వందేమాతర గీతం వరస మారుతోంది...బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ !
ఇక వందేమాతరం అన్నది గడచిన శతాబ్దంతో ఎంతగా ప్రభావితం చేసిందో చెప్పాల్సిన పని లేదు.
By: Satya P | 21 Aug 2026 9:15 AM ISTవందేమాతరం మళ్ళీ రగులుతోంది. ఈసారి దేశ భక్తితో పాటు రాజకీయ యుక్తి కూడా తోడై 150 ఏళ్ల ఈ గీతాన్ని మరో మారు చర్చకు తావిచ్చేలా చేస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఇటీవల ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో వందేమాతరం గీతాన్ని ఆరు చరణాలూ మొత్తం ఆలపించాలని చట్ట సవరణ చేసింది. అలాగే జాతీయ గీతంగా కూడా దానిని పేర్కొంది. దాంతో వెంటనే వచ్చిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యాలయంలో ఈ గీతం ఆలపిస్తూంటే సోనియాగాంధీ అడ్డుకున్నారు అని కూడా పెద్ద ఎత్తున చర్చ సాగింది. అది రాజకీయ రచ్చగా కూడా మారింది. ఇక తాజాగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో వందేమాతరం గీతాన్ని రెండు చరణాలు మాత్రమే ఆలపించాలని తీర్మానం చేయడం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా అగ్గి రాజేస్తోంది.
వందేమాతరం నేపథ్యం :
ఇక దేశంలో వందేమాతరం గీతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మరెంతో పవిత్రత కూడా ఉంది. ఈ వందేమాతరం గీతాన్ని 1875 నవంబర్ 7న బంకించంద్ర ఛటర్జీ రచించారు. ఈ పూర్తి గీతంలో మొత్తం ఆరు చరణాలు ఉన్నాయి. బంకించంద్ర ఛటర్జీ రాసిన ఆనందమఠ్ నవలలో భాగంగా 1882 లో ఇది ప్రచురితమైంది. ఆ సమయంలో దేశంలో స్వాతంత్ర్య పోరాటం సాగుతోంది. దాంతో ఈ వందేమాతరం గీతం భారత స్వాతంత్ర పోరాటంలో భాగమై ప్రజలలో దేశభక్తిని నింపింది. అయితే ఈ గీతంలో మొదటి రెండు చరణాలనే ప్రారంభంలో జాతీయ గీతంగా అధికారికంగా పరిగణించారు. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అధికారిక కార్యక్రమాలలో ఇప్పుడు ఆరు చరణాలను పూర్తిస్థాయిలో ఆలపించాలని సూచించారు.
కాంగ్రెస్ మీద అమిత్ షా ఫైర్ :
ఇదిలా ఉంటే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో వందేమాతరం గీతాన్ని రెండు చరణాలు మాత్రమే ఆలపించాలని తీర్మానం చేయడం పట్ల కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫైర్ అయ్యారు. ఈ తరహా నిర్ణయం జాతి వ్యతిరేకమని పార్లమెంట్ చేసిన చట్టాన్ని అవమానించడమేనని ఆయన ఆరోపించారు. 1937 నాటి కాంగ్రెస్ తీర్మానాన్ని మళ్ళీ తెరపైకి తేవడంపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవ్లం బుజ్జగింపు రాజకీయాల వల్లే నాటి కాంగ్రెస్ వందేమాతరాన్ని విభజించిందని అదే దేశ విభజనకు పునాది వేసిందని ఆయన విమర్శించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం వందేమాతరం పూర్తి ఆరు చరణాలకు చట్టబద్ధత కల్పించి చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దిందని ఆయన పేర్కొన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ మళ్లీ ఓటు బ్యాంకు రాజకీయాలకే పరిమితమైందని అమిత్ షా దుయ్యబట్టారు.
సెలబ్రిటీల రియాక్షన్ :
ఇక వందేమాతరం గీతం మీద సెలిబ్రిటీలు కూడా తమకు తోచిన విధంగా స్పందిస్తున్నారు. వందేమాతరం తొలి రెండు చరణాలకే పరిమితం చేయాలని చెప్పిన నిన్నటి తరం హీరోయిన్ షర్మిలా ఠాగూర్ సూచించడం విశేషం.
ఏకేశ్వరోపాసన నమ్మకాలకు మిగతా చరణాలు విరుద్ధమని ఆమె చెప్పడం కూడా సంచలనంగా మారింది. మరో వైపు చూస్తే జనగణమన గీతం స్థానంలో వందేమాతరంను జాతీయ గీతంగా మార్చాలని నటుడు ముఖేష్ ఖన్నా కొత్త వాదనను తెర పైకి తెచ్చారు. దీంతో ఈ విషయం కాస్తా చర్చగా కూడా కొత్త దశను చేరుకుంటోంది అని అంటున్నారు.
భిన్నాభిప్రాయాలు ఎందుకు :
ఇక వందేమాతరం అన్నది గడచిన శతాబ్దంతో ఎంతగా ప్రభావితం చేసిందో చెప్పాల్సిన పని లేదు. అయితే ఒక వర్గం పాడడానికి నిరాకరించింది అన్నది ఉంది. వందేమాతరం గీతం పూర్తి రూపం లేదా దానిని ఆలపించడంపై గతంలోనూ ప్రస్తుత కాలంలోనూ కొన్ని వర్గాల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతూ వస్తున్నాయి. వందేమాతరం గీతంలో మొదటి రెండు శ్లోకాలు కాకుండా తర్వాతి చరణాలలో హిందూ దేవతల ప్రస్తావన ఉండటం వల్ల ఇతర వర్గాలు పాడడానికి నిరాకరిస్తూంటారు. జాతీయ ఉద్యమ కాలంలోనూ ఈ గీతంలోని మొదటి రెండు చరణాలకే పరిమితం చేయాలనే వాదన కొనసాగింది. పూర్తి గీతాలాపన దేశంలో తరచూ రాజకీయ పరమైన అలాగే సామాజిక పరమైన చర్చలకు దారితీస్తోంది. ఇపుడు ఏ రకమైన రాజకీయ రచ్చగా మారుతుందో అన్నది చూడాల్సి ఉంది.
