అలా అని దేవుడి ముందుకు ప్రమాణం చేస్తావా?: జగన్‌కు ఎంపీ సవాల్
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు.. ఆ పార్టీ మాజీ నేత, ప్రస్తుత టీడీపీ నాయకుడు, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భారీ సవాల్ రువ్వారు.
By: Garuda Media | 8 Dec 2025 12:22 PM ISTవైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు.. ఆ పార్టీ మాజీ నేత, ప్రస్తుత టీడీపీ నాయకుడు, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భారీ సవాల్ రువ్వారు. అంతేకాదు.. జగన్‌పై ఆయన తొలిసారి తీవ్ర విమర్శలు కూడా చేశారు. 2024 ఎన్నికలకు ముందు వైసీపీలో ఉన్న వేమిరెడ్డి.. తనకు, తన సతీమణికి కూడా రెండు టికెట్లు అడిగారు. అయితే.. జగన్ ఎంపీ టికెట్ ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. కానీ.. రెండు టికెట్లు కావాలని వేమిరెడ్డి పట్టుబట్టారు. దీంతో ఇరువురి మధ్య బంధం చెడి.. వేమిరెడ్డి.. టీడీపీలో చేరి.. రెండు టికెట్లు సంపాయించుకున్నారు. భార్యా భర్త.. ఇరువురు విజయం దక్కించుకున్నారు.
అయితే.. ఆ తర్వాత.. ఎప్పుడూ.. వేమిరెడ్డి కుటుంబం నేరుగా జగన్‌ను టార్గెట్ చేసుకుని మాట్లాడింది కానీ.. ఆయనపై విమర్శలు చేసింది కానీ.. లేదు. పైగా మాజీ వైసీపీ నాయకుడు, ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్‌రెడ్డి కూడా.. వేమిరెడ్డి తమకు, వైసీపీకి ఎంతో సాయం చేశారని పలుమార్లు చెప్పడం గమనార్హం. అలాంటి వేమిరెడ్డి తాజాగా జగన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మనసు రగిలిపోతోందని.. అందుకే.. జగన్‌పై కామెంట్లు చేయాల్సి వస్తోందని ఆయన చెప్పుకొచ్చారు.
ఆదివారం నెల్లూరులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తిరుమల లడ్డూ కేసులో పోలీసుల అదుపులో ఉన్న వైవీ సుబ్బారెడ్డి పీఏ.. చిన్న అప్పన్నకు తాను డబ్బులు ఇచ్చిన మాట వాస్తవమేనని చెప్పారు. అయితే.. అప్పన్న కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే సాయం చేశానని.. వ్యాఖ్యానించారు. కానీ, జగన్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. అప్పన్న మంచి వాడని.. అందుకే వేమిరెడ్డి కూడా డబ్బులు ఇచ్చాడని అన్నారని.. ఇది తప్పని చెప్పారు.
అప్పన్న కుటుంబానికి సేవా భావంతోనే తాను 50 వేలు ఇచ్చినట్టు చెప్పారు. కానీ, తానేదో తప్పు చేసినట్టు జగన్ మాట్లాడారని వేమిరెడ్డి వ్యాఖ్యానించారు. ``వేమిరెడ్డి అంటే ఏంటో అందరికీ తెలుసు. జగన్‌కు కూడా తెలుసు. కానీ, నన్ను రాజకీయంగా బద్నాం చేసేందుకు ఎలా పడితే అలా మాట్లాడారు. అప్పన్నకు చేసిన సాయం వెనుక దురుద్దేశం ఆపాదించారు. ఇది నిజమా కాదా? జగన్ మాట్లాడింది.. సత్యమా? అసత్యమా? అనేది.. ఆయన దేవుడి ముందుకు ప్రమాణం చేయాలి!.`` అని వేమిరెడ్డి సవాల్ రువ్వారు.
ఇదిలావుంటే.. అప్పన్నను పోలీసులు కల్తీ నెయ్యి కేసులో అదుపులోకి తీసుకున్నారు. ఆయన అకౌంట్‌లో రూ.4.5 కోట్ల సొమ్మును గుర్తించారు. ఈ విషయాన్ని ఇటీవల ప్రస్తావించిన జగన్.. వేమిరెడ్డికూడా అప్పన్నకు నిధులు ఇచ్చారని.. ఈ విషయాన్ని తెలిసి కూడా.. దీనిని రాజకీయం చేస్తున్నారని అన్నారు. అంటే.. ఆ 4.5 కోట్ల సొమ్ము.. వేమిరెడ్డివేనన్న ఉద్దేశంలో ఆయన వ్యాఖ్యానించారు. ఇది రాజకీయంగా ఇబ్బందికర వాతావరణం సృష్టించింది. దీనికి వివరణ ఇచ్చిన వేమిరెడ్డి.. తాను రూ.50 వేలు ఇచ్చింది వాస్తవమేనని.. కానీ, అప్పన్న కుటుంబం ఇబ్బందుల్లో ఉంది కాబట్టి ఇచ్చానన్నారు. ఇప్పుడు జగన్ ఏం చెబుతారో చూడాలి.
