాయో? విలువ ఎంతో తెలియాల్సి ఉంది. అయితే, వెనెజులా సెంట్రల్ బ్యాంక్ నుంచి బదిలీ అయిన బంగారానికి ఈ ఆస్తులకు లింక్ ఉన్నదా? అనేది కూడా స్పష్టత లేదు. కేవలం శుద్ధి, సర్టిఫికేషన్ కోసం తరలించారా? అనేది కూడా ఓ అభిప్రాయంగా ఉంది. మదురో తొలిసారి అధ్యక్షుడు అయినప్పుడు బంగారం విక్రయాలు జరిగాయని మాత్రం చెబుతున్నారు. ఎక్కువశాతం గోల్డ్ స్విట్జర్లాండ్ కే చేరిందని అంచనా. తమ చెల్లింపులను బంగారం రూపంలో చేశారని అంటున్నారు.
