Begin typing your search above and press return to search.

వేమిరెడ్డి దంప‌తులు పార్టీ మారుతున్నారా? క్లారిటీ ఇదే!

ఇక‌, అప్ప‌టి నుంచి పుంఖాను పుంఖాలుగా వేమిరెడ్డి దంప‌తులు పార్టీ మారుతున్నార‌న్న వార్త‌లు వెలుగు చూస్తున్నాయి.

By:  Garuda Media   |   5 April 2026 6:17 PM IST
వేమిరెడ్డి దంప‌తులు పార్టీ మారుతున్నారా?  క్లారిటీ ఇదే!
X

ప్ర‌స్తుతం టీడీపీలో ఉన్న ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌, కాంట్రాక్ట‌రు వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి ఆయ‌న స‌తీమ‌ణి వేమిరెడ్డి ప్ర‌శాంతి.. పార్టీ మారుతున్నార‌ని... వారు టీడీపీని వ‌దిలేస్తున్నార‌ని.. గ‌త వారం రోజులుగా సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనికి కార‌ణం.. ఓప‌ది రోజుల కింద‌ట వారు.. వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు ఆళ్ల అయోధ్య‌రామిరెడ్డితో భేటీ కావ‌డ‌మే. వైసీపీలో కీల‌కంగా ఉన్న అయోధ్య రామిరెడ్డి తో వారు చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డ‌మే ఈ వాద‌న‌కు ప్ర‌ధాన కార‌ణం.

ఇక‌, అప్ప‌టి నుంచి పుంఖాను పుంఖాలుగా వేమిరెడ్డి దంప‌తులు పార్టీ మారుతున్నార‌న్న వార్త‌లు వెలుగు చూస్తున్నాయి. వాస్త‌వానికి గ‌త 2024 ఎన్నిక‌ల‌కు ముందు ఈ దంప‌తులు వైసీపీలోనే ఉన్నారు. 2019 ఎన్నిక‌లు.. దీనికి ముందు జ‌గ‌న్ పాద‌యాత్ర చేసిన స‌మ‌యంలోనూ వేమిరెడ్డి కొన్ని కొన్ని జిల్లాల్లో ఖ‌ర్చు లు భ‌రించార‌ని అంటారు. ఈ క్ర‌మంలో వైసీపీకి-వేమిరెడ్డికి మ‌ధ్య బంధం ఉంద‌న్న‌ది వాస్త‌వ‌మే. అయితే.. 2024లో ఈ బంధం చెడిపోయింది.

త‌న‌కు ఎంపీ సీటు, త‌న స‌తీమ‌ణికి ఎమ్మెల్యే సీటు కావాల‌ని.. వేమిరెడ్డి జ‌గ‌న్ ద‌గ్గ‌ర డిమాండ్ పెట్టారు. ఎంపీ సీటు ఇచ్చేందుకు ఓకే చెప్పిన జ‌గ‌న్‌.. కోవూరు నియోజ‌క‌వ‌ర్గం అసెంబ్లీ సీటును మాత్రం ఇచ్చేది లేద‌ని తేల్చి చెప్పారు. ఎందుకంటే.. ఇక్క‌డ న‌ల్ల‌ప‌రెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డి వైసీపీ నాయ‌కుడుగా ఉన్నారు. అంతేకాదు.. అప్ప‌టికే ప్ర‌శాంతి రెడ్డి వైసీపీ హ‌యాంలో కూడా టీటీడీ బోర్డు మెంబ‌రుగా ఉన్నార‌న్న కార‌ణాన్ని కూడా చూపించారు.

దీంతో ఈ సీట్ల వ్య‌వ‌హారం బెడిసి కొట్టి.. వేమిరెడ్డి దంప‌తులు.. చంద్ర‌బాబు స‌మ‌క్షంలో టీడీపీ కండువా క‌ప్పుకొన్నారు. నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి, కోవూరు ఎమ్మెల్యేగా ప్ర‌శాంతి విజ‌యం ద‌క్కించుకున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌శాంతి రెడ్డి టీటీడీ బోర్డు మెంబ‌రుగా కూడా కొన‌సాగుతున్నారు. అయితే.. ఇటీవ‌ల ఆళ్ల‌ను క‌లుసుకోవ‌డంతో వీరు పార్టీ మారుతున్నార‌న్న చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. తాజాగా ఈ వ్య‌వ‌హారంపై దంప‌తులు మీడియా ముందుకు వ‌చ్చారు. తాము పార్టీ మార‌డం అనేది లేద‌ని.. జ‌గ‌న్ త‌మ‌కు ఎన్ని ప‌ద‌వులు ఇస్తామ‌ని ఆశ చూపినా.. చంద్ర‌బాబు వైపే ఉంటామ‌ని.. అస‌లు ఆ చ‌ర్చ‌కు అర్ధం కూడా లేద‌ని కొట్టి పారేశారు.