కాంగ్రెస్‌లోకి రాధా.. కీలక పోస్టు కోసం ఢిల్లీలో మంతనాలు..?
కాపు నాయకుడు.. వంగవీటి మోహన్‌రంగా వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన వంగవీటి రాధా.. ప్రస్తుతం ఏపార్టీలో ఉన్నారు? అంటే.. చెప్పడం కష్టమే.
By: Garuda Media | 30 Dec 2025 8:30 AM ISTకాపు నాయకుడు.. వంగవీటి మోహన్‌రంగా వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన వంగవీటి రాధా.. ప్రస్తుతం ఏపార్టీలో ఉన్నారు? అంటే.. చెప్పడం కష్టమే. పేరుకు మాత్రం ఆయన టీడీపీలో ఉన్నారు. కానీ.. గత ఏడాదిన్నరగా ఆయన యాక్టివిటీ ఎక్కడా కనిపించడం లేదు. పార్టీ అధికారంలోకి రాకముందు.. వరకు ఫర్వాలేదని అనుకున్నా.. ప్రస్తుతం ఆయన ఎక్కడా టీడీపీలోకానీ.. పార్టీ కార్యాలయంలో కానీ.. కనిపించ డం లేదు. పైగా.. ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ ఆయన కనిపించడం లేదు.
ఈ నేపథ్యంలో రాధా టీడీపీలో ఉన్నారా? లేరా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలావుంటే.. ప్రస్తుతం రాధా రాజకీయ వ్యూహాలు.. ఎత్తుగడలు మారుతున్నాయన్న చర్చ విజయవాడ పాలిటిక్స్‌లో జరుగుతోంది. తిరిగి ఆయన పాత గూటికి వెళ్లి పోతున్నారని రాధా -రంగా మిత్రమండలికి చెందిన కొందరు నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో రంగా కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు చేశారు. అనంతరం.. ఆయన కుటుంబం కూడా ఆపార్టీలోనే కొనసాగింది. 2004లో రాధా కూడా కాంగ్రెస్‌లోనే ఉన్నారు. ఎమ్మెల్యే అయ్యారు.
తర్వాత.. ప్రజారాజ్యం పార్టీ రావడంతో దానిలోకి అనంతరం.. వైసీపీ.. తర్వాత.. టీడీపీ ఇలా నిలకడలేని రాజకీయాలు చేస్తూ.. వచ్చారు. ప్రస్తుతం టీడీపీలో గుర్తింపు లేకుండా పోయిందన్న ఆవేదనలో రాధా ఉ న్నారన్నది ఆయన వర్గం చెబుతున్న మాట. ఈ నేపథ్యంలో ఆయన తిరిగి కాంగ్రెస్ చెంతకు చేరేందుకు ఉత్సాహంగా ఉన్నారని అంటున్నారు. దీనివెనుక.. విజయవాడకు చెందిన కీలక మాజీ ఎంపీ ఒకరు ఉన్నారని తెలుస్తోంది. ఆయన ప్రోద్బలంతోనే కాంగ్రెస్‌కు అనుకూలంగా రాధా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాధా రాజకీయాలు.. ఢిల్లీకి చేరాయని అంటున్నారు.
తనకు ఏపీ పగ్గాలు అప్పగిస్తే.. చేరేందుకు అభ్యంతరం లేదన్నట్టుగా రాధా కూడా.. చెబుతున్నారని.. ఈ దిశగా పార్టీ అధిష్టానం వద్దకు విజయవాడ, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పాత నాయకులు .. రాధాను తీసుకువెళ్లే ప్రయత్నంలో ఉన్నారని సమాచారం. రాధా కోరిక మేరకు.. ఏపీ పగ్గాలను ఆయనకు అప్పగిస్తారా? అనేది ప్రశ్న. ఇప్పటికే ఏపీ కాంగ్రెస్ భారీ ప్రయోగం చేసింది. వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిలకు ఏపీ పార్టీ పగ్గాలు ఇచ్చింది. అయినా.. పార్టీ కోలుకోలేదు.
ఇక, ఇప్పుడు కాపు నాయకుడిగా, రంగా వారసుడిగా రాధాకు పగ్గాలు ఇస్తుందా? అనేది ప్రశ్న. ఏదేమైనా.. రంగా వర్ధంతికి రాధా కనిపించకపోవడం.. ఆయన ఢిల్లీలో రాజకీయాలు చేస్తున్నారన్న వాదన బలంగా వినిపించడం వంటివి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
