Begin typing your search above and press return to search.

రాహుల్ కి పోటీగా వరుణ్... బీజేపీ నయా వ్యూహం ?

ఇక వరుణ్ గాంధీ 2009లో ఉత్తర ప్రదేశ్ లోని పిలిభిత్ లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి ఎంపీగా గెలిచారు. అది ఆమె తల్లి మేనకాగాంధీ సొంత సీటు.

By:  Satya P   |   30 Sept 2026 9:22 AM IST
రాహుల్ కి పోటీగా వరుణ్... బీజేపీ నయా వ్యూహం ?
X

గాంధీల కుటుంబంలో ఆయన కూడా ఒక వారసుడే. శ్రీమతి ఇందిరాగాంధీ మనవడుగా రాహుల్ గాంధీతో పాటు వరుణ్ గాంధీకి కూడా పేరు ఉంది. అయితే రాహుల్ గాంధీ కాంగ్రెస్ లో అగ్ర నేతగా ఉంటున్నారు. లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ కాబోయే ప్రధాని ట్యాగ్ తో ఉన్నారు. ఇక వరుణ్ గాంధీ విషయానికి వస్తే ఆయన ఇందిరాగాంధీ రెండవ కుమారుడు సంజయ్ గాంధీ ఏకైక కుమారుడు. మేనకాగాంధీకి రాజకీయ వారసుడిగా ముద్ర పడ్డారు. మేనకాగాంధీ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సంజయ్ విచార్ మంచ్ ని స్థాపించారు. ఆ తరువాత ఆమె జనతా దళ్ లో కొన్నాళ్ళు పనిచేసి బీజేపీలో చేరారు. ఆమె బీజేపీలో ఎంపీగా కేంద్ర మంత్రిగా చేశారు. ఆమె తనయుడిగా వరుణ్ గాంధీ మూడు సార్లు ఎంపీగా గెలిచారు.

దూరం పెట్టారు :

ఇక వరుణ్ గాంధీ 2009లో ఉత్తర ప్రదేశ్ లోని పిలిభిత్ లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి ఎంపీగా గెలిచారు. అది ఆమె తల్లి మేనకాగాంధీ సొంత సీటు. అయితే 2014లో రెండవసారి సుల్తాన్‌పూర్ నియోజకవర్గానికి మారి అక్కడ నుండి పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధించారు.ఇక 2019లో మూడవసారి తిరిగి మళ్లీ పిలిభిత్ స్థానం నుండి పోటీ చేసి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇలా గెలిచిన వరుణ్ గాంధీ తనకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కనందుకు అసంతృప్తి చెందారు. దాంతో బీజేపీ అధినాయకత్వం మీద పరోక్షంగా విమర్శలు చేశారు. దాంతో 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఆయనకు పిలిభిత్ నుండి పోటీ చేసేందుకు టికెట్ నిరాకరించింది. ఇలా రెండేళుగా సైలెంట్ గా ఉన్న ఆయనకు ఉత్తరప్రదేశ్ నుండి రాజ్యసభ స్థానాన్ని కేటాయించే అంశంపై పార్టీ యోచిస్తోంది అని ప్రచారం సాగుతోంది.

ఎనిమిదవ సీటులోకి :

ఇదిలా ఉంటే యూపీలో ఖాళీ అయిన పది రాజ్యసభ సీట్లలో ఏడు బీజేపీ రెండు సమాజ్ వాదీ పార్టీ గెలుచుకునేందుకు స్పష్టమైన మెజారిటీ ఉంది. ఒక సీటు మాత్రం ఎవరికీ సంఖ్య బలం లేదు, అయితే సమాజ్ వాదీ పార్టీ కంటే బీజేపీకే ఎక్కువ ఓట్లు ఉన్నాయి. దాంతో క్రాస్ ఓటింగ్ తో అయినా గెలవవచ్చు అని బీజేపీ చూస్తోంది అని అంటున్నారు.

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీ నాయకత్వంలోని కూటమికి దాదాపు 294 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ప్రతి రాజ్యసభ అభ్యర్థి గెలవడానికి సుమారు 37 మంది మొదటి ప్రాధాన్యత ఓట్లు అవసరం. ఈ లెక్కన బీజేపీ కూటమి 7 స్థానాలను గెలుచుకోగలదు. అయితే 8వ స్థానం సాధించడానికి వారికి మరో 2 ఓట్ల కొరత ఉంది. ఇక సమాజ్ వాదీ పార్టీ కాంగ్రెస్ కూటమికి దాదాపు 103 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఈ సంఖ్యాబలంతో సమాజ్ వాదీ పార్టీ రెండు స్థానాలను సులభంగా గెలుచుకుంటుంది. కానీ మూడో స్థానాన్ని దక్కించుకోవడానికి వీరికి అదనంగా 17 ఓట్ల అవసరం ఉంటుంది.

ఉత్కంఠ సీటులో వరుణ్ :

దీంతో బీజేపీ ఈ ఎనిమిదవ సీటుని గెలుచుకోవడానికి రంగం సిద్ధం చేస్తోంది. ఈ సీటు విషయంలో ఎవరికీ ఒంటరిగా స్పష్టమైన సంఖ్యాబలం లేదు. అయినప్పటికీ సమాజ్ వాదీ పార్టీతో పోలిస్తే బీజేపీ కూటమికే ఎక్కువ మిగులు ఓట్లు ఉన్నాయి. దాంతో ఎనిమిదవ అభ్యర్థిని గెలిపించుకోవడానికి బీజేపీ క్రాస్ ఓటింగ్ లేదా స్వతంత్రులు ఇతర చిన్న పార్టీల మద్దతు కోసం పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తోంది. గతంలో కూడా ఇలాంటి సమీకరణాల్లో క్రాస్ ఓటింగ్ ద్వారా బీజేపీ అదనపు స్థానాన్ని కైవసం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇక ఈ సీటునే వరుణ్ గాంధీకి ఇవ్వాలని చూస్తోంది అని అంటున్నారు. ఆయనకి ఇస్తే క్రాస్ ఓటింగ్ జరిగి గట్టెక్కుతామని చూస్తోంది. అంతే కాదు రాహుల్ గాంధీకి పోటీగా వరుణ్ గాంధీని యూపీలో దించాలని కూడా బీజేపీ చూస్తోంది అని అంటున్నారు. మొత్తానికి బీజేపీ ఎత్తులతో వరుణ్ రాజ్యసభ మెంబర్ అవుతారా అన్నది తేలాల్సి ఉంది.