వెలిగొండతో ఏం మార్పు వస్తుంది? మార్కాపురం ముఖచిత్రం మారబోతోందా?!
దశాబ్దాల తరబడి కరువు కాటకాలతో అల్లాడిపోయిన పశ్చిమ ప్రకాశం ప్రాంత ప్రజల కల సాకారమయ్యే చారిత్రక తరుణం ఆసన్నమైంది.
By: Tupaki Political Desk | 26 Aug 2026 11:00 PM ISTదశాబ్దాల తరబడి కరువు కాటకాలతో అల్లాడిపోయిన పశ్చిమ ప్రకాశం ప్రాంత ప్రజల కల సాకారమయ్యే చారిత్రక తరుణం ఆసన్నమైంది. నీటి కోసం ఎదురుచూసిన తల్లుల కష్టాలకు, వలసలతో అల్లాడిన రైతు కుటుంబాల వ్యథలకు ముగింపు పలకడానికి రంగం సిద్ధమైంది. కరవు నేలపై కృష్ణమ్మను పరుగులు పెట్టించి, చరిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందులో భాగంగా ఆగస్టు 31న వెలిగొండ ప్రాజెక్ట్ (ఫేజ్-1) ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది.
ముగియనున్న తరతరాల వ్యథ
ఒక బిందెడు నీళ్ల కోసం మైళ్ల దూరాలు నడవడం, ఫ్లోరైడ్ నీటితో ప్రాణాలు కోల్పోవడం, వర్షాభావంతో పంటలు పండక వలస బాట పట్టడం... ఇవి ఇన్నాళ్లూ మార్కాపురం, కనిగిరి, పొదిలి ప్రాంత ప్రజల జీవితాల్లో నిత్యకృత్యం. వర్షం పడితే పంట, లేదంటే ఆకలి మంటలతో అల్లాడిపోవడం అక్కడి రైతుల దైన్యం. ఈ దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారంగా వెలిగొండ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది. ఇది కేవలం ఒక సాగునీటి ప్రాజెక్ట్ మాత్రమే కాదు... మార్కాపురం ప్రాంత ప్రజల బతుకులకు భరోసా, పునర్జన్మ అని చెబుతున్నారు.
30 ఏళ్లకు సాకారమైన స్వప్నం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో 1996 మార్చి 5న ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 1999లో మొదటి దశకు పరిపాలనా అనుమతులిచ్చి నిర్మాణానికి బలమైన పునాది వేశారు. అవాంతరాలు, అడ్డంకులు, సవాళ్లను దాటుకుంటూ వచ్చిన ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని చెబుతున్నారు. శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్స్ నుంచి పూర్తి గ్రావిటీ ద్వారా 53.85 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునేలా జంట సొరంగాల ద్వారా ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేశారు. నదీగర్భంలో కాకుండా గ్రావిటీ ద్వారా నీటిని తరలించే అతిపెద్ద ప్రాజెక్టుల్లో వెలిగొండ ఒకటిగా నిలిచింది.
యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు
2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెలిగొండ ప్రాజెక్టు పనులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చిందని చెబుతున్నారు. పెండింగ్ బిల్లుల చెల్లింపులు, సొరంగ మార్గాల్లో (టన్నెల్స్) అడ్డంకులను తొలగించడం, ఫీడర్ కాలువల లైనింగ్, హెడ్ రెగ్యులేటర్ల నిర్మాణం వంటి పనులను సమాంతరంగా వేగవంతం చేశారు. ఇక నిర్వాసితుల సమస్యలకు ప్రాధాన్యమిచ్చిన ప్రభుత్వం, కేవలం 48 రోజుల్లోనే మూడు విడతలుగా సుమారు రూ.768 కోట్లను నిర్వాసితుల ఖాతాల్లో జమ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. అధికారుల సమన్వయం, ప్రభుత్వ దృఢ సంకల్పంతో మొదటి విడత పనులు దిగ్విజయంగా పూర్తయ్యాయి.
మొత్తం రూ. 10,200 కోట్లు అంచనాతో చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టు వల్ల ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కడప జిల్లాల పరిధిలోని 30 మండలాలకు చెందిన 4,47,300 ఎకరాలకు సాగునీరు అందనుందని ప్రభుత్వం చెబుతోంది. అదేవిధంగా ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లోని సుమారు 23 లక్షల మందికి స్వచ్ఛమైన తాగునీరు లభించనుందని అంటున్నారు. తొలి విడతలో 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందుతుంది. నల్లమల సాగర్‌కు కృష్ణా జలాలను విడుదల చేసే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
వలసలకు శాశ్వత స్వస్తి
వెలిగొండ జలాలు అందుబాటులోకి రావడంతో పశ్చిమ ప్రకాశంలో వ్యవసాయ రంగం ముఖచిత్రం పూర్తిగా మారిపోనుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ఉద్యాన పంటలు, అగ్రో-ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు అవకాశం ఏర్పడటంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనివల్ల నగరాలకు తరలివెళ్లే వలసలకు చెక్ పడనుందని అంటున్నారు.
