Begin typing your search above and press return to search.

కేరళంలో 10 రోజుల ఉత్కంఠకు తెర.. పోస్టర్ల యుద్ధంతో దిగివచ్చిన కాంగ్రెస్ అధిష్టానం?

కేరళం ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్ పేరును ప్రకటిస్తూ గురువారం కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటన విడుదల చేసింది.

By:  Tupaki Political Desk   |   14 May 2026 1:43 PM IST
కేరళంలో 10 రోజుల ఉత్కంఠకు తెర.. పోస్టర్ల యుద్ధంతో దిగివచ్చిన కాంగ్రెస్ అధిష్టానం?
X

కేరళం రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా సీనియర్ నేత వీడీ సతీశన్ పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. పది రోజులుగా కొనసాగిన ఉత్కంఠకు తెర దించింది. గత నెలలో కేరళం అసెంబ్లీ ఎన్నికలు జరగగా, ఈ నెల 4న ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన కాంగ్రెస్ దాదాపు పది రోజులుగా సీఎల్పీ నేత ఎంపికపై తీవ్ర తర్జనభర్జనలకు లోనైందని చెబుతున్నారు. పార్టీలో ముగ్గురు నేతలు సీఎం పీఠం కోసం పోటీపడటంతో కాంగ్రెస్ అధిష్టానం ఆలోచనలో పడింది. ఎవరిని ఎంపిక చేయాలన్న అంశంపై సుదీర్ఘంగా చర్చించి ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది.

కేరళం ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్ పేరును ప్రకటిస్తూ గురువారం కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటన విడుదల చేసింది. పార్టీ కేరళం ఇంచార్జి దీప్ దాస్ మున్షీ ఈ మేరకు ప్రకటన చేశారు. కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ నేతగా సతీశన్ ను ఎంపిక చేసినట్లు ఆమె ప్రకటించారు. దీంతో సతీశన్ కేరళం ముఖ్యమంత్రి కానున్నారని తేలిపోయింది. అంతేకాకుండా పది రోజులుగా కొనసాగిన హైడ్రామా ముగిసినట్లైంది. గత అసెంబ్లీలోనూ సతీశన్ సీఎల్పీ నేతగా పనిచేశారు. అయితే ఎన్నికల అనంతరం ఆయనకు పోటీగా సీనియర్ నేత, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, మరో సీనియర్ నేత రమేశ్ చెన్నితాల రేసులోకి రావడంతో ఎవరికి పట్టం కట్టాలనే అంశంపై కాంగ్రెస్ అధిష్టానం మీమాంసలో పడిపోయిందని చెబుతున్నారు.

గత అసెంబ్లీలో సీఎల్పీ నేతగా పనిచేసిన వీడీ సతీశన్ రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కారణమయ్యారు. ఆయనకు సీనియర్ నేతలు, మిత్రపక్షాలు మద్దతుగా నిలిచాయి. మరోవైపు పార్టీ అధిష్టానానికి సన్నిహితుడిగా కేసీ వేణుగోపాల్ పేరు ఎక్కువగా వినిపించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది తీవ్ర ఉత్కంఠకు కారణమైంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంగ గాంధీ తదితరులు కేరళ కాంగ్రెస్ నేతలతో చర్చించినా ఏకాభిప్రాయం సాధించలేకపోయారని ప్రచారం జరిగింది. మరోవైపు పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుని ప్రతిష్ఠంభనకు ముగింపు పలకాలని భావించారు.

మరోవైపు పార్టీ నేతల అభిప్రాయాలను సేకరించేందుకు త్రీమెన్ కమిటీని అధిష్టానం నియమించింది. సీనియర్ నేత జైరామ్ రమేష్ ఆధ్వర్యంలోని ఈ కమిటీ ఎమ్మెల్యేలతో చర్చించి వీడీ సతీశన్ పేరును అధిష్టానానికి సూచించినట్లు చెబుతున్నారు. దీంతో ఎమ్మెల్యేల మద్దతు ఎక్కువగా ఉన్న సతీశన్ పేరును ఖరారు చేస్తూ కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటన చేసింది. మరోవైపు సీఎం పేరు ఖరారు చేయడంలో కాంగ్రెస్ అధిష్టానం వైఖరిని ప్రదర్శిస్తూ రాష్ట్రంలో రెండు రోజులుగా పోస్టర్లు వెలియడం కలకలం రేపింది. ప్రధానంగా పార్టీ నేత ప్రియాంక గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్ నియోజకవర్గంలో మూర్ఖపు నిర్ణయాలు తీసుకోవద్దని పార్టీ అగ్రనేతలు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీని హెచ్చరిస్తున్నట్లు కొన్ని పోస్టర్లు వెలిశాయి. అదేవిధంగా కేసీ వేణుగోపాల్ ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేస్తే కాంగ్రెస్ అధిష్టానాన్ని ప్రజలు క్షమించరని మరికొన్ని పోస్టర్లలో హెచ్చరించారు. కాంగ్రెస్ కార్యాలయానికి సమీపంలోనే ఇటువంటి పోస్టర్లు వెలియడం కూడా పార్టీపై ఒత్తిడి పెంచిందని వ్యాఖ్యానిస్తున్నారు.