Begin typing your search above and press return to search.

ముద్రగడ కుమారుడికి జనసేన భారీ షాక్ !

ముద్రగడ పద్మనాభం కుమారుడు ముద్రగడ గిరి వైసీపీ ఇంచార్జి గా ఉన్న ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది

By:  Satya P   |   21 Sept 2026 9:56 PM IST
ముద్రగడ కుమారుడికి జనసేన భారీ షాక్ !
X

ముద్రగడ పద్మనాభం కుమారుడు ముద్రగడ గిరి వైసీపీ ఇంచార్జి గా ఉన్న ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. అక్కడ మాజీ ఎమ్మెల్యే వైసీపీ తరఫున 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన పరుపుల సుబ్బారావు వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో అనుచరులు కూడా జనసేన తీర్థం పవన్ కళ్యాణ్ సమక్షంలో పుచ్చుకున్నారు. ఇదిలా ఉంటే పరుపుల సుబ్బారావు 2024 ఎన్నికల్లో పోటీ చేసి టీడీపీ చేతిలో ఓటమి పాలు అయ్యారు. ఇక 2019లో పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్ వైసీపీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఇక ప్రత్తిపాడు వైసీపీలో వర్గ పోరు ఎప్పుడూ ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా తనకు సీటు దక్కలేదని పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్ 2024 ఎన్నికల్లో మనసు పెట్టి పనిచేయలేదని అంటారు. ఇక కూటమి ప్రభంజనంలో పరుపుల సుబ్బారావు ఓటమి చెందిన రెండున్నరేళ్ల తరువాత జనసేన బాట పట్టడం విశేషం.

ముద్రగడ కుటుంబం సీటు :

ప్రత్తిపాడుకు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత ఉంది. కాకినాడ జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఈ అసెంబ్లీ సీటు ముద్రగడ కుటుంబానికి పెట్టని కోటగా ఉంటూ వచ్చింది. 1962, 1967లలో రెండు సార్లు ముద్రగడ వీర రాఘవ రావు ఇక్కడ నుంచే ఇండిపెండెంట్ గా పోటీ చేసి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా వెళ్లారు. ఇక 1972లో ఆయన ఓటమి చెందితే ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ముద్రగడ పద్మనాభం 1978లో జనతా పార్టీ తరఫున ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి తొలిసారి గెలిచారు. ఆ తరువాత 1983, 1985లలో టీడీపీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ సమయంలోనే ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఎన్టీఆర్ ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వహించారు. 1989 నాటికి ఆయన కాంగ్రెస్ లో చేరి ప్రత్తిపాడు ఉంచి నాలుగవ సారి గెలిచారు 1994లో మాత్రం టీడీపీ ప్రభంజనంలో ఆయన ఓటమి చెందారు. దాంతో ప్రత్తిపాడుకు ముద్రగడ గుడ్ బై కొట్టారు.

అక్కడ నుంచే పోటీ చేయాలని :

అయితే ముద్రగడ తన కుమారుడు ముద్రగడ రాజకీయ ఎంట్రీ కూడా తమ సొంత సీటు ప్రత్తిపాడు నుంచే ఉండాలని గట్టిగా భావించారు. అందుకే ఆయనకు వైసీపీ అధినాయకత్వం ప్రత్తిపాడు ఇంచార్జిగా చాన్స్ ఇచ్చింది. ఈలోగా ముద్రగడ మరణించారు. ఇక ప్రత్తిపాడులో వర్గ పోరు సాగుతూనే ఉంది. మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరూ సైలెంట్ గానే ఉంటూ వస్తున్నారు అని ప్రచారం ఉంది. ఇందులో పరుపుల సుబ్బారావు మొత్తం తన అనుచరులకు తీసుకుని జనసేనలో చేరిపోవడంతో ప్రత్తిపాడులో వైసీపీకి గట్టి దెబ్బ పడింది అని అంటున్నారు. అక్కడ ముద్రగడ గిరి తన రాజకీయ ప్రభావాన్ని ఏ మేరకు చూపుతారో తెలియదు కానీ పార్టీ పరంగా వైసీపీకి ఇది నష్టపరిచే చర్యగానే చూస్తున్నారు. మరో వర్గంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్ ఆలోచనలు ఏమిటి అన్నది చూడాల్సి ఉంది అంటున్నారు.

మొదటి నుంచి మళ్లీ :

ఇక ప్రత్తిపాడులో జనసేన గట్టిగా బలపడుతోంది. ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిచిన పరుపుల సుబ్బారావు ఆ పార్టీలో చేరడం అతి పెద్ద అండగా చెబుతున్నారు. టీడీపీ చూస్తే వెరీ స్ట్రాంగ్ గానే ఇక్కడ ఉంది. ప్రత్తిపాడులో అత్యధిక సార్లు టీడీపీనే గెలుస్తూ వస్తోంది. దీంతో ఇపుడు ముద్రగడ గిరి తన కుటుంబ రాజకీయ వారసత్వంగా ఉన్న సొంత సీటుని నిలబెట్టుకోవాలంటే మొదటి నుంచే ప్రారంభించాలని అంటున్నారు. అంతే కాదు 2029 ఎన్నికల్లో ఆయన జనసేన టీడీపీ కూటమిని ఢీ కొట్టి గెలవాలంటే ఈ రోజు నుంచే సర్వ శక్తులూ ఒడ్డాల్సి ఉంటుందని చెబుతున్నారు. చూడాలి మరి ముద్రగడ కుటుంబాన్ని ఆరు సార్లు గెలిపించిన ప్రత్తిపాడు మూడవ తరం వారసుడు గిరికి రాజకీయ దారులు తెరుస్తుందా లేదా అన్నది.