వంగవీటికి లైన్ క్లియర్...అన్నీ ఓకేనా ?
తెలుగుదేశం పార్టీ ఎపుడూ అభ్యర్ధుల ఎంపిక వివిధ సమీకరణలను అనుసరిస్తుంది. ప్రాంతీయ కోణంతో పాటు సామాజిక కోణానికి ఆ పార్టీ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది.
By: Satya P | 28 July 2026 9:12 AM ISTవంగవీటి రంగా వారసుడు రాధాకృష్ణకి గవర్నర్ కోటాలో పెద్దల సభకు వెళ్ళే యోగం దగ్గరలో ఉంది అని అంటున్నారు. మంగళవారంతో ఏపీలో రెండు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అవుతున్నాయి. అవి రెండూ కూటమి నామినేట్ చేసిన వారికే దక్కుతాయి. ఇక ఈ రెండు సీట్ల విషయంలో మిత్రులకు సర్దుబాటు లేదని టీడీపీ నుంచే ఎంపిక చేస్తారు అని అంటున్నారు. దాంతో టీడీపీలో చూస్తే భారీ పోటీ ఏర్పడింది. 2024 ఎన్నికల్లో సీట్లను త్యాగం చేసిన వారి నుంచి కొత్త వారు సీనియర్లు ఇలా అనేక మంది అధినాయకత్వం ఆశీస్సుల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈ రెండు సీట్లలో ఒకటి వంగవీటి రాధాకు ఖాయమని ప్రచారం అయితే ఊపందుకుంది.
లాబీయింగ్ వేరే లెవెల్ :
ఇక టీడీపీ అధినాయకత్వం ఈ రెండు ఎమ్మెల్సీల ఎంపికకు దిగుతోందని వార్తలు రావడంతో ఆశావహులు అంతా కోటి ఆశలతో తమదైన శైలిలో లాబీయింగ్ కి సిద్ధపడిపోతున్నారు. వారంతా ఎవరి మార్గాలలో వారు అధినాయకత్వాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నరు. పార్టీ హైకమాండ్ ఈ రెండు సీట్ల విషయంలో అర్హుల జాబితాతో కసరత్తు చేస్తోంది అని ప్రచారం సాగుతోంది. దాంతో ఎవరికి ఈ సీట్లు దక్కుతాయి అన్నది ఉత్కంఠంగా మారుతోంది. ఇక ఈ రెండు ఎమ్మెల్సీ సీట్లను వైసీపీ కోల్పోతోంది. ఆ పార్టీకి శాసనమండలిలో డిప్యూటీ చైర్మన్ గా ఉన్న జకియా ఖాన్ అలాగే గోదావరి జిల్లాలకు చెందిన సీనియర్ నేత పండుల రవీంద్ర బాబుల పదవీకాలం ముగియడంతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి.
సీనియర్లకేనా చాన్స్ :
ఈసారి చూస్తే సీనియర్ల వైపు అధినాయకత్వం మొగ్గు చూపవచ్చు అని అంటున్నారు. దాంతో మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, అలాగే రాజ్యసభకు ఎన్నో సార్లు ప్రయత్నించి విఫలం అయిన వర్ల రామయ్య వంటి వారి పేర్లు కూడా ఉన్నాయని అంటున్నారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ వంటి కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు అని అంటున్నారు. ఇక పిఠాపురం వర్మ సైతం ఎమ్మెల్సీ కావాలని ఆశ పడుతున్నారు. ఈసారి తన గురి తప్పదని ఆయన ధీమాగా ఉన్నారని అంటున్నారు.
ప్రాంతీయ సామాజిక కోణం :
తెలుగుదేశం పార్టీ ఎపుడూ అభ్యర్ధుల ఎంపిక వివిధ సమీకరణలను అనుసరిస్తుంది. ప్రాంతీయ కోణంతో పాటు సామాజిక కోణానికి ఆ పార్టీ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది. ఈసారి కూడా అదే ఫార్ములా అనుసరిస్తుంది అని అంటున్నారు. అదే జరిగితే కనుక ఒకటి కోస్తాకు మరొకటి రాయలసీమకు దక్కుతుందని అంటున్నారు. ఎందుకంటే ఉత్తరాంధ్ర కు రాజ్యసభ ఇచ్చినందువల్ల ఈసారి రాయలసీమను పరిగణనలోకి తీసుకుంటారు అని అంటున్నారు. దాంతో అక్కడ ఎవరు ఉన్నారు అన్న చర్చ మొదలైంది. ఇక కోస్తాలో చూస్తే చాలా మంది రేసులోకి వస్తున్నారు.
వంగవీటికి న్యాయం :
వంగవీటి రాధాకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి ఎమ్మెల్సీ సీటు ఖాయమని అంటున్నారు. ఆయన 2024లో విజయవాడ సెంట్రల్ సీటు కోరినా పార్టీ సీనియర్ నేత బోండా ఉమా మహేశ్వరరావు కారణంగా ఆ సీటు దక్కలేదు. ఇపుడు చూస్తే ఏపీలో సామాజిక సమీకరణలు కూడా మారుతున్నాయి. బోండా బిగ్ సౌండ్ చేస్తున్నారు. దాంతో వంగవీటికి ప్రాధాన్యత దక్కడం ఖాయమని చెబుతున్నారు. రెండవ సీటు విషయం మాత్రం సస్పెన్స్ అని అంటున్నారు. వర్మ కోరుతున్నా కూడా మళ్ళీ సామాజిక ప్రాంతీయ సమీకరణలు ఆయనకు ఆటంకం కలిగిస్తాయా అన్నదే చర్చగా ఉంది.
