Begin typing your search above and press return to search.

'వందేమాత‌రం'పై తొలిసారి చ‌ర్చ‌.. రీజ‌నేంటి?

1950లో దీనికి జాతీయ గేయం హోదా కూడా క‌ల్పించారు. అప్ప‌టి నుంచి ఇప్ప‌టికీ.. ఎప్ప‌టికీ.. ఇదే జాతీయ గేయం.

By:  Garuda Media   |   8 Dec 2025 8:00 PM IST
వందేమాత‌రంపై తొలిసారి చ‌ర్చ‌.. రీజ‌నేంటి?
X

జాతీయ గేయంగా నిత్యం పాఠ‌శాలల్లో విద్యార్థులు, ఏదైనా జాతీయ పండుగల సంద‌ర్భంలో కార్యాల‌యా ల్లోనూ వినిపించే `వందేమాత‌రం` గురించి ప్ర‌త్యేకంగా ఎవ‌రికీ ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు అలాంటి ప‌రిస్థితి కూడా రాలేదు. కానీ, అలాంటి వందేమాత‌రంపై.. దేశానికి స్వాతంత్రం వ‌చ్చిన 77 సంవ‌త్స‌రాల త‌ర్వాత‌.. తొలిసారి పార్ల‌మెంటులో వందేమాత‌రం గేయంపై చ‌ర్చ చేప‌ట్టారు.

అయితే.. ఇలా ఎందుకు చేప‌ట్టారు? అనే ప్ర‌శ్న‌కు కేంద్ర ప్ర‌భుత్వం చెబుతున్న రీజ‌న్‌.. వందేమాత‌రం గేయానికి 150 నిండాయ‌ని... అందుకే దీని ప్రాశస్త్యాన్ని ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయాల‌ని అంటోంది. ఇది నిజ‌మేనా? అంటే.. ఒకింత నిజ‌మే. ప‌శ్చ‌మ బెంగాల్ రాష్ట్రానికి చెందిన బంకిం చంద్ర ఛ‌ట‌ర్జీ రచించిన `ఆనంద‌మ‌ఠ్‌` న‌వ‌ల్లోని గేయ‌మే.. వందేమాత‌రం. దీనిలో మొత్తం 8 చ‌ర‌ణాలు ఉన్నాయి. అయితే.. స్వాతంత్ర సంగ్రామంలో ఇది పెద్ద ఎత్తున కీల‌క పాత్ర పోషించింది.

1950లో దీనికి జాతీయ గేయం హోదా కూడా క‌ల్పించారు. అప్ప‌టి నుంచి ఇప్ప‌టికీ.. ఎప్ప‌టికీ.. ఇదే జాతీయ గేయం. అయితే... ఇప్ప‌టి వ‌ర‌కు తెలియ‌ని ప‌ర‌మ‌స‌త్యం, లోగుట్టు దీనివెనుక ఏముంది? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఇదే.. రాజకీయం!. ఆశ్చ‌ర్యం కాదు.. వందేమాత‌రం గేయాన్ని కాంగ్రెస్ గ‌త పాల‌కులు అవ‌మానించార‌ని.. దీనిలోని 8 చ‌ర‌ణాల‌ను కాకుండా.. తొలి రెండు చ‌ర‌ణాల‌ను మాత్ర‌మే గేయంగా ఆమోదించార‌న్న‌ది ప్ర‌ధాని నరేంద్ర మోడీ చేస్తున్న వాద‌న‌.

అయితే.. వాస్త‌వానికి జాతీయ గేయంగా ఉండాల‌న్న చ‌ర్చ వ‌చ్చినప్పుడు..(పార్ల‌మెంటు ప‌త్రాల ఆధారంగా )అన్ని పక్షాలు కూర్చుని చ‌ర్చించి.. తొలి రెండు చ‌ర‌ణాల‌ను మాత్ర‌మే ఆమోదించాయి. దీనిని ఎవ‌రూ కాద‌న‌లేరు. కానీ దీనిని కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మే చేసింద‌న్న‌ది మోడీ స‌హా బీజేపీ వాద‌న‌. అందుకే.. దీనిని పార్ల‌మెంటులో పెట్టి.. కాంగ్రెస్‌ను ఏకేయ‌డం ప్ర‌ధాన క‌ర్త‌వ్యం. ఇక‌, రెండో అంశం.. ఈ గేయం కార‌ణంగానే.. దేశ విభ‌జ‌న జ‌రిగింద‌న్న‌ది. ఇది ఎక్క‌డా ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ విన‌లేదు.. మోడీ త‌ప్ప ఎవ‌రూ అన‌లేదు కూడా!. సో.. ఈ రెండు అంశాల ప్రాతిప‌దిక‌నే.. 150 ఏళ్ల చ‌రిత్ర పూర్తి చేసుకుంద‌న్న కార‌ణాన్ని చూపి వందేమాత‌రంపై చ‌ర్చ చేప‌ట్టారన్న‌ది నిర్వివాదాంశం.