Begin typing your search above and press return to search.

కులం చూసే నాకు పదవులు... మినిస్టర్ బోల్డ్ స్టేట్మెంట్

నా కులం చూసే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, మంత్రి పదవి కూడా అందుకే ఇచ్చారు అని తమ సామాజిక వర్గం వారి సమావేశంలో తాజాగా వాసంశెట్టి అన్న మాటలు ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

By:  Satya P   |   17 Nov 2025 8:51 PM IST
కులం చూసే నాకు పదవులు... మినిస్టర్ బోల్డ్ స్టేట్మెంట్
X

కులం అన్నది రాజకీయాల్లో అవసరమే. సామాజిక సమీకరణలు రాజకీయ వ్యూహాలలో అతి ముఖ్య పాత్ర పోషిస్తాయి. అయితే కేవలం కులం మాత్రమే రాజకీయం కాదు, ఈ సంగతి అందరికీ తెలుసు. బలమైన సామాజిక వర్గం ఎంతో నేపథ్యం ఉన్నా పదవులు రాని వారు అందుకోని వారు ఎందరో ఉన్నారు అంటే దాని కంటే ఎన్నో ముఖ్యమైనవి కూడా ప్రజా జీవితంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయన్నది కూడా అందరికీ అర్ధం అయ్యే విషయం. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఒక మంత్రి గారు బాహటంగానే కులమే తనకు పదవులు తెచ్చి పెట్టిందని స్టేట్మెంట్ ఇచేశారు. అంతే కాదు తన సామాజిక వర్గం మనసు గెలుచుకుంటాను అని మరో ప్రకటన చేసారు. ఇంతకీ ఆ మినిస్టర్ ఎవరు అంటే వాసంశెట్టి సుభాష్. ఆయన ఏపీ ప్రభుత్వంలో కార్మిక సంక్షేమ శాఖ మంత్రిగా పని చేస్తున్నారు.

ఓపెన్ అయిపోయారా :

ఇదిలా ఉంటే మంత్రి వాసంశెట్టి ఓపెన్ అయిపోయారా అన్నంతగా చర్చ నడిచేలా ఆయన స్టేట్మెంట్ ఉంది అని అంటున్నారు. నా కులం చూసే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, మంత్రి పదవి కూడా అందుకే ఇచ్చారు అని తమ సామాజిక వర్గం వారి సమావేశంలో తాజాగా వాసంశెట్టి అన్న మాటలు ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. శెట్టిబలిజ కులస్థుడిని కావడం వల్లనే పదవులు దక్కాయని ఆయన చెప్పడం విశేషం.

హాట్ డిస్కషన్ :

అయితే మినిస్టర్ వాసంశెట్టి చేసిన ఈ కామెంట్స్ హాట్ డిస్కషన్ కి దారి తీస్తున్నాయి. ఆయన ఏ సందర్భంలో ఈ మాటలు అన్నా ఒక రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్న వారిగా అలా అనడం అదీ ఓపెన్ గా చెప్పడం సబబు కాదేమో అన్న చర్చ కూడా సాగుతోంది. రాజకీయాల్లో మనుగడ సాధించాలి అంటే అందరి వారుగా ఉండాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు. అఫ్ కోర్స్ సొంత కులం మీద ప్రేమాభిమానాలు ఉండొచ్చు కానీ వారి విషయంలో ఓపెన్ గా చెప్పడం వల్ల రాజకీయంగా ఇంకా ఎదుగుతున్న దశలో ఉన్న మంత్రిగా ఆయనకే ఎక్కువ ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్న వారూ ఉన్నారు.

గతంలోనే చర్చ :

ఇదిలా ఉంటే వాసంశెట్టి సుభాష్ పనితీరు మీద గతంలోనే ప్రభుత్వ పెద్దలు కొంత మేర అసంతృప్తిగా ఉన్నారని వార్తలు అయితే వచ్చాయి, అవి ఎంత మేరకు నిజం అన్నది తెలియక పోయినా మంత్రి వర్గంలో మార్పులు ఉంటే కనుక ఆయననే పక్కన పెడతారు అని మెయిన్ స్ట్రీం మీడియా సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున గతంలో ప్రచారం సాగింది. ఇదిలా ఉంటే ఈ మధ్యనే మోంథా తుఫాన్ సమయంలో మంత్రి మంచి పనితీరు కనబరచారు అని ఏకంగా ప్రభుత్వ పెద్దల నుంచే ప్రశంసలు అందుకున్నారు. దాంతో ఆయన దారిలో పడ్డారని మరింత బాగా పనిచేసే వీలుందని అనుకుంటూ వచ్చారు.

ఏమిటి అన్న సందేహాలు :

అవన్నీ అలా ఉంటే ఈ రకమైన స్టేట్మెంట్స్ వల్ల ఆయనకు రాజకీయంగా కొంత ఇబ్బంది అవుతుందని అంటున్న వారూ ఉన్నారు. సొంత కులం విషయంలో ఆ మాత్రం మమకారం చూపించడం తప్పు ఎలా అవుతుంది అన్న మాట చెబుతున్న వారూ ఉన్నారు అయితే ఎమ్మెల్యే కానీ మంత్రి పదవి కానీ ఎంపిక చేసి ఇవ్వడం పార్టీ ప్రభుత్వ పెద్దల నిర్ణయం. మంత్రి గారి తాజా వ్యాఖ్యలను బట్టి చూస్తే కనుక పెద్దల నిర్ణయం ఆ విధంగా ఉందని భావిస్తున్నారా అన్న కొత్త చర్చ కూడా సాగుతోంది. ఏది ఏమైనా ఒక్క మాట అయితే ఉంది. అన్నీ బాహాటంగా చెబితే బాగోదు. మరి మంత్రిగా ఏణ్ణర్ధం పాటుగా కొనసాగుతున్న వాసంశెట్టికి ఇవన్నీ తెలియదు అనుకోవాలా ఏమిటి అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.