వందేమాతరం వినగానే ఏం చేయాలో తెలుసా? కేంద్రం కొత్త నిబంధనలు
వందేమాతరం గేయాన్ని ఆలపించే సమయంలో ఎవరైనా ఉల్లంఘనలకు పాల్పడిన, అవమానించినా నేరంగా పరిగణించే బిల్లుకు పార్లమెంటు ఉభయసభలు ఆమోదం తెలిపాయి.
By: Tupaki Political Desk | 31 July 2026 2:54 PM ISTవందేమాతరం గేయాన్ని ఆలపించే సమయంలో ఎవరైనా ఉల్లంఘనలకు పాల్పడిన, అవమానించినా నేరంగా పరిగణించే బిల్లుకు పార్లమెంటు ఉభయసభలు ఆమోదం తెలిపాయి. రాష్ట్రపతి సంతకం తర్వాత ఈ బిల్లు చట్ట రూపం దాల్చనుంది. ‘ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్-1971’ (జాతీయ అవమానాల నిరోధక చట్టం)లో ఇప్పటివరకు మన రాజ్యాంగం, జాతీయ జెండా, జాతీయ గేయం జనగణమనకు మాత్రమే రక్షణ ఉండేది. వందేమాతరం కూడా జాతీయ గేయమై అయినప్పటికీ ఇప్పటివరకు ఈ రక్షణ లేదని చెబుతున్నారు. అయితే ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన బిల్లుతో ఇకపై జాతీయ అవమానాల నిరోధక చట్టంలో వందేమాతరం గేయానికి స్థానం దక్కింది.
ప్రతి భారతీయుడు ఎంతో గర్వంగా, భక్తిశ్రద్ధలతో ఆలపించే జాతీయ గేయం ‘వందేమాతరం’ ఇకపై పూర్తిస్థాయి చట్టబద్ధతను సంతరించుకోనుంది. మన జాతీయ గీతం ‘జనగణమన’కు ఏ విధంగా అయితే అత్యున్నత చట్టపరమైన రక్షణ ఉందో, అదే రీతిలో ఇక నుంచి జాతీయ గేయం వందేమాతరానికి కూడా కఠినమైన నిబంధనలు వర్తింపజేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో వందేమాతరం ఆలపించేటప్పుడు ఇకపై ప్రతి ఒక్కరూ విధిగా పాటించాల్సిన నియమ నిబంధనలు, ఉల్లంఘిస్తే ఎదురయ్యే పరిణామాలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి.
దేశభక్తిని, జాతీయ సమైక్యతను చాటే వందేమాతరం గేయ పఠనంలో ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన చట్టపరమైన నిబంధనలు లేకపోవడం వల్ల పలుమార్లు అపసవ్య ధోరణులు చోటుచేసుకున్నాయని చెబుతున్నారు. దీనిని నివారించేందుకు ప్రభుత్వం ఈ బిల్లులో ముఖ్యమైన మార్పులను పొందుపరిచింది. ఇప్పటివరకు వందేమాతరంలో కేవలం మొదటి రెండు చరణాలు మాత్రమే పాడటం లేదా సంక్షిప్తంగా ముగించడం జరిగేది. కానీ తాజా సవరణ బిల్లు ప్రకారం వందేమాతరం గేయాన్ని పూర్తిగా అంటే మొత్తం 6 చరణాలు విధిగా ఆలపించాల్సి ఉంటుంది. కేవలం కొద్ది భాగం మాత్రమే పాడితే అది నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుంది.
అంతేకాకుండా జాతీయ గీతం పాడుతున్నప్పుడు ఎలాగైతే గౌరవసూచకంగా నిలబడతామో, వందేమాతరం ఆలపించేటప్పుడు కూడా గౌరవంతో వ్యవహరించాల్సివుంటుంది. గేయం ఆలపిస్తున్న సమయంలో నిరుత్సాహంగా లేదా వ్యంగ్యంగా ఉండటం అగౌరవంగా భావిస్తారని పరిశీలకులు చెబుతున్నారు. నిటారుగా, రెండు చేతులను సమానంగా కిందికి ఉంచుకుని క్రమశిక్షణతో నిలబడాలని సూచిస్తున్నారు. ఫోన్లు చూడటం, ఇతరులతో మాట్లాడటం కూడా అగౌరవంగానే భావిస్తారని చెబుతున్నారు.
వందేమాతరం పాడుతున్న సమయంలో తోటివారితో అస్సలు మాట్లాడకూడదు. సెల్ ఫోన్లు వాడుకోవడం లేదా ఇతర వ్యాపకాలలో నిమగ్నం కావడం పూర్తిగా నిషేధించినట్లు చెబుతున్నారు. అదేవిధంగా సినిమాలు, ఇతర ప్రైమ్‌టైమ్ షోలలో ఇష్టానుసారంగా వందేమాతరం గేయాన్ని వినియోగించడానికి వీలుండదని అంటున్నారు. దీనికి ప్రత్యేక అనుమతులు, నియంత్రణలు వర్తిస్తాయని చెబుతున్నారు. సరదాగా, రింగ్‌టోన్లుగా వాడకూడదని నిబంధనలు చెబుతున్నాయి.
ఎవరైనా నేరుగా కేసు పెట్టే అవకాశం
తాజా నిబంధనల ప్రకారం వందేమాతరం గేయాన్ని సరిగ్గా పాడకపోయినా, నిబంధనలను ఉల్లంఘించినా సమాజంలో ఎవరైనా సరే బాధ్యులపై నేరుగా కేసులు పెట్టేందుకు చట్టం అవకాశం కల్పిస్తోంది. ఒక వ్యక్తి వందేమాతరం గేయాన్ని పూర్తిగా పాడలేదని లేదా అగౌరవపరిచాడని భావిస్తే ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. అయితే, ఆరోపణలను నిరూపించే బాధ్యత ఫిర్యాదుదారుపైనే ఉంటుంది. వందేమాతరాన్ని అవమానించినా లేదా పాడుతున్నప్పుడు ఉద్దేశపూర్వకంగా అడ్డు తగిలినా అది తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది.
ఉల్లంఘిస్తే శిక్ష ఎంటంటే..?
జాతీయ గేయ గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించినట్లు రుజువైతే నిందితులు కఠినమైన శిక్షలు ఎదుర్కొనవలసి ఉంటుంది. పూర్తి చరణాలు పాడకపోవడం లేదా అసంపూర్ణంగా వదలడం చేస్తే జాతీయ అవమానాల నిరోధక చట్టం కింద క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. తాజా చట్టసవరణ ప్రకారం నిందితులకు మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. వ్యంగ్య చేష్టలు, ఫోన్లు మాట్లాడితే రూ. 1 లక్ష నుంచి రూ. 10 లక్షల వరకు జరిమానాతో పాటు తగిన శిక్షలు ఉంటాయి. స్వాతంత్ర్య సంగ్రామంలో జాతిని ఏకం చేసిన మహోజ్వల గేయం వందేమాతరం. స్వాతంత్ర్య పోరాటంలో ప్రతి ఒక్కరిలో దేశభక్తిని రగిలించిన ఈ గీతానికి సముచిత గౌరవం దక్కేలా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్ట సవరణ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని అంటున్నారు. ఇకపై ప్రతి పౌరుడు ఈ నిబంధనలను విధిగా పాటిస్తూ, జాతీయ గేయ పట్ల తమ గౌరవాన్ని చాటుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.
