Begin typing your search above and press return to search.

ఆశా కిర‌ణ్‌.. ఆదిలోనే త‌డ‌బాట్లా.. !

వంగ‌వీటి మోహ‌న్ రంగా కుమార్తె.. వంగ‌వీటి ఆశా కిర‌ణ్‌.. ప్ర‌జాసేవ‌లోకి వ‌స్తున్న‌ట్టు ప్ర‌క‌టించి.. సంచ‌లనం రేపారు.

By:  Garuda Media   |   30 Dec 2025 8:00 AM IST
ఆశా కిర‌ణ్‌.. ఆదిలోనే త‌డ‌బాట్లా.. !
X

వంగ‌వీటి మోహ‌న్ రంగా కుమార్తె.. వంగ‌వీటి ఆశా కిర‌ణ్‌.. ప్ర‌జాసేవ‌లోకి వ‌స్తున్న‌ట్టు ప్ర‌క‌టించి.. సంచ‌లనం రేపారు. దీంతో ఆమెపై అన్ని వ‌ర్గాల్లోనూ ముఖ్యంగా కాపు సామాజిక వ‌ర్గంలో కొత్త ఆశ‌లు రేకెత్తాయి. ఆమె రాక‌తో రాజ‌కీయ య‌వ‌నిపై కొత్త పాలిటిక్స్ క‌నిపిస్తాయ‌ని అంద‌రూ భావించారు. ముఖ్యంగా రంగా వార‌సురాలిగా త‌న‌దైన శైలిలో కొత్త ముద్ర వేస్తార‌ని కూడా అనుకున్నారు. అయితే.. ఆమె వ్య‌వ‌హారం.. ఇప్పుడు చ‌ప్ప‌గా మారిపోయింది.

తొలిరోజు ప్ర‌జా సేవ కోసం వ‌స్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన ఆశా కిర‌ణ్‌.. చాలా ఆచితూచి మాట్లాడారు. వివాదాస్ప ద రాజ‌కీయాలు చేయ‌బోన‌ని చెప్పారు. తాను ఏ పార్టీకీ అనుకూలం కాద‌ని.. ఏ పార్టీకి వ్య‌తిరేకం కూడా కాద ని చెప్పారు. పైగా.. అస‌లు ఇప్ప‌ట్లో రాజ‌కీయాల గురించి కూడా మాట్లాడ‌బోన‌న్నారు. ప్ర‌స్తుతం ప్ర‌జా సేవ కు మాత్ర‌మే తాను ప‌రిమితం అవుతాన‌ని ఆశా కిర‌ణ్ తేల్చి చెప్పారు. దీంతో ప్ర‌తి ఒక్కరిలోనూ ఆశా కిర‌ణ్ పై కొత్త ఆలోచ‌న‌లు వ‌చ్చాయి. వివాద ర‌హిత నాయ‌కురాలిగా ఆమె గుర్తింపు తెచ్చుకుంటార‌ని అనుకున్నారు.

కానీ.. అనూహ్యంగా ఇటీవ‌ల రంగా వ‌ర్ధంతి వేడుక‌ల్లో ఎవ‌రూఊహించ‌ని విధంగా ఆమె చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. టీడీపీ, వైసీపీ, జ‌న‌సేన పార్టీల‌ను బ‌లంగా టార్గెట్ చేస్తూ.. ఈ పార్టీలు రంగా పేరును వాడుకుంటున్నాయ‌ని.. కానీ.. రంగా అభిమానించే వారికి ఏం చేశార‌ని ఆమె ప్ర‌శ్నించారు. వాస్త‌వానికి.. ఆమెలో ఆ ఆవేద‌న ఉండి ఉండొచ్చు. కానీ, స‌మ‌యం ఇది కాదు క‌దా! అనే అభిప్రాయం అప్ప‌ట్లోనే వెలువ‌డింది. నిజానికి తొలి నాళ్ల‌లో అందునా తొల అడుగులో మీడియాను ఆకట్టుకునే ప్ర‌య‌త్నం చేయాలి.

ఈ క్ర‌మంలో త‌ట‌స్థంగా వ్య‌వ‌హ‌రించి ఉండాల్సిన ఆశాకిర‌ణ్‌.. తొలి సంద‌ర్భంలోనే ఆవేశానికి గుర‌య్యారు . త‌ద్వారా.. మీడియాకు దూర‌మ‌య్యారు. ఆశా కిర‌ణ్ ప్ర‌జా సేవ‌లోకి వ‌స్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన ద‌రిమిలా.. ఆమెకు బ‌ల‌మైన ప్రొజెక్ష‌న్ ల‌భించింది. కానీ, ఎప్పుడైతే.. మూడు పార్టీల‌నూ మూకుమ్మ‌డిగా విమ‌ర్శించా రో.. అప్పుడు ఆమె ప్రొజెక్ష‌న్ ఆగిపోయింది. దీంతో తొలి సారే.. తొలి అడుగులోనే ఆశా కిర‌ణ్‌కు ఊహించ‌ని ఎదురు దెబ్బ త‌గిలిన‌ట్ట‌యింది. ముందు ఆమె పుంజుకుని.. ప్ర‌జ‌ల్లో సానుభూతి, రంగా ప‌వ‌నాల‌ను ద‌క్కించుకున్నాక‌.. ప్ర‌శ్నించి ఉంటే బాగుండేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.