Begin typing your search above and press return to search.

వంగవీటి విత్ పవన్...ఆసక్తి రేపుతున్న భేటీ !

వంగవీటి రాధా. రంగా వారసుడు. రెండున్నర దశాబ్దాల పైగా రాజకీయ జీవితం. కేవలం అయిదేళ్ల పాటు మాత్రమే ఎమ్మెల్యేగా అధికార యోగం.

By:  Satya P   |   24 Sept 2026 11:59 PM IST
వంగవీటి విత్ పవన్...ఆసక్తి రేపుతున్న భేటీ !
X

వంగవీటి రాధా. రంగా వారసుడు. రెండున్నర దశాబ్దాల పైగా రాజకీయ జీవితం. కేవలం అయిదేళ్ల పాటు మాత్రమే ఎమ్మెల్యేగా అధికార యోగం. ఇక కాంగ్రెస్ ప్రజారాజ్యం, వైసీపీ పార్టీలు మారి ప్రస్తుతం ఏడేళ్ళుగా టీడీపీలో కొనసాగుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినా రాధాకు అధికార అదృష్టం మాత్రం దక్కడం లేదు అని ఆయన అభిమానులు అయితే అనుకుంటున్నారు. రాధాకు ఎమ్మెల్సీ దక్కి మంత్రి అవుతారు అనుకుంటే ఇదేమిటిలా అని ఆత్మీయులు అంతా ఆవేదన చెందుతున్న నేపథ్యం ఉంది. మరో వైపు రాధాకు వైసీపీలో వల్లభనేని వంశీ, కొడాలి నాని మిత్రులు ఉన్నారు, వీరిది పార్టీలకు రాజకీయాలకు అతీతమైన బంధం. అయినా సరే ఏదో ఎక్కడో ఒక ప్రచారం. రాధా పసుపు శిబిరం గూడు దాటేస్తారు అని ఊహాగానాలు, పుకార్లు. వీటన్నింటి మధ్యలో రాధా మాత్రం సైకిల్ దిగకుండా స్వారీ చేస్తూనే ఉన్నారు.

సడెన్ సర్ప్రైజ్ గానే :

ఈ నేపధ్యంలో సడెన్ గా రాధా మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి వచ్చి పవన్ కళ్యాణ్ తో భేటీ కావడం అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. అంతే కాదు ఆసక్తిని విపరీతంగా పెంచేసింది. ఇంతకీ జనసేన క్యాంప్ ఆఫీసుకు రాధా ఎందుకు వచ్చినట్లు అన్నదే అంతటా చర్చ. అయితే పాత స్నేహితులు కలసి మాట్లాడుతున్నారు అన్నదే అక్కడి మాట. పవన్ తో రాధాకు మంచి స్నేహం ఉంది. అనుబంధం ఉంది అని అంటున్నారు. ప్రజారాజ్యంలో రాధా ఎమ్మెల్యేగా 2009లో పోటీ చేశారు. ఆనాటి నుంచి పవన్ తో మంచి దోస్తీ ఉందని అంటున్నారు. ఇపుడు ఈ విధంగా కలసిన ఇద్దరు నేతలు ఆత్మీయంగా పలకరించుకున్నారు అని అంటున్నారు.

స్థానిక ఎన్నికల మీదేనా :

ఇదిలా ఉంటే ఏపీలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. దాంతో రాధా పవన్ వీటి మీదనే చర్చించుకున్నారు అని అంటున్నారు. అంతే కాదు వర్తమాన రాజకీయాలను కూడా ఇద్దరూ చర్చించుకున్నారని అంటున్నారు. ఇక పవన్ ఉప ముఖ్యమంత్రిగా అయిదు కీలక శాఖలలో నిర్వహిస్తున్న బాధ్యతలు అందులో చేపడుతున్న సంస్కరణలను రాధా ప్రత్యేకంగా అభినందించినట్లుగా చెబుతున్నారు. అంతే కాదు జనసేన టీడీపీ మిత్ర పక్షాలు, 2024 ఎన్నికల వేళ పూర్తిగా కూటమి తరఫున ప్రచార కర్తగా రాధా నిర్వహించిన పాత్ర కూడా ఉంది. ఇలా పవన్ రాధాల మధ్య ఎన్నో రకాల అనుబంధాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు.

ఎన్నో విశ్లేషణలు :

అయితే ఈ భేటీ మీద ఎన్నో రకాలుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రంగా కాపులకు ఆరాధ్య దైవం. ఐకాన్. అలాగే పవన్ వెంట ఇప్పుడు బలమైన సామాజిక వర్గం ఉంది. ఈ ఇద్దరూ కలిసి ముచ్చటించుకోవడం అంటే ఏపీలో సామాజిక రాజకీయ సమీకరణల విషయంలో ఏమైనా మార్పులు వస్తున్నాయా అని చర్చించే వారూ ఉన్నారు. అలాగే జనసేన స్థానిక ఎన్నికల్లో ఎక్కువ సీట్లు కోరుతోంది. రాధా టీడీపీలో ఉన్నారు. మరి దాని మీద ఏమైనా చర్చ సాగిందా అన్నది ఉంది. ఇక విజయవాడ మేయర్ సీటు విషయంతో పాటు ఏపీలో ఎక్కడెక్కడ ఎలా రాజకీయం ఉంది అన్న దాని మీద కూడా చర్చించారా అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు. మొత్తం మీద చూస్తే పవన్ కళ్యాణ్ రాధాల భేటీ వెరీ ఇంట్రెస్టింగ్ అనే అంతా అంటున్నారు.