వందేమాతరం...బీజేపీ కౌంటర్ స్ట్రాటజీ !
వందేమాతరం అన్నది జాతీయ గేయం. ప్రతీ ఒక్కరిలో దేశ భక్తిని రగిలించి దేశానికి స్వేచ్ఛా వాయువులు ప్రసాదించడంతో అత్యంత ముఖ్య పాత్ర పోషించిన గేయం అది.
By: Satya P | 23 Aug 2026 12:10 AM ISTవందేమాతరం అన్నది జాతీయ గేయం. ప్రతీ ఒక్కరిలో దేశ భక్తిని రగిలించి దేశానికి స్వేచ్ఛా వాయువులు ప్రసాదించడంతో అత్యంత ముఖ్య పాత్ర పోషించిన గేయం అది. అందులో ఒక్కో అక్షరం నిప్పు కణిక గా మారి అనాటి తరాన్ని వేడెక్కించింది. అంతే కాదు బ్రిటిష్ వారి గుండెలలో మంటలను రేపింది. అంత గొప్ప గీతం మీద ఇపుడు రాజకీయ రచ్చ సాగుతోంది. వందేమాతరం పూర్తి ఆరు చరణాలను పాడాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా చట్ట సవరణ చేసింది. అయితే అలా కాదని కేవలం రెండు చరణాలే పాడాలన్నది తమ విధానం అని 1937 నాటి ఆనాటి కాంగ్రెస్ చేసిన తీర్మానానికి కట్టుబడి ఉంటామని ఆ పార్టీ చెబుతోంది. వర్కింగ్ కమిటీలో కూడా దీని మీద తీర్మానం చేసి మరీ కాంగ్రెస్ వందేమాతరం మీద తన అభిప్రాయాన్ని గట్టిగా నొక్కి చెప్పింది.
జనంలోనే పాడనున్న బీజేపీ :
వందేమాతరం గేయం మీద బీజేపీ కాంగ్రెస్ ని దుమ్మెత్తిపోస్తోంది. ఆ పార్టీకి దేశ భక్తి లేదని పూర్తిగా బుజ్జగింపు విధానాలే కాంగ్రెస్ పార్టీ విధానం అని కూడా మండిపడుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అయితే ఇదే విషయం మీద కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. మరో వైపు చూస్తే వందేమాతరం గేయాన్ని ప్రజలలోకి తీసుకుని వెళ్ళాలని బీజేపీ చూస్తోంది. ప్రజలతోనే ఈ గేయాన్ని ఆరు చరణాలు పాడించి అక్కడ నుంచే రీ సౌండ్ చేయడం ద్వారా కాంగ్రెస్ తీరు తప్పు అని కోట్లాది మందితో అనిపించాలని పక్కా ప్లాన్ చేస్తోంది. దాంతో దేశవ్యాప్తంగా వందేమాతరం గేయం ప్రచార యాత్ర కు బీజేపీ శ్రీకారం చుడుతోంది.
కాంగ్రెస్ మీదనే గురి :
కాంగ్రెస్ వి పూర్తిగా ఓటు బ్యాంక్ రాజకీయాలు అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ విమర్శించారు. ఆయన ఢిల్లీలో పార్టీ జాతీయ పదాధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ మీద నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ వి ఎపుడూ ఓటు బ్యాంక్ కోసం చేసే రాజకీయాలే అని దుయ్యబట్టారు. వందేమాతరం గేయం అన్నది ఆరు పూర్తి చరణాలు అని ఆయన అన్నారు. భారత జాతీయ గేయం వందేమాతరం పూర్తి ఆరు చరణాల చారిత్రక ప్రాముఖ్యతను గొప్పతనాన్ని దేశంలోని ప్రతి మూలకు తీసుకువెళ్లేందుకు బీజేపీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రత్యేక ప్రచార యాత్రను నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. కేవలం మొదటి రెండు చరణాలకే పరిమితం చేయకుండా, మొత్తం ఆరు చరణాలతో కూడిన సంపూర్ణ వందేమాతరం గేయ గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేయడం ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. ముఖ్యంగా యువతలో అవగాహన పెంపొందిస్తామని చెప్పారు. తెల్లవారి మీద పోరాటంలో ఈ గేయం అందించిన స్ఫూర్తిని, అమరవీరుల త్యాగాలను భావితరాలకు, యువతకు అర్థమయ్యేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం ఈ యాత్ర లక్ష్యంగా వెల్లడించారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు జాతీయ గేయాన్ని బలి చేయడం సరికాదన్నారు.
బీజేపీ అస్త్రంగానేనా :
వందేమాతరం గేయం సరైన సమయంలో బీజేపీకి అందివచ్చిన అస్త్రంగా భావించవచ్చా అంటే ప్రస్తుతానికి అవును అనే జవాబు వస్తోంది. నిజానికి బీజేపీ పట్ల ఈ మధ్య కాలంలో కొంత అసంతృప్తి అయితే యువతతో పాటు వివిధ వర్గాలలో వస్తోంది. అదే సమయంలో భావోద్వేగంతో కూడుకున్న అంశం అయితే బీజేపీకి దొరకడం లేదు, మరి బీజేపీ ఏ వ్యూహంతో వందేమాతరం గేయాన్ని జాతీయ గేయంగా చేస్తూ ఆరు పూర్తి చరణాలు పాడాలి అని నిర్ణయించిందో తెలియదు కానీ ఇపుడు అదే ఆయుధంగా మారుతోంది. కాంగ్రెస్ సహా విపక్షాలు కచ్చితంగా దీనిని వ్యతిరేకిస్తాయన్నది బీజేపీకి బాగా తెలుసు అని అంటున్నారు. దానికి తగినట్లుగానే కాంగ్రెస్ యాక్షన్ కూడా ఉంది. దాంతో బీజేపీకి కొత్త దారి కనిపిస్తోంది. నిజానికి వందేమాతరం పవర్ ఫుల్ గేయం. దానిని జనంలో ఉంచి ఏ విధంగా భావోద్వేగాన్ని సాధిస్తుంది అన్న దాని మీదనే బీజేపీ వ్యూహాల గెలుపు ఆధారపడి ఉంది అని అంటున్నారు. ఒక విధంగా బీజేపీ కొత్త అధ్యక్షుడు బిగ్ టాస్క్ ని తలకెత్తుకున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
