Begin typing your search above and press return to search.

టీవీకే కార్యకర్త ఆత్మాహుతి యత్నం.. అన్‌కండీషనల్ సపోర్ట్‌కు వీసీకే గ్రీన్ సిగ్నల్.. విజయ్ కష్టాలు తీరినట్టేనా?

ముఖ్యంగా ఒక కార్యకర్త ఆత్మాహుతి యత్నం చేయడం.. మరోవైపు వీసీకే బేషరతు మద్దతు ప్రకటించడం వంటి పరిణామాలు విజయ్ రాజకీయ భవిష్యత్తును కీలక మలుపు తిప్పాయి.

By:  A.N.Kumar   |   9 May 2026 5:56 PM IST
టీవీకే కార్యకర్త ఆత్మాహుతి యత్నం.. అన్‌కండీషనల్ సపోర్ట్‌కు వీసీకే గ్రీన్ సిగ్నల్.. విజయ్ కష్టాలు తీరినట్టేనా?
X

తమిళనాడు రాజకీయ యవనికపై అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధికార పీఠాన్ని అధిరోహించే దిశగా అడుగులు పడుతుండగా అటు కార్యకర్తల భావోద్వేగాలు, ఇటు రాజకీయ సమీకరణాలు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా ఒక కార్యకర్త ఆత్మాహుతి యత్నం చేయడం.. మరోవైపు వీసీకే బేషరతు మద్దతు ప్రకటించడం వంటి పరిణామాలు విజయ్ రాజకీయ భవిష్యత్తును కీలక మలుపు తిప్పాయి.

విజయ్ సీఎం కావాలని కార్యకర్త ఆత్మాహుతి యత్నం

విజయ్ ముఖ్యమంత్రి కావాలని, టీవీకే ప్రభుత్వం ఏర్పడాలని కోరుకుంటూ తిరునెల్వేలికి చెందిన ఇసక్కియప్పన్ అనే వీరాభిమాని, పార్టీ కార్యకర్త ఆత్మాహుతికి పాల్పడటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం జరుగుతోందన్న మనస్తాపంతో అతను తన ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్ర గాయాలపాలైన అతడిని గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.

నిజానికి ఇసక్కియప్పన్ ఇలాంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడం ఇదే మొదటిసారి కాదు. నాలుగు నెలల క్రితం కూడా విజయ్ రాజకీయ విజయాలను కాంక్షిస్తూ తన చెంపలను ఇనుప చువ్వతో పొడుచుకుని నిరసన వ్యక్తం చేశాడు. తాజా ఘటనతో టీవీకే నాయకత్వం దిగ్భ్రాంతికి గురైంది. అభిమానం ఉండాలి కానీ.. అది ప్రాణాలు తీసుకునే స్థాయికి వెళ్లకూడదని, కార్యకర్తలు సంయమనం పాటించాలని పార్టీ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు.

బేషరతు మద్దతుకు వీసీకే మొగ్గు.. మారిన సమీకరణాలు

తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటులో నెలకొన్న ప్రతిష్టంభనకు వీసీకే నిర్ణయంతో తెరపడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటివరకు 'డిప్యూటీ సీఎం' పదవి కావాలని పట్టుబట్టిన విడుతలై చిరుతైగల్ కచ్చి (వీసీకే).. ఇప్పుడు అనూహ్యంగా వెనక్కి తగ్గింది. విజయ్ నేతృత్వంలోని టీవీకేకు ఎటువంటి షరతులు లేకుండా మద్దతు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

చెన్నైలోని ఒక ప్రముఖ హోటల్‌లో టీవీకే ముఖ్య నేతలు, వీసీకే ప్రతినిధులు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో డీఎంకే, బీజేపీ వంటి ప్రధాన ప్రత్యర్థులను ఎదుర్కోవాలంటే చీలికలు లేకుండా కలిసి సాగడమే శ్రేయస్కరమని వీసీకే భావిస్తోంది. ఈ క్రమంలోనే అధికారిక ప్రకటన వెలువడడమే తరువాయి అని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

విజయ్ కష్టాలు తీరినట్టేనా?

ఒకవేళ వీసీకే మద్దతు అధికారికంగా ఖరారైతే అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 'మ్యాజిక్ ఫిగర్' విజయ్ సునాయాసంగా అందుకుంటారు. దీనివల్ల తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త శకం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వీసీకే మద్దతుతో టీవీకే కూటమి బలమైన శక్తిగా మారుతుంది. ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ నుంచి ఆహ్వానం అందే అవకాశం మెరుగుపడుతుంది. అటు కార్యకర్తల భావోద్వేగాలను నియంత్రించడం, ఇటు మిత్రపక్షాలను కలుపుకుపోవడం విజయ్‌కు పెద్ద పరీక్షే.

విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే క్షణాల కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. రాజకీయ వ్యూహాలు ఫలించి, మద్దతు కూడితే విజయ్ కష్టాలు తీరినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది.