వంగవీటి రాధా మరోసారి రాంగ్ స్టెప్ వేశారా ?
వంగవీటి రంగా అంటేనే ఒక పాజిటివ్ వైబ్రేషన్. అది ఒక బలమైన సామాజిక వర్గంలో ఆరాధ్యనీయ మైన పిలుపు.
By: Satya P | 14 Oct 2026 10:00 PM ISTవంగవీటి రంగా అంటేనే ఒక పాజిటివ్ వైబ్రేషన్. అది ఒక బలమైన సామాజిక వర్గంలో ఆరాధ్యనీయ మైన పిలుపు. కోస్తా జిల్లాలలో రంగా అన్న రెండు అక్షరాలు తారకమంత్రంగా చేసుకుని ముందుకు సాగే జనాభా అత్యధిక శాతం ఉంది. అలాంటి రంగాకు వారసుడు అంటే అది ఒక బ్రాండ్ గానే చూడాలి. వంగవీటి రాధాకృష్ణ రంగా తనయుడిగా రాజకీయాల్లోకి ఇప్పటికి రెండు దశాబ్దాలకు ముందే ప్రవేశించారు. ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఆ తరువాత నుంచి మాత్రం రాజకీయ అదృష్టాన్ని అందుకునే విషయంలో వెనకబడ్డారు. దానికి కారణాలు ఎన్నో ఉన్నా ఆయన రాజకీయంగా తీసుకున్న నిర్ణయాలు కొన్ని అలా ప్రభావితం చేశాయని కూడా చెబుతారు. తాజాగా ఆయన టీడీపీ నుంచి జనసేనలోకి మారడంతో కొత్త చర్చకు తెర లేస్తోంది.
ఉన్న చోటుని వీడి :
రాధా రాజకీయ జీవితం చూస్తే ఆయన ఎన్నికల ముందే ఒక పార్టీ నుంచి వేరొక పార్టీలోకి మారుతూ రావడం కనిపిస్తుంది. అది కూడా ఆయన వేసుకున్న అంచనాలేమో కానీ ఆయన డెసిషన్ మాత్రం బూమరాంగ్ అవుతూ వచ్చింది అని గుర్తు చేస్తారు. ఒక్కసారి వెనక్కి వెళ్తే కనుక 2004లో కాంగ్రెస్ తరఫున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయిన రాధాకృష్ణ 2009లో మాత్రం మరోసారి ఎమ్మెల్యే కావడం డ్యాం ష్యూర్ గా ఆ పార్టీలో ఉన్నా ప్రజారాజ్యం పార్టీలోకి చేరిపోయారు.అలా 2009లో ఆయన ప్రజారాజ్యం తరఫున విజయవాడ సెంట్రల్ కి పోటీ చేసి పరాజాయం పాలు అయ్యారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ అందుకుని మల్లాది విష్ణు గెలిచారు.
వైసీపీలో సైతం :
ఇక 2014 నాటికి రాధా వైసీపీలో చేరారు. ఆ పార్టీలో అయిదేళ్ళ పాటు ఉండి ఎంతగానో పరిశ్రమించారు. ఇక 2019 ఎన్నికల్లో రాధాకు మచిలీపట్నం ఎంపీ టికెట్ ఇస్తామని వైసీపీ హైకమాండ్ చెప్పింది. కానీ కరెక్ట్ గా ఎన్నికల సమయంలో ఆయన టీడీపీలోకి వెళ్ళిపోయారు. వైసీపీ ప్రభంజనంలో టీడీపీ ఓటమి పాలు అయింది. అదే రాధా వైసీపీలో ఉంటే కచ్చితంగా మంచిలీపట్నం ఎంపీ అయ్యేవారు అని గుర్తు చేస్తున్నారు. ఇక 2024 ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. రాధాకు ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇస్తామని చెప్పారు. అంతే కాదు రాజ్యసభ సీటు ఆఫర్ కూడా ఉందని అంటున్నారు. ఇలా భారీ ఆఫర్లే ఆయనకు ఉన్నాయి.
మంత్రిగా ఎదిగేందుకు :
కానీ ఇన్నాళ్ళూ ఎంతో ఓర్పుతో వ్యవహరించిన వంగవీటి సడెన్ గా జనసేనలో చేరిపోయారు. దాంతో ఆయన రాజకీయ జీవితంలో ఇదొక కొత్త మలుపు అని అంటున్నారు. నిజానికి వంగవీటి టీడీపీలోనే కొనసాగి ఉంటే ఒక్క ఏడాది ఆగితే చాలు 2027లో ఏపీలో రెండు పదులకు పైగా ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అవుతాయి. అందులో కచ్చితంగా వంగవీటికి ఒక సీటు ఖాయమని అంటున్నారు. పోనీ కాదూ కూడదు అనుకుంటే 2028లో రాజ్యసభ సీట్లు మరిన్ని వస్తాయి. వాటిలో కూడా అకామిడేషన్ ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే 2029లో ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి చాన్స్ రావచ్చు అన్నది కూడా ఉంది. అలా ఈ సీనియర్ నేత మంత్రిగా ఎదిగేందుకు వీలు ఉంది. కానీ టీడీపీని కాదని వంగవీటి ఇపుడు జనసేనలోకి చేరిపోయారు.
జనసేనలోకి అంటే :
స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఈ కీలక సమయంలో రాధాకృష్ణ జనసేనలోకి వెళ్ళడం చూసిన వారు అభిమానులు అనేది ఒక్కటే మాట ఆయన పార్టీ మారడం అవసరమా అని. ఆయన ఒక రాష్ట్ర స్థాయి నాయకుడుని, జనసేనలోకి వెళ్ళి మేయర్ పదవిని తీసుకుంటే అది ఆయన రాజకీయ జీవితానికి అనుభవానికి ప్రత్యేకించి రంగా అభిమానులకు కూడా ఇబ్బందికరమే అని అంటున్నారు మరి రాధాక్రిష్ణ అయితే జనసేనలో చేరితే దక్కేది ఏమి ఉంటుంది అంటే ఆయన విజయవాడ మేయర్ గా ఆయన పోటీ చేస్తారు అని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. ఇటీవల రాధాకృష్ణ మంగళగిరి ఆఫీసుకు వెళ్ళి పవన్ కళ్యాణ్ ని కలుసుకున్నారు. ఇది మర్యాదపూర్వకమైన భేటీ అని చెబుతున్నా ఆనాడే ఆయన పార్టీ మార్పు మీద గుసగుసలు వినిపించాయి. ఇపుడు చూస్తే పవన్ కళ్యాణ్ సమక్షంలో రాధా పార్టీలో ఆయన చేరిపోయారు.
టీడీపీలో ఉంటేనే :
ఇక రాధా పార్టీ మారడం మీద అయితే రకరకాలైన చర్చ అయితే సాగుతోంది. ఆయన టీడీపీని అట్టేబెట్టుకుని ఉంటేనే బాగుంటుంది అన్నది పలువురు నుంచి వస్తున్న సూచన. రానున్న రోజులలో ఆయన స్థాయికి తగిన పదవి లభిస్తుందని మంత్రి యోగం కూడా అదే పార్టీలో దక్కే చాన్స్ ఉందని అంటున్నారు. అయితే విజయవాడ రాజకీయ సమీకరణలు, సామాజిక అంశాలు వంగవీటి కుటుంబం బలం వంటి నేపథ్యాలను తీసుకుని రాధాను జనసేనలోకి తీసుకున్నారు అని అంటున్నారు. మరి జనసేనలో రాధా చేరికతో ఆయన రాజకీయం ఏ విధంగా ఉంటుంది అన్నదే పెద్ద చర్చగా ఉంది మరి. ఒకవేళ ఆయన మేయర్ గా గెలిచినా అక్కడితోనే రాజకీయం అనుకుంటే ఆయనకు పెద్ద పదవులు ఎపుడూ దూరంగానే ఉండిపోతున్నాయన్న యాంటీ సెంటిమెంట్ ని గుర్తు చేసుకోవాల్సిందే.
