'వందేమాతరాన్ని' అవమానిస్తే.. జైలే - కేంద్రం సంచలన నిర్ణయం
జాతీయ గేయం `వందేమాతరం`పై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
By: Garuda Media | 7 May 2026 12:58 PM ISTజాతీయ గేయం `వందేమాతరం`పై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్‌లో విజయం అనంతరం.. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. ఈ దిశగా ఆలోచన చేయడం.. కేంద్ర మంత్రి వర్గం కూడా దీనికి ఆమోదం తెలపడం.. వంటివి దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. అంతేకాదు.. ప్రస్తుతం `జనగణమన` జాతీయ గీతానికి ఉన్న `హోదా`ను కూడా వందేమాతరం గేయానికి కల్పించాలని కూడా కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర మంత్రివర్గంలోనూ నిర్ణయం తీసుకున్నారు.
చట్ట సవరణ ద్వారా..
వందేమాతరం గేయానికి.. గౌరవాన్ని తీసుకురావాలని భావిస్తున్నకేంద్ర ప్రభుత్వం.. గతంలోనూ సినిమా హాళ్లలో లేచినిలబడాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సినిమాలు ప్రారంభమయ్యే సమయంలో జనగణమన గీతాన్ని ఆలపించారు. ఆ సమయంలో లేచి నిలబడే సంస్కృతికి శ్రీకారంచుట్టారు. అయితే.. సుప్రీంకోర్టు జోక్యంతో కొన్నాళ్లకు దీనిని వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు వందేమాతరం గేయానికి అంతే గౌరవం ఇవ్వాలని తలపోస్తున్నారు. ఈ క్రమంలో జాతీయ గౌరవానికి అవమానాల నివారణ చట్టం-1971కి సవరణలు చేసే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ చట్టంలోని సెక్షన్ 3కి చేసిన సవరణ అనంతరం, బెంగాల్ దిగ్గజం బంకిం చంద్ర చటోపాధ్యాయ రచించిన 'వందేమాతరం' గీతానికి జాతీయ గీతంతో సమానమైన హోదా లభిస్తుంది.
ప్రస్తుతం, జాతీయ గీతం జనగణమన.. గీతాలాపనకు అంతరాయం కలిగిస్తే.. జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించేందుకు చట్టం వీలు కల్పిస్తోంది. జాతీయ జెండాను లేదా రాజ్యాంగాన్ని అవమానించినందుకు కూడా ఇలాంటి శిక్షే ఉంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం, ఎవరైనా ఉద్దేశపూర్వకంగా భారత జాతీయ గీతాలాపనను అడ్డుకున్నా లేదా ఆ గీతాలను ఆలపిస్తున్న సభకు ఆటంకం కలిగించినా, వారికి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష, లేదా జరిమానా, లేదా రెండూ విధించేలా చట్టం ఉంది.
2005లో, త్రివర్ణ పతాకాన్ని నడుము కింద ధరించడం లేదా చేతిరుమాళ్లు, దిండ్లు మొదలైన వాటిపై ముద్రించడం వంటి అగౌరవకరమైన ఉపయోగాన్ని నిషేధించడానికి చట్టాన్ని సవరించారు. బెంగాల్‌లో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి చరిత్ర సృష్టించిన బీజేపీ ఒక రోజు తర్వాత వందేమాతరంపై నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారుతోంది. పశ్చిమ బెంగాల్‌లో 294 స్థానాలకు గాను ఆ పార్టీ 208 స్థానాలను గెలుచుకుని, మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్‌ను 80 స్థానాలకే పరిమితం చేసింది.
