Begin typing your search above and press return to search.

బెజవాడ మేయర్ రేసులో బిగ్ ట్విస్ట్.. వంగవీటి వారసుడు ఎంట్రీతో ఆశావహులకు షాక్!

ఇక విజయవాడ అనగానే గుర్తుకు వచ్చే వంగవీటి కుటుంబం నుంచి మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ కూడా మేయర్ ఆలోచనలో ఉన్నట్లు తాజాగా జరుగుతున్న ప్రచారం రాజకీయంగా ఆసక్తిరేపుతోంది.

By:  Tupaki Political Desk   |   25 Sept 2026 9:00 PM IST
బెజవాడ మేయర్ రేసులో బిగ్ ట్విస్ట్.. వంగవీటి వారసుడు ఎంట్రీతో ఆశావహులకు షాక్!
X

రాష్ట్రంలోని అత్యంత కీలకమైన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఆసక్తి రేపుతున్నాయి. వచ్చేనెలలో కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతాయని అనుకుంటుండగా, మేయర్ సీటు కోసం పలువురు ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యక్ష పద్ధతిలో మేయర్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావించడంతో రేసులోకి ప్రముఖులు ఎంట్రీ ఇస్తున్నారు. ఇక విజయవాడ అనగానే గుర్తుకు వచ్చే వంగవీటి కుటుంబం నుంచి మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ కూడా మేయర్ ఆలోచనలో ఉన్నట్లు తాజాగా జరుగుతున్న ప్రచారం రాజకీయంగా ఆసక్తిరేపుతోంది.

అధికార టీడీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ గురువారం డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ భేటీ జరగడం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుందని చెబుతున్నారు. పవన్, వంగవీటి రాధాకృష్ణ పాత మిత్రులు అయినప్పటికీ ప్రస్తుతం ఇద్దరు రెండు వేర్వేరు పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎంగా, జనసేన అధినేతగా ఉన్న పవన్ రానున్న స్థానిక ఎన్నికల్లో ముఖ్యమైక కార్పొరేషన్ మేయర్ స్థానాలకు అభ్యర్థుల ఎంపికలో కీలకంగా చెబుతున్నారు. దీంతో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ఎటువంటి హడావుడి లేకుండా పవన్ ను కలవడంతో అనేక ఊహాగానాలు బయలు దేరాయి.

ప్రధానంగా ఏ పదవీ లేకుండా, రాజకీయ నిరుద్యోగంలో ఉన్న వంగవీటి రాధాకృష్ణకు ఎమ్మెల్సీ చేస్తారని, కార్పొరేషన్ చైర్మన్ పదవి అప్పగిస్తారని చాలా సార్లు ప్రచారం జరిగింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేషన్ పోస్టుల భర్తీ, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక సమయంలో ప్రతిసారి వంగవీటి రాధాకృష్ణ పేరు హాట్ ఫేవరెట్ గా వినిపించింది. కానీ, ఇప్పటివరకు ఆయనకు ఏ పదవీ దక్కలేదు. ఇది కోస్తా ప్రాంతంలో బలమైన సామాజికవర్గమైన కాపుల్లో అసంతృప్తికి కారణమవుతోందన్న విశ్లేషణలు ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ వంటి మెగా సిటీకి ఆయనను మేయర్ చేస్తే ఎలా ఉంటుందనే ప్రతిపాదన తెరపైకి వచ్చినట్లు చెబుతున్నారు.

ఇక మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ఆలోచన ఏంటో బయటపెట్టలేదు కానీ, ఆయన అనూహ్యంగా జనసేనాని పవన్ తో భేటీ అవడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరిందని అంటున్నారు. రాధాకృష్ణ మేయర్ కావాలని అనుకుంటున్నారా? లేక రాధా మేయర్ అయితే బాగుంటుందని జనసేనాని పవన్ భావించారా? అన్న చర్చ ఎక్కువగా జరుగుతోంది. ఇద్దరిలో ఎవరు అనుకున్నా మేయర్ పదవికి రాధాకృష్ణ ఓకే చెబితే టీడీపీ కూడా స్వాగతించే పరిస్థితి ఉందని అంటున్నారు. 2019 ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన రాధాకృష్ణకు ఏ పదవిలో సర్దుబాటు చేయాలన్న అంశంపై టీడీపీ అధిష్టానం ముల్లగుల్లాలు పడుతోందని అంటున్నారు. మరో ఏడాది వరకు ఎమ్మెల్సీ, రాజ్యసభ అవకాశం లేకపోవడం వల్ల రాధా రెడీ అంటే ఆయనను మేయర్ అభ్యర్థిగా ప్రకటించే విషయంలో టీడీపీకి అభ్యంతరాలు ఉండకపోవచ్చునని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇక మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ మేయర్ అభ్యర్థి అన్న ప్రచారం జోరుగా సాగుతుండటంతో మిగిలిన ఆశావహుల్లో గుబులు రేగుతోందని అంటున్నారు. టీడీపీలో ఇప్పటికే చాలా మంది ఈ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ తండ్రి ప్రముఖ కాపు నేత వంగవీటి మోహనరంగా అనుచరులలో ఒకరైన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, టీడీపీ ముఖ్యనేత బొండా ఉమ తన కుమారుడు సిద్ధార్థ్ ను మేయర్ గా పోటీ చేయించాలనే ఆలోచనతో ఉన్నారని చెబుతున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఆయన అధిష్టానం దృష్టిలో పెట్టినట్లుగా చెబుతున్నారు. మరోవైపు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి కూడా మేయర్ పదవి ఆశిస్తున్నారు. ఇప్పుడు వంగవీటి రాధాకృష్ణ పేరు తెరపైకి రావడంతో బొండా సిద్ధార్థ్, పట్టాభి వంటివారు ఆందోళన చెందుతున్నారని చెబుతున్నారు. మొత్తానికి డిప్యూటీ సీఎం పవన్ తో రాధా భేటీ రాజకీయాన్ని అనూహ్యంగా అత్యంత రసవత్తరంగా మార్చేసిందని వ్యాఖ్యానిస్తున్నారు.