వంగా గీత.. రాజకీయ సన్యాసం ..!
మాజీ ఎంపీ, వైసీపీ నాయకురాలు వంగా గీత రాజకీయాలనుంచి తప్పుకుంటున్నారనే వాదన వినిపిస్తోంది.
By: Garuda Media | 3 Oct 2025 1:00 PM ISTమాజీ ఎంపీ, వైసీపీ నాయకురాలు వంగా గీత రాజకీయాలనుంచి తప్పుకుంటున్నారనే వాదన వినిపిస్తోంది. గత ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసిన ఆమె పవన్ కళ్యాణ్ కు గట్టి పోటీ ఇస్తారని అందరూ భావించారు. అయితే ప్రచారం బాగానే చేసినా.. మహిళా సెంటిమెంట్ బాగానే ఉన్నా.. అదే విధంగా స్థానికంగా వంగా గీతకు మంచి పేరు ఉన్నప్పటికీ.. కూటమి ప్రభావంతో గీత బలమైన పోటీ అయితే ఇవ్వలేకపోయారు. పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో విజయం దక్కించుకున్నారు. ఇక తర్వాత పిఠాపురంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు గీతను ఇబ్బందిలోకి నెట్టాయి.
ముఖ్యంగా వైసిపి బలహీన పడుతున్న క్రమంలో వంగ గీతకు పార్టీలో ప్రాధాన్యం తగ్గుతూ వస్తోంది. జగన్ కూడా ఆమెను పెద్దగా పట్టించుకోవడం లేదన్న వాదన కొన్నాళ్లుగా వినిపిస్తోంది. దీంతో ఏకంగా రాజకీయాల నుంచి తప్పుకునే ఆలోచనలో గీత ఉన్నారని ఆమె అనుకూల వర్గాలు చూచాయిగా చెబుతున్నాయి. దీంట్లో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది. అధికారికంగా ఇప్పటివరకు వంగా గీత ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు పెండం దొరబాబు ఒకప్పుడు పార్టీకి అండగా ఉన్నారు. కానీ, ఇటీవల ఆయన పార్టీ మారి జనసేనలో చేరిపోయారు.
ఫలితంగా వైసీపీకి అనుకూలంగా ఉన్న కార్యకర్తలు నాయకులు చాలామంది ఆయన వెంట జనసేనలోకి చేరిపోవడంతో వంగా గీత వచ్చినా ఇక్కడ రిసీవ్ చేసుకునే నాయకులు కనిపించడం లేదన్నది వాస్తవం. కాగా కాకినాడ నుంచి ఎంపీగా గెలిచిన వంగా గీత గతంలో పిఠాపురంలో ఉన్న ఇంటిని కాళీ చేసి కాకినాడలో నివాసం ఉంటున్నారు. దీంతో పిఠాపురానికి ఆమె విజిటింగ్ గెస్ట్ లాగా వస్తున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది. పైగా సమస్యలపై స్పందించకపోగా ఎన్నికల తర్వాత కేవలం రెండుసార్లు మాత్రమే ఇక్కడ పర్యటించారని కూడా స్థానికంగా వినిపిస్తున్న మాట.
అయితే ఆమెపై సానుభూతి అయితే ఎక్కడికీ పోలేదు. మహిళ నాయకురాలుగా మంచి పని చేశారన్న పేరు తెచ్చుకున్నారు. అయితే, వైసిపి నాయకుల మధ్య చోటు చేసుకున్న దూరం ముఖ్యంగా పెండం దొరబాబు పార్టీ మారడంతో పాటు వంగా గీత నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో సమయం కేటాయించిన కారణంగా గీతకు ఇక్కడ ప్రాధాన్యం తగ్గింది. ఇక ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న జగన్.. గీతకు పార్టీలోనూ ప్రాధాన్యం తగ్గించారని వాదన వినిపిస్తోంది.
అయితే దీనిపై అటు పార్టీ అధిష్టానం.. ఇటు వంగా గీత నేరుగా ఎక్కడ స్పందించలేదు. కానీ, అంతర్గతంగా మాత్రం రాజకీయాలనుంచి ఆమె తప్పుకుంటారని, వచ్చే ఎన్నికల నాటికి కేవలం మద్దతుగా మాత్రమే వ్యవహరిస్తారని అంటున్నారు. మరి ఇదే జరిగితే పిఠాపురంలో వైసీపీకి భారీ దెబ్బ తగలడం ఖాయమని చర్చ నడుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
