పవన్ తో భేటీ కానున్న వంగవీటి తనయ...రాజకీయ చర్చ ?
వంగవీటి మోహన రంగా జయంతిని ప్రతీ ఏటా జూలై 4న రాష్ట్రమంతా రంగా అభిమానులు జరుపుకుంటారు. రంగా దివంగతులు అయి ఇప్పటికి ముప్పై ఎనిమిది ఏళ్ళు అయింది.
By: Satya P | 5 July 2026 9:27 AM ISTవంగవీటి మోహన రంగా జయంతిని ప్రతీ ఏటా జూలై 4న రాష్ట్రమంతా రంగా అభిమానులు జరుపుకుంటారు. రంగా దివంగతులు అయి ఇప్పటికి ముప్పై ఎనిమిది ఏళ్ళు అయింది. 1988 డిసెంబర్ 26న విజయవాడ నడిబొడ్డున ఆయన దారుణ హత్య కావించబడ్డారు. ఇక ఆయన అంతకు ముందు 1985 మార్చిలో జరిగిన ఉమ్మడి ఏపీ మధ్యంతర ఎన్నికల్లో విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా గెలిచారు. ఆయన ఎమ్మెల్యేగా పనిచేసింది తొలిసారి విపక్షంలోనే. పైగా గట్టిగా మూడేళ్ళ తొమ్మిది నెలలు మాత్రమే. అయితే ఆయన జనంతో ఉంటూ ప్రజా పోరాటాలు ఎక్కువగా చేశారు. దాంతో ఆయన పేరు ఆ రోజులలో బాగా మారుమోగింది. అంతే కాకుండా కోస్తా జిల్లాలలో పెద్ద ఎత్తున పర్యటనలు చేశారు. కాపునాడు ఆయన ఆధ్వర్యంలో తొలిసారిగా జరిపించారు. ఇలా ఆనాడు ఉమ్మడి ఏపీలో కోస్తా రాజకీయాల్లో ఎక్కువగా వినిపించిన పేరుగా రంగాది ఉంది.
అభిమానుల నుంచి డిమాండ్లు :
ఇదిలా ఉంటే ప్రతీ ఏటా వంగవీటి రంగా జయంతి వర్ధంతుల వేళ అభిమానుల నుంచి డిమాండ్లు అయితే వినిపిస్తూ వస్తున్నాయి. అవేంటి అంటే ఆయన పేరును జిల్లాకు పెట్టాలని, అలాగే ఆయన పేరు మీద ఒక స్మారక ఘాట్ ని నిర్మించాలని. ఈ రెండూ రాష్ట్ర ప్రభుత్వం స్థాయిలోనే నిర్ణయం తీసుకుని చేయాల్సిన అంశాలు. వంగవీటి పుట్టింది విజయవాడలో. ఆయన రాజకీయ జీవితం అంతకు ముందు ప్రజా జీవితం పోరాటాలు అన్నీ అక్కడే కేంద్ర బిందువుగా చేసుకుని సాగాయి. అయితే విజయవాడ జిల్లాను 2022లో నాటి వైసీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ జిల్లాగా పేరుతో ఏర్పాటు చేసింది. ఉమ్మడి కృష్ణా జిల్లాను రెండుగా చేసి మచిలీపట్నం రెండవ జిల్లాగా ప్రకటించింది. ఆనాడే వంగవీటి జిల్లాగా విజయవాడను ప్రకటించాలని ఆయన అభిమానులు కోరారు కానీ అది కార్యరూపం దాల్చలేదు.
పవన్ ముందు రెండు డిమాండ్లు :
ఇదిలా ఉండగా రంగా జయంతి వేళ ఆయన కుమార్తె ఆశా కిరణ్ తన తండ్రికి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ తన తండ్రి ఆశయాల సాధన కోసం పనిచేస్తామని చెప్పారు. ఇదే సందర్భంగా వంగవీటి రంగా పేరుని జిల్లాకు పెట్టాలని ఆమె కూటమి ప్రభుత్వాన్ని కోరారు. అదే విధంగా తన తండ్రి అంత్యక్రియలు విజయవాడలో క్రిష్ణా తీరంలో జరిగాయని అక్కడ రంగా స్మారకంగా రంగా ఘాట్ ని ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఈ రెండు డిమాండ్లతో తాను తొందరలోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలుస్తాను అని ఆశా కిరణ్ చెప్పారు. పవన్ ఈ డిమాండ్లను పరిష్కరిస్తారు అని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక చూస్తే గత ఏడాది డిసెంబర్ 26న రంగానాడుని విశాఖలో నిర్వహించిన ఆశాకిరణ్ రాజకీయంగా ఏ పార్టీ వైపు అడుగులు వేస్తారు అన్నది చర్చగా ఉంది. ఆమె సోదరుడు వంగవీటి రాధాకృష్ణ టీడీపీలో ఉన్నారు. ఆశాకిరణ్ రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకుంటారు ఆమె ఆలోచనలు ఏమిటి తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే తన తండ్రి ఆశయాల సాధన కోసం కృషి చేస్తున్నట్లుగానే ఆమె చెబుతున్నారు. పవన్ తో ఆశాకిరణ్ భేటీ అవుతారు అన్న వార్తలతో ఆమె చూపు జనసేన వైపు ఉందా అన్న కొత్త చర్చ కూడా తెర మీదకు వస్తోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
