లివింగ్ లెజెండ్ వాణిశ్రీకి పద్మ అవార్డు ఎందుకు రాలేదు ?
ఆ రోజులలో నవలా నాయిక అంటే వాణిశ్రీ పేరునే చెప్పేవారు. ఆమె ఎన్నో నవలా చిత్రాలలో నటించి రచయితల ఊహలకు ప్రాణం పోశారు అని చెప్పాలి.
By: Satya P | 3 Aug 2026 2:04 PM ISTకళాభినేత్రి అంటే ఆమె పేరే చెబుతారు. అది బిరుదు కాదు అక్షర సత్యం అంటారు. ఆమె వెండి తెర మీద నటించడం కాదు జీవిస్తారు అన్నది ప్రేక్షకుల కచ్చితమైన అభిప్రాయం. ఆమె ఎవరో కాదు వాణిశ్రీ. హీరోయిన్లకు ఎంతో గౌరవం ఒక ఇమేజ్ ని తీసుకుని వచ్చిన కధా నాయికగా వాణిశ్రీని చెప్పుకుంటారు. నెల్లూరు జిల్లాకు చెందిన రత్న కుమారి వాణిశ్రీ గా మారింది. ఆమె చిన్న పాత్రలు వేస్తూ హీరోయిన్ గా మారి సూపర్ స్టార్ డం సాధించడం వెనక ఎంతో కృషి ఉంది. ఆమె తపన ఉంది, అంకిత భావం ఉంది. అందుకే తెర మీద వాణిశ్రీ వేసిన పాత్రలు అన్నీ అలా చిర స్థాయిగా నిలిచిపోయాయి.
హీరోలకు సాటిగా :
అగ్ర నటులు అందరి సరసన నటించిన వాణిశ్రీ హీరోలకు సరిసాటిగా రాణించారు. హీరోయిన్ అంటే ఆడుతూ పాడుతూ కనిపించడం కాదు కధా బలం ఉండాలి, తన పాత్రకు ఎంతో విలువ గుర్తింపు ఉండాలని ఆమె కోరుకునే వారు. అలాంటి కధలనే ఎంపిక చేసుకునే వారు. వాణిశ్రీ ఎన్టీఆర్ అక్కినేని వంటి అగ్ర హీరోల పక్కన జంటగా నటించినా తన పాత్ర ఎక్కడా తగ్గకుండా జాగ్రత్త పడేవారు. ఇక తన పేరు మీదనే టైటిల్ వచ్చేలా చేసిన సినిమాలో ఎన్నో ఉన్నాయి. చిట్టి చెల్లెలు కధ మొత్తం వాణిశ్రీ చుట్టూనే నడుస్తుంది. అందులో ఎన్టీఆర్ హీరో. ఇక ఇద్దరమ్మాయిలులో డబుల్ రోల్ వాణిశ్రీ వేసి సినిమా మొత్తం తనే కనిపించింది. ఆ మూవీ హీరో అక్కినేని. గంగ మంగ మూవీలో ద్విపాత్రాభినయం చేసి మొత్తం హీరో తానే అనిపించుకుంది. ఆ సినిమాలో కృష్ణ శోభన్ బాబు వంటి హీరోలు ఉన్నా వాణిశ్రీదే టైటిల్ రోల్. క్రిష్ణంరాజు తొలిసారి నిర్మించిన సొంత చిత్రం కృష్ణవేణిలో కూడా వాణిశ్రీదే మొత్తం అన్నట్లుగా సాగుతుంది. ఆమె అంతలా తన ప్రాధాన్యతను ప్రతీ చిత్రంలో చాటుకున్నారు.
చంద్రమోహన్ హీరోయిన్ గా :
ఇక వాణిశ్రీ చిన్న చిత్రాలలో నటిస్తూ రంగుల రాట్నం చిత్రం ద్వారా హీరోయిన్ గా మారారు. ఆ సినిమా నుంచే వెండి తెరకు పరిచయం అయిన చంద్రమోహన్ పక్కన జంటగా ఆమె చలాకీగా నటించి మంచి మార్కులు కొట్టేసారు. ఆ తరువాత చంద్రమోహన్ చెల్లెలుగా సుఖ దుఖాలు మూవీలో అద్భుతంగా నటించి జన నీరాజనం అందుకున్నారు. అక్కినేనితో తొలిసారి ఆత్మీయులు మూవీలో నటించి సక్సెస్ ఫుల్ పెయిర్ అన్న పేరు సాధించారు. ఎన్టీఆర్ తో నిండు హృదయాలు మూవీతో మొదటిసారి జంటగా నటించారు. ఆ తరువాత ఎన్టీఆర్ అక్కినేనిలతో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు. ఇక క్రిష్ణ శోభన్ బాబు కృష్ణంరాజు వంటి హీరోలతో కూడా జంటగా వాణిశ్రీ చేసి తన నటనా పటిమను చాటారు.
నవలా నాయిక అంటేనే :
ఆ రోజులలో నవలా నాయిక అంటే వాణిశ్రీ పేరునే చెప్పేవారు. ఆమె ఎన్నో నవలా చిత్రాలలో నటించి రచయితల ఊహలకు ప్రాణం పోశారు అని చెప్పాలి. అప్పట్లో యద్దనపూడి సులోచనారాణి, ఆరికెపూడి కౌసల్యాదేవి మాదిరెడ్డి సులోచన వంటి రచయిత్రులు రచించిన ప్రతీ నవలా వెండి తెర మీద సినిమాగా వచ్చేది. ఆ సినిమాలు అన్నింటిలో వాణిశ్రీనే హీరోయిన్. అలా ఒక ప్రేమ నగర్, సెక్రటరీ, చక్రవాకం, జీవన తరంగాలు, ఆత్మీయులు ఇలా ఎన్నో చిత్రాలలో ఆమె మురిపించి మెరిపించారు.
మేకప్ లేకుండానూ :
దిగ్దర్శకుడు బాపు తీసిన గోరంత దీపం మూవీలో వాణిశ్రీ మేకప్ లేకుండా నటించి అద్భుతం అనిపించారు. తన నటనతోనే ఆకట్టుకున్నారు. ఆమె చామన చాయగా ఉంటారు. అదే అందంగా నాటి తరం మెచ్చుకున్నారు అంటే ఆమె కళాభినయం ఏ స్థాయిలో ఉందో చెప్పుకోవాల్సిందే. కేఎస్ ప్రకాశరావు, కె విశ్వనాథ్, బాపు వంటి దర్శకులకు అలాగే డి రామానాయుడు వీబీ రాజేంద్ర ప్రసాద్ లాంటి నిర్మాతలకు ఆమె ఫస్ట్ చాయిస్ గా ఉండేవారు.
పద్మ పురస్కారం మాత్రం :
వాణిశ్రీ ఎన్నో సక్సెస్ ఫుల్ మూవీస్ లో హీరోయిన్ గా నటించి నాటి తరానికి నేటి తరానికి వారధిగా నిలిచారు. ఆమె నటనా ప్రతిభకు మాత్రం సరైన పురస్కారాలు అయితే దక్కలేదని ఆవేదన అభిమానులలో ఉంది. ఆమె దశాబ్దాల సినీ కెరీర్ లో చేసిన సేవలకు గానూ పద్మ పురస్కారం లభించకపోవడం ఆశ్చర్యమే అని అంటున్నారు. ఆ మాటకు వస్తే లేటుగా పద్మ అవార్డు వచ్చింది అని మహానటి సావిత్రి తిరస్కరించారు అని అంటారు. ఆ తరువాత మరో నటనా శిరోమణి జమునకు కూడా పద్మ అవార్డు దక్కలేదు, అంతే కాదు క్రిష్ణ కుమారి వంటి వారి ప్రస్తావన కూడా లేకుండానే అవార్డులు ఎవరికో ఇచ్చారు అన్న విమర్శలు ఉన్నాయి. ఇపుడు చూస్తే లివింగ్ లెజెండ్ అయిన వాణిశ్రీకి అయినా పద్మ అవార్డు ఇస్తే హీరోలనే కాదు హీరోయిన్లకు కూడా గౌరవించుకున్నామన్న సంతృప్తి పౌర సమాజానికి ఉంటుందని అంటున్నారు. ఆమెకు పద్మ అవార్డు వచ్చేలా తెలుగు ప్రభుత్వాలే పూనుకోవాలని అభిమానులు సూచిస్తున్నారు. 1948 ఆగస్ట్ 3న జన్మించిన వాణిశ్రీకి పుట్టిన రోజు శుభాకాంక్షలను అభిమాన జనం తెలియచేస్తున్నారు.
