Begin typing your search above and press return to search.

వెలగపూడి మినిస్టర్ ఎందుకు కాకూడదు ?

విశాఖ జిల్లాలో ఒకే నియోజకవర్గం నుంచి వరసగా నాలుగు సార్లు గెలిచిన ఘనత ఇటీవల కాలంలో ఆయన ఒక్కడికే ఉంది.

By:  Satya P   |   12 March 2026 7:00 AM IST
వెలగపూడి  మినిస్టర్  ఎందుకు కాకూడదు ?
X

విశాఖ జిల్లాలో ఒకే నియోజకవర్గం నుంచి వరసగా నాలుగు సార్లు గెలిచిన ఘనత ఇటీవల కాలంలో ఆయన ఒక్కడికే ఉంది. ఆయనే విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణబాబు. 2009లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో విశాఖ రెండవ నియోజకవర్గం కాస్తా అనేక భాగాలుగా మారి అందులో ఒకటి విశాఖ తూర్పు అయింది. అలా తొలిసారి వచ్చిన ఎన్నికల్లో మొదటిసారి టీడీపీ నుంచి పోటీ చేసిన రామక్రిష్ణబాబు హోరాహోరీ పోరులో కేవలం మూడు వేల ఓట్లతో విజయం సాధించారు. అయితే అది అసాధారణమైన విజయంగానే అంతా చూశారు. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ ఈ నియోజకవర్గంలో టీడీపీకి గట్టి పోటీ ఇచ్చింది.

పాతుకుపోయిన వైనం :

అది లగాయితూ వెలగపూడి వరసగా గెలవడం ఎలాగో తెలుసుకున్నారు. దానికి ఆయన ప్రజలను నమ్ముకోవడమే మార్గంగా చేసుకున్నారు. ప్రజలతో నిరంతరం మమేకం కావడం వారి సమస్యలను అధికారంలో ఉన్నా లేకపోయినా పరిష్కరించే విధంగా తపన పడడం ఆయన విజయ రహస్యాలుగా చెబుతారు. ఇక చూస్తే ఆయన విశాఖ తూర్పులో ఎక్కువగా బీసీలు ఉంటారు. కానీ వారి అందరి మద్దతు మన్నన పొందడం వెలగపూడి వ్యూహ చతురతకు నిదర్శనం అని చెబుతారు. విశాఖ తూర్పుని టీడీపీకి కంచుకోటగా ఆయన మార్చేశారు. వైసీపీ గెలవని నియోజకవర్గాలలో ఇది ఒకటి అంటే ఆ క్రెడిట్ వెలగపూడిది అని అంటారు.

మంత్రి కాకూడదా :

ఇదిలా ఉంటే మంత్రి వర్గ విస్తరణ జరిగిన ప్రతీ సారీ చాలా మంది పేర్లు వినిపిస్తూ ఉంటాయి. అందులో వెలగపూడి పేరు అయితే గతంలో పెద్దగా ఉండేది కాదు కానీ ఈసారి ఆయన పేరు కూడా వినిపిస్తోంది. నాలుగు సార్లు గెలిచిన సీనియర్ నేత జిల్లా రాజకీయాల మీద పూర్తి అవగాహన ఉన్న వారు, గత ఏడాది విశాఖ నగర పాలక సంస్థ మేయర్ పీఠాన్ని వైసీపీ నుంచి కూటమి వైపుగా దక్కించడంతో కీలకమైన పాత్ర పోషించారు ఇలా చాలా ఆయన గురించి చెబుతున్నారు. పార్టీకి వీర విధేయుడిగా ఉంటారని అంగ బలం అర్ధబలం కలిగిన వారుగా పార్టీకి అండగా ఉంటారని చెబుతారు. అందుకే ఈసారి ఆయనకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వకూడదు అన్న చర్చ సొంత పార్టీలో వస్తోంది అని అంటున్నారు.

ఇదే ఆఖరు చాన్స్ గా :

వెలగపూడి ఈసారి ఎన్నికలతో తన రాజకీయ జీవితానికి విరామం ఇద్దామని చూస్తున్నారు అని అంటున్నారు. ఆయన వారసుడిగా రెండవ కుమారుడిని అపుడే రెడీ చేసి జనంలోకి పంపిస్తున్నారు. వెలగపూడికి కూడా ఒక కోరిక ఉందని తాను కూడా మినిస్టర్ వెలగపూడి అనిపించుకోవాలన్నదే ఆ కోరిక అంటున్నారు. విశాఖ అర్బన్ జిల్లాలో ఓటని ఎరగని నేతగా ఉన్న వెలగపూడికి మంత్రి పదవి ఇస్తే తప్పేమిటి అన్నది కూడా చర్చగా ఉంది.

అదే మైనస్ అంటున్నా :

అయితే వెలగపూడి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు. దాంతో సామాజిక సమీకరణలే ఆయన మంత్రి పదవికి అడ్డుగా మరుతున్నాయని చెబుతున్నారు. కానీ కేవలం ఈ ఒక్క కారణంతో మంత్రి పదవిని కాకుండా చేయడం కూడా సమంజసం కాదని అంటున్న వారూ ఉన్నారు. వెలగపూడి విశాఖ నగరం నడి బొడ్డున ఉన్న నియోజకవర్గం నాయకుడు. సైలెంట్ గా ఉంటూనే కాగల కార్యాన్ని నెరవేరుస్తారు అని పేరు. మరి అలాంటి నేతకు ఇస్తే విశాఖ జిల్లాలో పార్టీ మరింతగా బలపడుతుంది కదా అంటున్నారు. అంతే కాదు నిబద్ధత కలిగిన వారికి అవకాశం ఇచ్చినట్లు అవుతుందని చెబుతున్నారు. మరి చూడాలి ఆయన ఆశలు నెరవేరే అవకాశాలు ఉన్నాయో లేవో.