వైసీపీ మాజీ మంత్రి మరోసారి దూకుతారా ?
వైసీపీకి చెందిన ఒక మాజీ మంత్రి మీద చర్చ సాగుతోంది. ఆయన ఉన్నది రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లాలో.
By: Satya P | 30 July 2025 8:30 AM ISTవైసీపీకి చెందిన ఒక మాజీ మంత్రి మీద చర్చ సాగుతోంది. ఆయన ఉన్నది రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లాలో. ఆయన రాజకీయం చూసిన వారు ఆయన తాజాగా మౌన ముద్ర దాల్చిన విధానం గురించి చర్చిస్తున్న వారు ఆయన ఏదైనా సంచలన నిర్ణయం తీసుకుంటారా అని ఆలోచిస్తున్నారుట. ఇంతకీ ఎవరాయన ఏమా కధ అంటే విషయం చాలానే ఉంది అంటున్నారు.
అరంగేట్రం అక్కడ నుంచే :
ఆయనే ఉమ్మడి క్రిష్ణా జిల్లాకు చెందిన వెల్లంపల్లి శ్రీనివాస్. ఆయన 2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. తొలి ప్రయత్నంలోనే విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించి ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తరువాత ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం కావడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే అయ్యారు. ఆ తరువాత 2014లో విభజన తరువాత బీజేపీలో చేరి విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేశారు. టీడీపీతో పొత్తు ఉన్నా ఆయన ఓటమికి చూశారు. ఇక 2016లో ఆయన వైసీపీలో చేరారు.
మూడేళ్ళ మంత్రిగా హవా :
ఆయన వైసీపీలో 2019లో విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. జగన్ ఆయనను తొలి మంత్రివర్గంలోనే తీసుకున్నారు. అలా మూడేళ్ళ పాటు దేవాదాయ శాఖ మంత్రిగా చక్రం తిప్పారు. వైసీపీ ఫైర్ బ్రాండ్ మినిస్టర్లలో ఒకరిగా నిలిచారు. జగన్ మీద ఈగవాలనివ్వలేదు. టీడీపీ జనసేన పెద్దల మీద ఆయన గట్టిగానే విమర్శలు చేస్తూ వచ్చారు. అయితే 2024 ఎన్నికల్లో ఆయనను తీసుకుని వచ్చి విజయవాడ సెంట్రల్ లో పోటీ చేయించారు. అయితే అక్కడ సీనియర్ టీడీపీ నేత బొండా ఉమా ఘన విజయం సాధించడంతో వెల్లంపల్లి ఓటమి చవిచూశారు.
సైలెంట్ అయిన వైనం :
ఇదిలా ఉంటే ఆయన గత ఏడాదిగా చూస్తే సైలెంట్ అయ్యారని అంటున్నారు ఫైర్ బ్రాండ్ గా ఉన్న ఆయన ఇపుడు మౌనంగా ఉండడం పట్ల పార్టీలో చర్చ సాగుతోంది. ఆయన పార్టీ కార్యక్రమాలలో పెద్దగా కనిపించడం లేదని అంటున్నారు. ఇక వైసీపీ ఫైర్ బ్రాండ్ల మీద మాజీ మంత్రుల మీద కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తున్న నేపధ్యమ్న్లో కొంతకాలం మౌనంగా ఉండడమే బెటర్ అని ఆయన అలా వ్యవహరిస్తున్నారా అన్న చర్చ సాగుతోంది.
బీజేపీలో చేరుతారా :
ఇవన్నీ పక్కన పెడితే తాజాగా మరో ప్రచారం అయితే వెల్లంపల్లి విషయంలో ముందుకు వస్తోంది. ఆయన బీజేపీలో చేరుతారని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఆయన బీజేపీలో కూడా గతంలో పనిచేశారు. ఆయనకు ఆ పార్టీలో చాలా మందితో మంచి పరిచయాలు ఉన్నాయని అంటున్నారు. ఇక తాజాగా బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ గా నియమితులు అయిన పీవీఎన్ మాధవ్ ఆయనకు మంచి స్నేహితుడు అని అంటున్నారు. దాంతో మాధవ్ ని ఈ మధ్యనే హైదరాబాద్ లో కలసి చర్చించారు అని కూడా ప్రచారం సాగుతోంది.
ముహూర్తం చూసుకుంటున్నారా :
వెల్లంపల్లి ఎందుకో వైసీపీలో ఇమడలేకపోతున్నారు అని అంటున్నారు. ఆయన కూటమి పార్టీల లోకి వెళ్ళాలంటే బీజేపీ ఏకైక ఆల్టర్నేషన్ గా ఉంది అని అంటున్నారు. బీజేపీలో ఉంటూ వచ్చే ఎన్నికల్లో పొత్తులో సీటు సాధించాలని చూస్తున్నారు అంటున్నారు ప్రస్తుతం విజయవాడ వెస్ట్ నుంచి బీజేపీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చు అని అంటున్నారు. దాంతో వెస్ట్ నుంచి కమలం పార్టీ తరఫున పోటీకి రంగం సిద్ధం చేసుకునేందుకు ఆ పార్టీలోకి జంప్ చేస్తారని అంటున్నారు. ఆయన తన పదహారేళ్ళ రాజకీయ జీవితంలో అనేక పార్టీలు మారారని మరో దూకుడు ఉన్నా ఆశ్చర్యం లేదని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో. ఈ ప్రచారంలో నిజమెంత అన్నది.
