వేమిరెడ్డి గరం గరం... నో వ్యాపారం
వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి. 2018 వరకూ రాజకీయ వాసనలు లేని వారు. అందరి వారిగా ఉంటూ వచ్చిన వారు.
By: Satya P | 31 July 2025 9:00 AM ISTవేమిరెడ్డి ప్రభాకరరెడ్డి. 2018 వరకూ రాజకీయ వాసనలు లేని వారు. అందరి వారిగా ఉంటూ వచ్చిన వారు. వీపీఅర్ అన్న పేరుతో నెల్లూరులో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయనకు రాజకీయాల మీద ఆసక్తి కలిగిందో వైసీపీ ఆ చాన్స్ ఇచ్చిందో తెలియదు కానీ వైసీపీ నుంచి 2018లో ఎంపీగా నెగ్గి అనూహ్యంగా పార్లమెంట్ లో అడుగుపెట్టారు. ఆరేళ్ళ పాటు పెద్దల సభలో సభ్యుడిగా ఉంటూనే నెల్లూరు పాలిటిక్స్ లో కీలకం అయ్యారు. వైసీపీలో వర్గ పోరు మొదలైంది. ఆయన వ్యతిరేక వర్గంగా తయారు అయిన వారు ఆయనతో దూరం పాటించారు.
టీడీపీకి అంది వచ్చిన అస్త్రంగా :
కట్ చేస్తే నెల్లూరు జిల్లాలో అంగబలం అర్ధబలం రెండూ జతకలసి టీడీపీకి అంది వచ్చిన అస్త్రంగా వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి మారారు. ఆయన ఎంపీగా నెల్లూరు నుంచి నెగ్గడమే కాకుండా తనతో పాటు పార్టీని పటిష్టం చేశారు ఇక ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కూడా ఎమ్మెల్యేగా కోవూరు నుంచి గెలిచారు. నెల్లూరు టీడీపీలో వేమిరెడ్డి రాజకీయం బాగానే సాగుతోంది. అయితే వైసీపీలో ఒకనాటి ఆయన ప్రత్యర్ధులు ఇపుడు ఎదురు నిలిచి సవాల్ చేస్తున్నారు.
అది ధర్మాగ్రహమేనా :
ఈ నేపథ్యంలో సడెన్ గా మీడియా ముందుకు వచ్చి తన వ్యాపారాన్ని క్లోజ్ చేస్తున్నాను అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా తన క్వార్జ్ వ్యాపారాన్ని మొత్తం మూసేస్తున్నాను అని వేమిరెడ్డి స్టేట్మెంట్ ఇచ్చేశారు. తన వ్యాపారం ద్వారా లక్షలాది మందికి ఉపాధి కల్పించాలనుకుంటే తన మీదనే విమర్శలు చేస్తారా అని గుస్సా అయ్యారు. తాను ప్రజల కోసమే ఫినీ క్వార్జ్, లక్ష్మీ క్వార్జ్ అని రెండు వ్యాపారాలు ప్రారంభించాను అని ఇపుడు వాటిని మూసేస్తున్నాను అని ఆయన తేల్చేశారు.
మాటలు పడలేకపోతున్నా :
తాను ఎక్కడా అక్రమ వ్యాపారాన్ని చేయలేదని కానీ తమ మీద వస్తున్న విమర్శలను తట్టుకోలేకపోతున్నాను అన్నారు. అంతే కాదు సేవ చేద్దామని అనుకుంటే తనను ఇబ్బందులు పెడుతున్నారు అన్నారు. క్వార్జ్ ఫ్యాక్టరీ పెట్టి వేయి మందికి ఉపాధి కల్పించాలన్నది తన ఆలోచన అని అయితే విమర్శలు తనను బాధించాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
వారి ఖర్మకే పోతారు :
ఇదిలా ఉండగా తన ప్రత్యర్ధుల మీద వేమిరెడ్డి సీరియస్ అయ్యారు. తన మీద అనవసరంగా వ్యాఖ్యలు చేసేవారు విమర్శించేవారు వారి ఖర్మకు వారే పోతారు అని ఆయన ఫైర్ అయ్యారు తన మీద వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా అదే జరుగుతుందని అన్నారు. ఇక తాను భవిష్యత్తులో సేవా కార్యక్రమాలు పూర్తి స్థాయిలో నెల్లూరు జిల్లాలో చేస్తాను అన్నారు.
అవినీతి అవసరం లేదు :
తాను అవినీతి చేసి సంపాదించాల్సిన అవసరం లేదని వేమిరెడ్డి చెప్పారు. తాను ఏది చేసినా పారదర్శకంగానే చేస్తాను అన్నారు అందుకే తన మీద వస్తున్న ఆరోపణలు బాధించాయని అన్నారు. తాను క్వార్జ్ వ్యాపారాన్ని మానేసినా ఎవరైనా ఫ్యాక్టరీ పెడతాను అని ముందుకు వస్తే వారికి సహకరిస్తాను అన్నారు. మొత్తానికి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో వేమిరెడ్డి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆయన స్వపక్షంలోని ఎదుటి పక్షంలోని ప్రత్యర్ధులు అందరికీ ఒకే మాటతో జవాబు చెప్పారా అన్న చర్చ సాగుతోంది. మొత్తానికి వేమిరెడ్డి గరం గరం అయ్యారు. నో వ్యాపారం అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
